
సమావేశంలో మాట్లాడుతున్న ఉద్యోగ, అధికారుల ప్రతినిధులు
- పాల్గొన్న వేలాది మంది బ్యాంకు సిబ్బంది
- నిలిచిపోయిన ఆర్థిక లావాదేవీలు
ఖమ్మం గాంధీచౌక్: ఎస్‌బీఐలో అనుబంధ బ్యాంకుల విలీనం, ప్రైవేటీకరణ, పేరుకుపోయిన బకాయిలను వసూలు చేయాలనే అంశాలపై యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యుఎఫ్‌బీయూ) పిలుపు మేరకు శుక్రవారం జిల్లాలో నిర్వహించిన బ్యాంక్ ఉద్యోగుల సమ్మె జయప్రదంగా ముగిసింది.సమ్మెలో జిల్లా వ్యాప్తంగా ఉన్న 40 బ్యాంకుల్లోని రెండు వేల మంది ఉద్యోగులు పాల్గొన్నారు.సమ్మె కారణంగా జిల్లాలో సుమారు రూ.250 కోట్లకు పైగా ఆర్థిక లావాదేవీలు నిలిచిపోయాయి. సమావేశంలో ఏఐటీయూసీ నాయకుడు సింగు నర్సింహారావు,యూఎఫ్‌బీయూ జిల్లా కన్వీనర్, ఎస్‌బీఐ బ్యాంక్ ఉద్యోగుల సంఘ నాయకుడు నందన్‌లు మాట్లాడుతూ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో బకాయిలు పేరుకుపోతున్నా..లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్ రంగ బ్యాంకులకు తిరిగి చెల్లంచకుండా బ్యాంకులను నష్టాల పాలు చేస్తున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందన్నారు. రికవరీ చట్టాలను కఠినతరంగా మార్చి కార్పొరేట్ రంగంలో పేరుకుపోయిన బాకీలను వసూలు చేయకుండా ఆయా సంస్థలకు ప్రభుత్వం కొమ్ముకాస్తుందని విమర్శించారు.ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రభుత్వమే నిర్వహించాలని, ఎన్‌పీఏలను సమర్థవంతంగా వసూలు చేయాలని వారు డిమాండ్ చేశారు. సమావేశంలో వివిధ బ్యాంకుల ప్రతినిధులు నర్సింగరావు, వెంకన్న పాల్గొన్నారు.