బంద్‌ ప్రశాంతం | Bandh peaceful | Sakshi
Sakshi News home page

బంద్‌ ప్రశాంతం

Aug 30 2016 11:48 PM | Updated on Sep 4 2017 11:35 AM

బంద్‌ ప్రశాంతం

బంద్‌ ప్రశాంతం

హన్మకొండ జిల్లా వద్దని, ప్రజలు ఆంకాక్ష మేరకు జనగామ జిల్లా ఏర్పాటు చేయాలని కోరుతూ మంగళవారం జిల్లా పరిరక్షణ కమిటీ, అఖిలపక్ష పార్టీలు సంయక్తంగా చేపట్టిన జిల్లా బంద్‌ ప్రశాంతంగా జరిగింది.

  • గ్రేటర్‌లో పాక్షికం... జనగామలో సంపూర్ణం
  • మూతపడిన వ్యాపార, వాణిజ్య సంస్థలు
  • నగరంలో మోటారు సైకిళ్ల ర్యాలీ
  • పలువురు నాయకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • రఘునాథపల్లిలో కలెక్టర్‌ను అడ్డుకున్న జేఏసీ నాయకులు
  •  
    వరంగల్‌ : హన్మకొండ జిల్లా వద్దని, ప్రజలు ఆంకాక్ష మేరకు జనగామ జిల్లా ఏర్పాటు చేయాలని కోరుతూ మంగళవారం జిల్లా పరిరక్షణ కమిటీ, అఖిలపక్ష పార్టీలు సంయక్తంగా చేపట్టిన జిల్లా బంద్‌ ప్రశాంతంగా జరిగింది. గ్రేటర్‌ వరంగల్‌ పరిధిలో బంద్‌ పాక్షికంగా జరగగా.. జనగామలో సంపూర్ణంగా జరిగింది. నగరంలో బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్‌సీపీ, వామపక్ష పార్టీలు, వివిధ ప్రజా సంఘాలు బంద్‌లో పాల్గొన్నాయి. బస్టాండ్‌ నుంచి దూర ప్రాంతాలకు వెళ్లే బస్సులు బయటకు వెళ్లకుండా బీజెపీ, కాంగ్రెస్, టీడీపీ నేతలు ఉదయం 5గంటలకే హన్మకొండ బస్‌డిపో ఎదుట బైఠాయించారు. ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. నగరంలో పెద్ద ఎత్తున మోటార్‌సైకిళ్ల ర్యాలీ నిర్వహించారు. పలువురు నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని సాయంత్రం వదిలిపెట్టారు. వ్యాపార, వాణిజ్య సంస్థలు, పెట్రోల్‌ బంకులు మూతపడ్డాయి. ప్రభుత్వ కార్యాలయాలు యధావిధిగా పనిచేశాయి.
     
    జనగామలో అధికార ప్రతిపక్ష నేతలతో సహా అన్ని వర్గాల వారు పాలుపంచుకోవడంతో బంద్‌ సంపూర్ణంగా జరిగింది. పిట్టలగూడెం వెళుతున్న కలెక్టర్‌ కరుణను రఘునాథపల్లిలో జేఏసీ నాయకులు అడ్డుకొని జిల్లా ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని కోరారు. చేర్యాల మండలాన్ని చేర్చి జనగామ జిల్లాగా ఏర్పాటు చేయాలని అఖిపక్ష నేతలు డిమాండ్‌ చేశారు. జనగామ జిల్లా ఏర్పాటు కోసం బచ్చన్నపేటలో రెండు గంటల పాటు ధర్నా, రాస్తారోకో నిర్వహించడంతో ట్రాఫిక్‌కు అంతరాయం జరిగింది. నర్మెట మండల కేంద్రంలో, తరిగొప్పుల చౌరస్తాలో ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు.
     
    హన్మకొండను వరంగల్‌ నుంచి విడదీయవద్దని అఖిలపక్షం ఆధ్వర్యంలో సంగెంలో బంద్‌ నిర్వహించారు. ఆదివాసీలను అణగదొక్కేందుకే జిల్లాల పునర్విభజన చేపట్టారని తుడుందెబ్బ నాయకులు ఆరోపించారు. గ్రేటర్‌ పరిధిలో జరిగిన బంద్‌లో డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్, మాజీ మేయర్‌ ఎర్రబెల్లి స్వర్ణ, గ్రేటర్‌ నేతలు కట్ల శ్రీనివాస్, రాజనాల శ్రీహరి, బట్టి శ్రీను, ఈవీ.శ్రీనివాస్, మనుపాటి శ్రీను. రజనీకాంత్, మండల సమ్మయ్య,  బీజీపీ నాయకులు మార్తినేని ధర్మారావు, రావు పద్మారెడ్డి, గండ్రతి యాదగిరి, రావు అమరేంద్‌రెడ్డి, చింతాకుల సునీల్, గాదె రాంబాబు, వైఎస్సార్‌సీపీ నాయకులు అప్పం కిషన్, పసునూరి ప్రభాకర్, రఘు, సుదర్శన్‌రెడ్డి, అమరేందర్‌రెడ్డి, టీడీపీ నేతలు గండ్ర సత్యనారాయణరావు, మాజీ ఎమ్మెల్యే సీతక్క, హన్మకొండ సాంబయ్య, శ్రీరాముల సురేష్, మార్గం సారంగం, జిల్లా పరిరక్షణ కమిటీ నాయకులు బైరపాక జయాకర్‌ మాదిగ, మంద కుమార్‌మాదిగ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement