నాణ్యమైన విద్యుత్ సరఫరాకు చర్యలు
మచిలీపట్నం టౌన్ : జిల్లాలో నాణ్యమైన విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎలక్ట్రికల్ ఎస్‌ఈ ఎం.విజయకుమార్ తెలిపారు. ఆయన మంగళవారం మచిలీపట్నంలో విలేకరులతో మాట్లాడారు. నాణ్యమైన విద్యుత్‌ను అందించేందుకు త్వరలో జిల్లా వ్యాప్తంగా డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్‌లను, చిన్న ట్రాన్స్‌ఫార్మర్లను తొలగించి వీటి స్థానంలో కొత్త ట్రాన్స్‌ఫార్మర్‌లను ఏర్పాటు చేస్తామన్నారు. లైన్ లాస్ లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. వ్యవసాయ విద్యుత్ కనెక‌్షన్‌లకు మెరుగైన విద్యుత్‌ను అందించేందుకు విద్యుత్ లైన్‌లను మార్చనున్నట్లు చెప్పారు. జిల్లాలో రూ.160 కోట్లతో దీనదయాళ్ గ్రామీణ ఉపాధ్యాయ యోజన పథకం ద్వారా ఎల్‌టీ లైన్‌లను హెచ్‌టీ లైన్‌లుగా మార్చే పనులు త్వరలో ప్రారంభిస్తామన్నారు. జిల్లావ్యాప్తంగా రూ.23 కోట్లతో ఆరు విద్యుత్ సబ్ స్టేషన్‌లను నిర్మించనున్నట్లు తెలిపారు. బందరులో కలెక్టర్ బంగళా వెనుక 33/11 కేవీ కెపాసిటీతో నిర్మిస్తున్న ఇండోర్ సబ్‌స్టేషన్ పనులు చివరి దశలో ఉన్నాయని పేర్కొన్నారు. వాడపాలెంలో పది రోజుల్లో నూతన సబ్ స్టేషన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తామన్నారు. జిల్లాలోని మంగోలు, వరాహపట్నం, చీపురుగూడెం, ప్రొద్దుటూరు, కొత్త మాజేరు ప్రాంతాల్లో కూడా సబ్ స్టేషన్‌ల నిర్మాణ పనులను త్వరలో ప్రారంభిస్తామన్నారు. మేజర్, మైనర్ గ్రామ పంచాయతీలు కూడా విద్యుత్ బిల్లులను చెల్లించాలన్నారు. గతంలో రెండు నెలలకు ఒకసారి బిల్లులు చెల్లించే విధానం ఉండేదని, గత నెల నుంచి ప్రతి నెలా విద్యుత్ బిల్లుల చెలింపు విధానం అమల్లోకి వచ్చిందని తెలిపారు. బిల్లులు చెల్లించని పంచాయితీలపై శాఖాపరమైన చర్యలు ఉంటాయన్నారు. ఎస్సీ, ఎస్టీలు కుల ధ్రువీకరణ పత్రాలను అందజేస్తే 50 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా చేయనున్నట్లు ఆయన చెప్పారు. ఈ సమావేశంలో ఎలక్ట్రికల్ మచిలీపట్నం డీఈ ఎ.శ్రీనివాసబాబు, మచిలీపట్నం, పెడన ఏడీఈలు గోవిందరాజులు, భాస్కర్ పాల్గొన్నారు.