హరేసముద్రంలో అలజడి
- ఎలుగుబంట్ల స్వైరవిహారం
- ఇద్దరిపై దాడి యత్నం
- భయాందోళనలో జనం
- రంగంలోకి అటవీ అధికారులు
మడకశిర రూరల్ : మడకశిర మండలం హరేసముద్రంలో అలజడి చెలరేగింది. గ్రామానికి ఆనుకుని ఉన్న చిన్నచెరువు కింద సాగు చేసిన పంట పొలాల్లోకి ఎలుగుంట్లు రావడం కలకలం రేపింది. మొక్కజొన్న పంట సమీపంలో పశుగ్రాసం కోస్తునగ్రామానికి చెందిన దొడ్డక్క, ఆమె పిల్లలపై ఎలుగుబంటి దాడికి యత్నించడం, వారు గట్టిగా కేకలు వేయడంతో గ్రామస్తులు వందలాది మందిఅ క్కడికి చేరుకున్నారు. రెండ్రోజుల కిందట బహిర్భూమికి వెళ్లిన తిప్పేస్వామిపైనా ఎలుగుబంటి దాడికి యత్నించగా ఆయన కేకలు వేసుకుంటూ గ్రామంలోకి చేరుకున్నాడు. వరుస సంఘటనలతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.
గుమిగూడిన జనం
మొక్కజొన్న పంట పొలానికి సమీపంలోని పాడుబడిన గదిలోకి ఎలుగుబంట్లు వెళ్లాయని భావించిన వందలాది మంది జనం అక్కడికి చేరుకున్నారు. స్థానిక సెక‌్షన్ ఆఫీసర్ శాంప్లానాయక్, సిబ్బందితో అక్కడికి చేరుకుని ఎలుగుబంట్లు వెళ్లిన ప్రదేశానికి ఎవరినీ వెళ్లకుండా పోలీసుల ద్వారా నిలువరించారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎలుగుబంట్ల కోసం జనం నిరీక్షించారు. అయినా అవి బయటకు రాకపోవడంతో సాయంత్రం బాణసంచా పేల్చుతూ పెద్ద ఎత్తున శబ్దాలు చేశారు. అయినా ఫలితం లేకపోవడంతో ఎలుగుబంట్లు అటవీ ప్రాంతానికి వెళ్లి పోయి ఉంటాయని అధికారులు ప్రకటించారు. అటవీ శాఖాధికారి వేణుగోపాల్ కూడా ఎలుగుంట్లు ఉన్న ప్రదేశాన్ని సాయంత్రం పరిశీలించారు. వివరాలడిగి తెలుసుకున్నారు. రాత్రి కూడా సిబ్బంది అక్కడే ఉండి ఎలుగుబంట్లు కనిపిస్తే అడవిలోకి వెళ్లిపోయేలా చూడాలని ఆయన ఆదేశించారు.
రైతుల్లో భయం..భయం..
ఎలుగుబంట్లు సంచరిస్తున్న ప్రదేశంలో 30 ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగు చేశారు. దీంతో రైతులు ఇప్పుడు తమ పొలాల వైపు వెళ్లాలంటేనే భయంతో వణికిపోతున్నారు. పంట సంగతి దేవుడెరుగు.. ప్రాణాలు కాపాడుకుంటే చాలనుకుంటున్నారు.