కాదేది వ్యర్థం..!
♦ దేశంలోనే మొదటగా నరసాపురంలో మలవ్యర్థ శుద్ధి కేంద్రం
♦ రూ 1.20 కోట్ల బిల్‌గేట్స్ ఫౌండేషన్ నిధులతో నిర్మాణం
♦ అమెరికా టెక్నాలజీతో నిర్వహణ
♦ అక్టోబర్‌లో ప్రారంభం కానున్న ప్లాంట్
నరసాపురం : దేశంలోనే మొదటిగా అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో నరసాపురంలో మల వ్యర్థ శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. స్వచ్ఛాంధ్రమిషన్ పర్యవేక్షణలో వినియోగంలోకి రానున్న ఈ ప్లాంట్‌కు శానిటేషన్ రీసోర్స్‌పార్కుగా నామకరణం చేశారు. అక్టోబర్ నెలలో ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. మీ సెప్టిక్‌ట్యాంక్ నిండిందా అంటూ.. ఇళ్ల వద్దకు వచ్చి మలాన్ని తీసుకెళ్లే వారు. ఆ వ్యర్థాలను ఎవరూ చూడకుండా నదులు, కాలువల్లో కలిపేస్తున్నారు. దీంతో జలకాలుష్యం ప్రమాదస్థాయికి చేరి ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. ఇలాంటి ముప్పును తప్పించడానికి అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థలు, కేంద్రప్రభుత్వ స్వచ్ఛ భారత్ సంకల్ప్ సంకల్పించాయి. ఈ క్రమంలో మలవ్యర్థాలను శుద్ధి చేయడంలో విప్లవాత్మక మార్పులు రానున్నాయి. మలవ్యర్థం మొత్తం కార్బన్‌శాతం అత్యధికంగా ఉండే ఎరువుగా మారబోతుంది.
పైలట్ ప్రాజెక్టుగా జిల్లా ఎంపిక
అమెరికాలోని బిల్‌గేట్స్ సేవాసంస్థకు చెందిన బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ మనదేశంలో మోడల్ శానిటేషన్ కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించింది. రాష్ట్రానికి సంబంధించి జిల్లాను పైలట్ ప్రాజెక్ట్‌గా ఎంపిక చేశారు. నరసాపురం, పాలకొల్లు, కొవ్వూరు మునిసిపాలిటీల్లో ప్లాంట్స్ నెలకొల్పాలని నిర్ణయించారు. అయితే పాలకొల్లు, కొవ్వూరు పట్టణాల్లో స్థల సేకరణ జరగకపోవడంతో నరసాపురంలో ప్లాంట్ నిర్మాణం ప్రారంభమైంది. బిల్‌గేట్స్ ఫౌండేషన్ ప్లాంట్ నిర్మాణానికి 1.20 కోట్ల నిధులు విడుదల చేసింది. స్వచ్ఛాంధ్ర మిషన్ పర్యవేక్షణలో పట్టణంలోని 15వ వార్డు గోదావరిగట్టున గత మే నెల 24వ తేదీన ప్లాంట్‌కు శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం ఇటువంటి ప్లాంట్ అమెరికాలోనే ఉంది.
ఆ తరహాలోనే ఇక్కడ కూడా నిర్మిస్తున్నారు. అక్టోబర్ మొదటివారంలో ప్లాంట్‌ను వినియోగంలోకి తెస్తామని ఫౌండేషన్ ప్రతినిధులు చెప్పారు. ఈ ఫౌండేషన్ వారు ప్లాంట్ నిర్మాణం, నిర్వహణ బాధ్యతను బెంగళూరుకు చెందిన టైడ్ టెక్నో క్రాప్ట్స్ ప్రైయివేట్ లిమిటెడ్ అనే కంపెనీకి అప్పగించారు. అంతేకాకుండా ప్లాంట్ నిర్వహణలో పలు అంతర్జాతీయ సేవాసంస్థలను భాగస్వాములను చేశారు. 15 వేల లీటర్ల సామర్థ్యంతో నిర్మితమవుతున్న ఈ ప్లాంట్‌లో మొత్తం నలుగురు పని చేస్తారు. ఎకరం స్థలంలో ప్లాంట్ నిర్మిస్తారు. 30 సెంట్ల స్థలంలో ప్లాంట్, మిగిలిన 70 సెంట్లలో పార్కును అభివృద్ధి చేస్తారు. ప్లాంట్‌కు రోడ్డు సౌకర్యం, మంచినీరు, విద్యుత్ సదుపాయం మాత్రమే మునిసిపాలిటీ అందించాల్సి ఉంటుంది. మిగిలిన నిర్వహణ అంతా టైడ్ టెక్నోక్రాప్ట్స్ సంస్థ ప్రతినిధులు చూసుకుంటారు.
ఇలా పని చేస్తుంది
సెప్టిక్‌ట్యాంకు నుంచి సేకరించి తీసుకొచ్చిన ఘన, ద్రవ వ్యర్థాలను ప్లాంట్‌లో దశలవారీగా శుభ్రం చేస్తారు. మొత్తం ప్రక్రియ 5 గంటల్లో పూర్తవుతుంది. ద్రవరూపంలో ఉండే మురుగు శుభ్రమైన నీరుగా మారుతుంది. ఘనరూపంలో ఉండే మలవ్యర్థాన్ని నిర్దిష్ట ఉష్ణోగ్రతలో ప్లాంట్‌లో వేడి చేయడం ద్వారా వాటిలో ఉండే మలినాలు నాశనమవుతాయి. వివిధ ప్రక్రియల్లో శుభ్రం చేయడం ద్వారా తెల్లని పొడి రూపంలో ఉండే ఎరువుగా బయటకు వస్తుంది.
శానిటేషన్‌లో ఇదో విప్లవం
శానిటేషన్‌లో ఇదో విప్లవం. రానున్న ఐదేళ్లలో రాష్ట్రంలోని 110 మునిసిపాలిటీల్లోనూ ఇటువంటి ప్లాంటులు నిర్మిస్తాం. ఇందులో తయారయ్యే ఎరువు మామూలు రసాయన ఎరువులు కంటే మంచిది. పాలకొల్లు, కొవ్వూరుల్లో కూడా ప్లాంటు ఏర్పాటుకు స్థలాలు దొరికాయి. మునిసిపాలిటీలకు ఖర్చు ఉండదు. –డాక్టర్ సీఎల్ వెంకటరావు, స్వచ్ఛాంధ్రమిషన్, ఏపీ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్
మా పట్టణానికే గర్వకారణం
బృహత్తర ప్రాజెక్ట్ దేశంలోనే ప్రయోగాత్మకంగా నరసాపురం పట్టణంలో పెట్టడం గర్వకారణం. ఇప్పటి వరకూ మలవ్యర్థాలను దొంగచాటుగా గోదావరిలో కలిపేస్తున్నారు. నది కలుషితం అవుతోంది. ఇక ఆ సమస్య ఉండదు –పి.రత్నమాల, మునిసిపల్ చైర్‌పర్సన్
చేతితో ముట్టుకునే పనిలేదు
ప్లాంట్ అత్యాధునిక టెక్నాలజీతో నిర్మాణమవుతుంది. ప్లాంట్‌లో కేవలం నలుగురు సిబ్బంది ఉంటారు. మలవ్యర్థాన్ని చేతితో ముట్టుకునే పని ఉండదు. అంతా మిషన్‌ల ద్వారానే జరుగుతుంది. అసలు చుట్టు పక్కల వారికి కాలుష్యం అనే సమస్య ఉండదు. పైపెచ్చు ఇక్కడ తయారయ్యే ఎరువుతో పక్కన పార్కులో వివిధ రకాల మొక్కలు పెంచుతాం. పాలకొల్లు, కొవ్వూరు పట్టణాల్లో కూడా త్వరలో పనులు చేపడతాం. –పి.లక్ష్మీప్రసన్న, బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ అర్బన్ ప్లానర్