ఇది దా‘రుణం’
రుణాలందక ఇక్కట్లలో అన్నదాత
చుట్టుముట్టిన కరువు
రబీలో పెట్టుబడిలేక అగచాట్లు
కరువు కర్షకుడికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఖరీఫ్‌లో వరుణుడు ముఖం చాటేశాడు. పంట చేతికి రాకపోగా అప్పుల కుప్ప మిగిలింది. రబీ ప్రారంభమయినా ఇప్పటివరకు చినుకు జాడలేదు. మరోపక్క చేతిలో పైసా లేదు. అప్పు పుట్టే పరిస్థితి కనుచూపుమేరలో కనిపించడం లేదు. రుణపరపతి అంతంతమాత్రమే. బ్యాంకులు కూడా బకాయిల పేరిట రుణాలివ్వడానికి ముందుకు రావడం లేదు. దీంతో రైతులది ఏం చేయాలో పాలుపోని పరిస్థితి.
చిత్తూరు: రబీ సీజన్ ప్రారంభమై 40 రోజు లు కావస్తోంది. ఈశాన్య రుతుపవనం పై ఆశలు పెట్టుకుని రైతులు విత్తనాలు, ఎరువుల సేకరణలో బిజీగా ఉన్నారు. పెట్టుబడి సాయం కోసం బ్యాంకుల వైపు చూస్తున్నారు. రబీ సీజన్‌కు రూ.1,835 కోట్ల రుణం ఇవ్వాలని బ్యాంకర్లకు ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించింది. ఇప్పటివరకు బ్యాంకులు రూ.425 కోట్లు మాత్రమే రైతులకు రుణాలు మంజూరు చేశాయి. బ్యాంకులు ఖరీఫ్‌లో కూడా అన్నదాతను ఆదుకోలేకపోయాయి. రుణ లక్ష్యాన్ని పూర్తిచేయలేదు. రబీలోనైనా లక్ష్యాన్ని అందుకుని అన్నదాతకు వెన్నుదన్నుగా నిలుస్తాయా? అనేది సందేహమే. ఆర్థికంగా అన్ని విధాలా సహకారం అందించేందుకు నెలకొల్పిన సహకార బ్యాంకు కూడా రబీలో రైతులను గాలికొదిలేసింది. ఈ సీజన్‌కు రూ.120 కోట్ల రుణ మంజూరు లక్ష్యంగా నిర్దేశించుకోగా ఇప్పటివరకు కేవలం రూ.23 కోట్లు మాత్రమే మంజూరు చేసింది. ఖరీఫ్ సీజన్‌లో కూడా 43,734 మంది రైతులకు రూ.280 కోట్లు మాత్రమే రుణం మంజూరు చేసింది.
ఖరీఫ్ గతి తప్పింది
ముఖ్యమైన సీజన్‌లో బ్యాంకర్లు రైతులకు అంతంత మాత్రమే సహకారం అందించారు. సుమారు రూ.2,200 కోట్ల రుణ లక్ష్యం నిర్దేశించుకోగా.. సగం మేర మాత్రమే రుణాలు అందించారు. వీటిని సెప్టెంబర్‌లో అందించడం వల్ల రైతులకు పెద్దగా ఉపయోగపడలేదు. ఫలితంగా అప్పటికేచాలామంది ప్రైవేటు వ్యక్తులను ఆశ్రయించారు. కొన్ని బ్యాంకులైతే రుణాలే మంజూరు చేయకపోవడం గమనార్హం.
రుణమాఫీ హామీనే కొంప ముంచింది
ఎన్నికల సమయంలో అన్ని రకాల పంట రుణాలు మాఫీ చేస్తాం.. అన్నదాతలెవరూ రుణాలు చెల్లించకండంటూ టీడీపీ ప్రకటించడంతో రైతులెవరూ రుణ బకాయిలు చెల్లించలేదు. ఎన్నికల అనంతరం రుణమాఫీ ప్రకటనను రుణ ఉపశమనం గా పేరు మార్పు చేయడం.. కొద్దిమందికే ఉపశమనమని ప్రకటించడంతో రైతులు ఖంగుతిన్నారు. చాలామంది బకాయిదారులుగా ముద్రపడ్డారు. వడ్డీ 14 శాతం పడటంతో బకాయిలు చెల్లించలేకపోయారు. దీంతో బకాయిదారులుగా రికార్డులకెక్కిన రెతులకు రుణాలు ఇవ్వడాని కి బ్యాంకులు ససేమిరా అంటున్నాయి.
అందరికీ రుణాలిస్తాం..
అడిగిన రైతులందరికీ రుణాలిస్తాం. రుణ లక్ష్యం చేరుకుంటాం. ఇప్పుడిప్పుడే రైతులు వస్తున్నారు. కచ్చితంగా రుణ లక్ష్యం చేరుకోవాలని బ్యాంకర్లకు స్పష్టమైన ఆదేశాలిచ్చాం. -రామ్మోహన్ రావు. ఎల్డీఎం, చిత్తూరు.