బ్యాంకు పరిధి గ్రామాలు భీమదేవరల్లిలోనే..
-
ప్రజల సౌలభ్యం కోసమే పునర్విభజన
-
ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్
భీమదేవరపల్లి : ముల్కనూర్ సహకార గ్రామీణ బ్యాంకు పరిధిలోని గ్రామాలు భీమదేవరపల్లి మండలంలోనే కొనసాగుతాయని, వాటిని వేరే మండలంలో కలిపే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్ మండల ప్రజలకు భరోసానిచ్చారు. ఎంపీపీ సంగ సంపత్ అధ్యక్షతన శనివారం నిర్వహించిన మండల సర్వసభ్యసమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. జిల్లాల, మండలాల పునర్విభజన ప్రజల సౌకర్యం కోసమే జరుగుతుందన్నారు. ముల్కనూర్ సహకార గ్రామీణ బ్యాంకు పరిధిలోని ఎర్రబల్లి, మల్లారం, కొత్తకొండ, ముస్తఫాపూర్, ధర్మారం గ్రామాలు నూతన ప్రతిపాదిత వేలేరు మండలంలో కలిపే ఆలోచన ఆయా గ్రామాల సర్పంచ్‌లు వేలేరు ప్రతిపాదిత మండలానికి గతంలో తీర్మాణం ఇవ్వడమే కారణమన్నారు. బ్యాంకు పరిధిలోని గ్రామాలు భీమదేవరపల్లి మండలంలో ఉంటేనే రైతులకు అనుకూలంగా ఉంటుందనే విషయాన్ని సీఎం దృష్టికి సైతం తీసుకెళ్లినట్లు ఆయన వెల్లడించారు. ప్రజాప్రతినిధులు, ప్రజలకు ఇబ్బంది లేకుండా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలన్నారు. దేవాదుల కాలువ నీటితో మాణిక్యాపూర్, రత్నగిరి చెరువులను నింపాలని ఆయా గ్రామాల సర్పంచ్‌లు వనపర్తి రాజయ్య, శివసారపు ఎల్లయ్య కోరారు. ఉపాధ్యాయులు పాఠశాలకు గైర్హాజరై మరుసటి రోజు హాజరువేసుకుంటున్నట్లు మాణిక్యాపూర్ ఎంపీటీసీ వెంకన్న ఆరోపించారు. ముల్కనూర్ ట్రాన్స్‌కో ఏఈ రమేశ్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు సర్పంచ్‌లు జిమ్మల భీంరెడ్డి, వనపర్తి రాజయ్య ఆరోపించారు. ముల్కనూర్ ఫాతిమా పాఠశాల సమీపంలో ఇళ్లపైనుంచి వెళ్తున్న విద్యుత్ తీగలు తొలగించాలని సర్పంచ్ వంగ రవీందర్ కోరారు. అలాగే ఆయా గ్రామాల్లో పలు సమస్యలను సర్పంచ్‌లు, ఎంపీటీసీలు లేవనెత్తారు. ఈజీఎస్ ఏపీవో కుమారస్వామి నిర్లక్షంగా వ్యవహరిస్తున్నట్లు ఎంపీపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు బాధ్యతాతయుతంగా పనిచేయాలని ఎమ్మెల్యే ఈ సందర్భంగా అధికారులకు సూచించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ మాలోతు రాంచందర్‌నాయక్, హుజురాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొండాల్‌రెడ్డి, ఎంపీడీవో వంగ నర్సింహారెడ్డి, తహసీల్దార్ కిరణ్‌కుమార్, వైస్ ఎంపీపీ సాధుల మనోహర, సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు ఎస్డీ షర్ఫొద్దీన్, గిరిమల్ల తిరుపతి, సిద్దమల్ల రమేశ్, ఎంపీటీసీలు మల్లం నర్సింహులు, తాళ్ల జయంత్ పాటు అన్ని శాఖల అధికారులున్నారు. మండల సభలో సగం వరకు మహిళ ప్రజాప్రతినిధులున్నా ఏ ఒక్కరు కూడా తమ గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై మాట్లడకపోవడం గమనార్హం.
మొక్కలు నాటిన ఎమ్మెల్యే
హరితహారంలో భాగంగా ఎమ్మెల్యే సతీశ్‌కుమార్ తహసీల్దార్ కార్యాలయంలో మొక్కలు నాటారు. అనంతరం సర్వశిక్షాభియాన్ పథకంలో భాగంగా వికలాంగ విద్యార్థులకు ఎమ్మెల్యే ఉపకరణాలు అందించారు.