- పీసీసీ ప్రధాన కార్యదర్శి రుద్రరాజు
పెద్దనోట్ల రద్దుపై శ్వేతపత్రం విడుదలచేయాలి
Published Sat, Dec 31 2016 10:51 PM | Last Updated on Thu, Jul 18 2019 1:50 PM
అమలాపురం టౌన్ :
పెద్ద నోట్ల రద్దు తర్వాత 50 రోజుల్లో కేంద్ర ప్రభుత్వం ఎంత నల్ల ధనాన్ని వెనక్కి తీసుకోగలిగింది...? తదితర పరిణామాలపై కేంద్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని పీసీసీ ప్రధాన కార్యదర్శి గిడుగు రుద్రరాజు డిమాండు చేశారు. నోట్ల రద్దు తర్వాత ప్రజల నగదు కష్టనష్టాలకు నిరసనగా ఈనెల 6 నుంచి నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. అమలాపురంలోని తన క్యాంపు కార్యాలయంలో శనివారం ఉదయం ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో రుద్రరాజు మాట్లాడారు. నోట్ల రద్దు తర్వాత ఆర్థిక లావాదేవీలపై కాంగ్రెస్ పార్టీ పలు రూపాల్లో సమాచార హక్కు చట్టం ద్వారా సమాచారం కోరినా ఇవ్వకుండా ఆ సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వం తొక్కిపెడుతోందన్నారు. ప్రజల ఇబ్బందులకు నిరసనగా కాంగ్రెస్ ఉద్యమం మాదిరిగా పలు దశల్లో పలు రూపాల్లో ఆందోళనలు చేపట్టనుందన్నారు. ఈ నెల 6,7 తేదీల్లో ఆయా జిల్లాల కలెక్టరేట్ల వద్ద ఘెరావ్‌లు, ముట్టడి, ధర్నాలు వంటి నిరసనలు చేపట్టనున్నామన్నారు. అలాగే 9న పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎక్కడికక్కడ ఖాళీ కంచాల ప్రదర్శనతో నిరసన తెలపనున్నారని వివరించారు. విత్ డ్రాలపై ఉన్న పరిమితులు తక్షణమే ఎత్తి వేయాలని రుద్రరాజు డిమాండు చేశారు. పీసీసీ అధికార ప్రతినిధి ముషిణి రామకృష్ణారావు, పీసీసీ కార్యదర్శి కల్వకొలను తాతాజీ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
Advertisement
Advertisement