మానవత్వానికే మచ్చ
చావుబతుకుల మధ్య ఉన్న వ్యక్తి వస్తువులు దోపిడీ
{పమాదానికి కారణమైన వారినీ తప్పించిన వైనం
ఆధారాలు లేక గుర్తించలేని పోలీసులు
పత్రికల్లో వార్త చూసి గుర్తించిన కుటుంబ సభ్యులు
నిజామాబాద్ క్రైం తీవ్ర గాయాలతో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తిని పట్టించుకోని లోకమిది..! చావుబతుకుల మధ్య ఉన్న వ్యక్తినీ దోచుకొనే ‘నేరగాళ్ల’ రాజ్యమిది..!! ప్రమాదాలు చేసి, ప్రాణాలను తీసే వారిని క్షేమంగా పంపించే వైనమిది.. మానవత్వపు ఆనవాళ్లు మాయమైపోతున్నాయనేందుకు నగరంలో బుధవారం జరిగిన ఘటనే నిదర్శనం. అసలేం జరిగిందంటే.. నగరంలోని ఇంద్రాపూర్‌కు చెందిన గోరేవార్ రాజేశ్వర్ అలియాస్ నాగరాజు (35)కు భార్య లక్ష్మి, పదేళ్లలోపు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. స్కూల్ బస్ డ్రైవర్‌గా పని చేస్తున్న రాజేశ్వర్.. సాయంత్రం వేళలో ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. బుధవారం రాత్రి ఆటోలో పూలాంగ్ చౌరస్తా వైపు వెళ్తుండగా, హోటల్ వంశీ వద్దకు రాగానే డీజిల్ అయిపోయింది. డీజిల్ కోసమని ఎదురుగా గల పెట్రోల్‌బంక్‌కు వెళ్లేందుకు రోడ్డు దాటుతున్న ఆయనను పూలాంగ్ వైపు వస్తున్న బైక్ ఢీకొట్టింది.
దీంతో ఆయన తలకు తీవ్ర గాయాలై స్పృహ కోల్పోయాడు. అక్కడే ఉన్న వారు ఆయనను ఆస్పత్రికి తీసుకెళ్లాల్సింది పోయి.. బైక్‌పై ఉన్న జంటను అక్కడి నుంచి పంపేశారు. రక్తపుమడుగులో కొట్టుమిట్టాడుతున్న రాజేశ్వర్‌ను ఆస్పత్రికి తరలించాల్సింది పోయి.. అతడి వద్ద ఉన్న సెల్‌ఫోన్, పర్సును కొట్టేశారు. చివరకు 108 వాహనంలో ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆలస్యం కావడంతో రాజేశ్వర్ తుదిశ్వాస విడిచాడు. ఫోన్, పర్సు కొట్టేయడంతో మృతుడ్ని గుర్తించేందుకు పోలీసులకు ఎలాంటి ఆధారాలు లభించలేదు. దీంతో పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం గదిలో భద్రపరిచి, గుర్తు తెలియని వ్యక్తి మృతిగా కేసు నమోదు చేశారు. అయితే, రాజేశ్వర్ మృతి వార్త ఫొటోతో సహా పత్రికల్లో రావడంతో ఆయన కుటుంబ సభ్యులు రోదిస్తూ గురువారం పోలీసులను ఆశ్రయించారు. విగతజీవిగా పడి ఉన్న భర్తను చూసి భార్య కుప్పకూలిపోయింది. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుల కోసం గాలిస్తున్నారు.