- ఘనంగా శబరి స్మృతియాత్ర
- విలీన ప్రాంత గిరిజనుల విశేషపూజలు
భద్రాద్రి రామయ్యకు గిరిజనుల నీరాజనం
Published Sun, Oct 16 2016 8:53 PM | Last Updated on Mon, Sep 4 2017 5:25 PM
నెల్లిపాక :
ఆంధ్రా సరిహద్దుల్లోని భద్రాద్రి సీతారామచంద్రస్వామి దేవస్థానంలో శబరి స్మృతియాత్రను ఆదివారం ఘనంగా నిర్వహించారు. రాముడి వనవాస సమయంలో ఆయనకు ఎంగిలి పండ్లు తినిపించిన గిరిజన మహిళ శబరిని జ్ఞప్తి చేసుకుంటూ ఏటా అశ్వయుజ పౌర్ణమినాడు ఈ వేడుకను గిరిజనులు నిర్వహిస్తారు. ఈ ఏడాది కూడా వందలాది గిరిజనులు ఈయాత్రలో పాల్గొని రామయ్యకు విశేష పూజలు నిర్వహించారు. గిరిజనుల కోలాహలం నడుమ భద్రాచల దివ్యక్షేత్రంలో అత్యంత వైభవోపేతంగా శబరిస్మృతి యాత్ర సాగింది. తొలుత గిరిజనులు తమ సంప్రదాయ కొమ్ము, కోయనృత్యాలు, కోలాటాలను స్వామి వారి ముందు ప్రదర్శిస్తూ మూడుసార్లు గిరి ప్రదక్షిణ చేశారు. శబరి నది నుంచి కలశాలతో తీసుకొచ్చిన జలాలతో గిరిజన మహిళలు మేళతాళాలు, వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య ఆలయ ప్రదక్షిణ చేశారు. అనంతరం ధ్వజస్థంభం వద్ద నున్న బలిపీఠానికి గిరిజన మహిళలు పసుపు, కుంకుమలు చల్లి ముగ్గులు వేసి అలంకరించారు. తర్వాత అడవుల్లో దొరికే దుంపలను, పూలను గిరిజనులు ఆలయ ఈవో రమేష్‌బాబుకు అందజేశారు. గిరిజనులు తీసుకొచ్చిన పూలతో వైకుంఠ రాముడికి కన్నుల పండువగా పుష్పార్చన నిర్వహించారు. శబరి నది పరీవాహక ప్రాంతాల్లో ఉండే గిరిజన గ్రామాల ప్రజలు అధికంగా ఈయాత్రలో పాల్గొని పూజలు చేశారు.ఈ వేడుకలో జిల్లా జడ్జి వినయ్‌మోహన్, ఆలయ ప్రదానార్చకుడు పొడిచేటి జగన్నాథాచార్యులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement