వంతెన నిర్మాణ పనులకు శంకుస్థాపన
కొండాపూర్: అభివృద్దే ప్రభుత్వ ఎజెండాగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందరి స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. మండల పరిధిలోని మారేపల్లి గ్రామ శివారులో గల ఆర్‌అండ్‌బీ నిధుల ద్వారా రూ.70 లక్షలతో నిర్మించనున్న వంతెన పనులకు బుధవారం ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమైక్య రాష్ట్రంలో అన్ని విధాలుగా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధికి నోచుకోలేదన్నారు.
పల్లెలు అభివృద్ధి చెందాలంటే ప్రతి గ్రామానికి మెరుగైన రవాణా సౌకర్యం కల్పించేలా ప్రతి గ్రామానికి బీటీ రోడ్డులను వేయిస్తామన్నారు.అదేవిధంగా ప్రతి మండల కేంద్రానికి డబుల్ రోడ్డును విస్తస్తామన్నారు.ప్రతి ఇంటికి మంచి నీరు అందించడం కోసం మిషన్ భగీరథను ప్రవేశపెట్టామన్నారు. ఆహార భద్రత కార్డు ద్వారా ఇంటిలోని ప్రతీ ఒక్కరికి ఆరుకిలోల చొప్పున బియ్యం అందిస్తున్నామన్నారు.
ఎన్నో ఏళ్లుగా కుంటుపడిన చెరువులను, కుంటలను పూడికతీత తొలగించి వాటికి మళ్లీ పూర్వవైభవం తెచ్చి భూగర్భజలాల స్థాయిని పెంచేందుకు మిషన్‌కాకతీయ పథకాన్ని ప్రవేశపెట్టామన్నారు.దళితుల అభివృద్ధి కోసం భూమి లేని నిరుపేద దళితులకు సాగుకు యోగ్యమైన మూడెకరాల భూమిని అందివ్వడమే కాకుండా మెదటి సంవత్సరం విత్తనాలతో పాటు,ఎరువులను కూడా అందిచామన్నారు.
రైతులకు తాగు, సాగునీరు అందించడమే లక్ష్యంగా మహరాష్ట్రతో ఒప్పందం చేయడం తెలంగాణ రాష్ట్రం సాధించిన గొప్ప విజయమన్నారు.తెలంగాణ ఏర్పడిన అనంతరం సీఎం రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు నిరంతరం కృషి చేస్తామన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరు బంగారు తెలంగాణలో భాగస్వాములు కావాలన్నారు.
కార్యక్రమంలో ఎంపీపీ విఠల్, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి, జెడ్పీ కో ఆప్షన్ సభ్యులు అమీనోద్దిన్, సర్పంచ్ రుక్మోద్దిన్, తహసీల్దార్ లావణ్య, ఎంపీటీసీ సభ్యులు పర్త్యానాయక్, సత్యాగౌడ్, నాయకులు మల్లాగౌడ్, మల్లేశం, లక్ష్మారెడ్డి, బుచ్చిరెడ్డి, నాగయ్య, బి జలేందర్, నర్సిములు, అంజిరెడ్డి, శ్రీకాంత్, అబ్దుల్‌రహీం, కుమార్ తదితరులు పాల్గొన్నారు.