- అభివృద్ధి చేసి ప్రజా మన్ననలు పొందండి
- టీడీపీ నాయకులకు వైఎస్‌ఆర్‌సీపీ నేతల హితవు
- డోన్‌లో విజయవంతమైన వైఎస్‌ఆర్‌సీపీ ప్లీనరీ
- టీడీపీ పాలనపై నిప్పులు చెరిగిన
మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి
- కార్యకర్తలకు అండగా ఉంటామని
బుగ్గన, గౌరు భరోసా
డోన్ టౌన్: రాజకీయ హత్యలు మానుకొని..అభివృద్ధి పనులు చేసి ప్రజా మన్ననలు పొందాలని టీడీపీ నాయకులకు వైఎస్‌ఆర్‌సీపీ నేతలు హితవు పలికారు. ఆదివారం డోన్ పట్టణం సాయి ఫంక‌్షన్ హాల్‌లో వైఎస్‌ఆర్‌సీపీ నియోజకవర్గ ప్లీనరీ నిర్వహించారు. పీఏసీ చైర్మన్, స్థానిక ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో అనంతపురం మాజీ ఎంపీ, పార్టీ కర్నూలు జిల్లా పరిశీలకులు అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడారు. వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణులపై హింసాత్మక ఘటనలకు పాల్పడితే చూస్తూ ఊరుకోబోమన్నారు. అధికారంలో ఉన్న టీడీపీ నాయకులు.. డోన్ నియోజకవర్గానికి ఒక్క శాశ్వతమైన పని చేపట్టిన దాఖలు లేవన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు పాలన అవినీతి మయమైందని ఆరోపించారు. అధికార పార్టీ నాయకులు అందినకాటికి దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. చెరువుల్లో మట్టిని, నదుల్లో ఇసుకను దిగమింగిన చరిత్ర టీడీపీ నాయకులదేనన్నారు. ప్రజాకంటక పాలనకు ప్రజలు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. రాజధాని నిర్మాణం పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్నారు. ప్రభుత్వ అధికారులపై టీడీపీ నేతలు నిరంతరం దాడులు చేస్తున్నా.. కేసులు నమోదు కాకుండా సీఎం స్థాయిలో చంద్రబాబు అడ్డుపడడం సిగ్గుచేటన్నారు. రాయలసీమ ప్రజల దాహార్తిని తీరుస్తున్న హంద్రీనీవా ప్రాజెక్టు వైఎస్‌ఆర్ చలువేనన్నారు.
ప్రజలకు ఏం చేశారు...
డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి.. ప్రజలకు ఏం చేశారని పీఏసీ చైర్మన్, డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నిలదీశారు. ఇటీవల నిర్వహించిన టీడీపీ మినీ మహానాడులో డిప్యూటీ సీఎం తనపై విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. నియోజకవర్గానికి ఒక్క శాశ్వతమైన పనిఏదైనా చేపట్టి ఉంటే ప్రజలకు తెలియజేయాలని కేఈకి సవాల్ విసిరారు. ప్రజల చేతిలో ఘోరంగా ఓడిపోయిన వారికి కోట్ల రూపాయల నిధులను విడుదల చేస్తూ ప్రజస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారన్నారు. ఏ హోదాతో కేఈ సోదరుడు, తనయుడు పోలీస్ సైరన్‌లతో ఊరేగుతున్నారని ప్రశ్నించారు. తమ పార్టీ కార్యకర్తల జోలికి వస్తే చూస్తే ఊరుకోబోమని హెచ్చరించారు.
వైఎస్ హయాంలోనే అభివృద్ధి..
వైఎస్ హయాంలోనే డోన్ నియోజకవర్గం అభివృద్ధి చెందిందని బుగ్గన పేర్కొన్నారు. గాజులదిన్నె ప్రాజెక్టు ద్వారా మంచినీరు అందించారని. రూ. 30కోట్ల వ్యయంతో ఫ్లై ఓవర్ బ్రిడ్జ్ నిర్మించారని గుర్తు చేశారు. వేలాది గృహ నిర్మాణాలతో పలు కాలనీల ఏర్పాటు సా«ధ్యమైందని స్పష్టం చేశారు. వైఎస్‌ఆర్‌సీపీలో ఉంటూ పార్టీ వ్యతిరేక కార్యకలపాలకు పాల్పడ్డ ధర్మవరం సుబ్బారెడ్డి తనపై విరమ్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. తాను ట్రస్టు ఏర్పాటు చేసి ఉన్నత పాఠశాల భవనాలను నిర్మించినట్లు ఆరోపించారని.. వాటిని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. ఆరుగురి ఎంపీటీసీ సభ్యుల ఓట్లను టీడీపీ అభ్యర్థి శిల్పా చక్రపాణి రెడ్డికి బహిరంగంగా అమ్ముకున్న వ్యక్తి తనపై ఆరోపణలు చేయడం దారుణమన్నారు. అక్రమంగా కూడబెట్టుకున్న ఆస్తులను కాపాడుకునేందుకే ధర్మవరం సుబ్బారెడ్డి టీడీపీ పంచన చేరాడని బుగ్గన ఆరోపించారు.
కార్యకర్తలకు అండగా ఉంటాం
హత్యా రాజకీయాలకు, హింసాత్మక దాడులకు వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలు ఏమాత్రం బెదరరని పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి అన్నారు. కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని ఆయన భరోసానిచ్చారు. పార్టీ కార్యకర్తల జోలికి వస్తే టీడీపీ నాయకులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన హెచ్చరించారు.
టీడీపీని అరేబియాలో కలిపేయండి
నిరుపేద రైతాంగాన్ని ఆదుకోకుండా వారి జీవితాలతో ఆటలాడుకొంటున్న టీడీపీని వచ్చే ఎన్నికల్లో ఆరేబియా మహాసముద్రంలో కలపాలని ఎమ్మెల్సీ వెన్నుపూస గోపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. రుణమాఫీ పేరుతో రైతులను, డ్వాక్రా మహిళలను మోసం చేశారన్నారు. ఇంటికో ఉద్యోగం పేరుతో నిరుద్యోగులను దగాచేసిన ఘనత టీడీపీకే దక్కుతుందన్నారు.
సీమద్రోహి చంద్రబాబు
రాయలసీమ ద్రోహిగా సీఏం చంద్రబాబు నిలిచారని వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీవై రామయ్య అన్నారు. దోచుకో – దాచుకో అనే చందంగా టీడీపీ నేతల వ్యవహార శైలి ఉందని ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కార్యక్రమంలో పార్టీ నంద్యాల నియోజకవర్గ ఇన్‌చార్జ్ రాజగోపాల్ రెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు శ్రీరాములు, దిలీప్ చక్రవర్తి, ఎంపీపీ గంజి కృష్ణమ్మ, ప్యాపిలి, బేతంచర్ల సర్పంచ్‌లు గౌసియాబేగం, రోజమ్మ, పార్టీ నాయకులు బోరెడ్డి శ్రీరామరెడ్డి, మల్లెంపల్లె రామచంద్రుడు, కోట్రికె హరికిషన్, దినేష్‌గౌడ్, ఆర్‌ఈ రాజవర్దన్, రఫీ, మద్దిలేటి తదితరులు పాల్గొన్నారు.