విత్తన పంపిణీకి బయోమెట్రిక్
విత్తన పంపిణీకి బయోమెట్రిక్
Published Sat, Sep 24 2016 11:44 PM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
కర్నూలు(అగ్రికల్చర్): రబీ సీజన్‌కు సంబంధించి శనగ విత్తన పంపిణీ కార్యక్రమాన్ని బయోమెట్రిక్ విధానంలో చేపట్టాలని వ్యవసాయశాఖ కమిషనరేట్ అధికారి, ఏడీఏ(ఐటి) ప్రవీణ్‌కుమార్ తెలిపారు. ఆధార్ బేస్డ్ బయో మెట్రిక్ విధానం ద్వారా శనగల పంపిణీకి సంబంధించి ఏడీఏలు, మండల వ్యవసాయాధికారులు, ఏఈఓలు, ఎంపీఈఓలకు కలెక్టరేట్‌లోని వ్యవసాయశాఖ సమావేశ మందిరం, డ్వామా హాలు, ఏడీఏ కార్యాలయాల్లో శనివారం శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. శిక్షణ నిమత్తం కమిషనరేట్ నుంచి ప్రత్యేకంగా వచ్చిన ఏడీఏ ప్రవీణ్‌కుమార్ విత్తన పంపిణీపై వివరించారు. ఖరీప్ సీజన్‌లో అనంతపురం జిల్లాలో వేరుశనగ పంపిణీని ఈ విధానంలో విజయవంతంగా పూర్తి చేశామన్నారు. అదే తరహాల్లో ప్రస్తుతం కర్నూలు జిల్లాలో శనగల పంపిణీ చేపట్టాలని సూచించారు. ఇందుకోసం ఏర్పాటు చేసిన యాప్‌ను ఉపయోగించే విధానంపై వివరించారు. పర్మిట్‌లు ఇచ్చే చోట, విత్తనాలు ఇచ్చే గోదాములో చేయాల్సిన పనులు వివరించారు. నిక్ జిల్లా సాంకేతిక డైరెక్టర్ నూర్జాహాన్ యాప్‌ను వినియోగించే విధానంపై వివరించారు. వర్షాలు తెరిపిచ్చిన తర్వాత అంటే ఈ నెల 28, 29 నుంచి విత్తనాల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నట్లు జేడీఏ ఉమామహేశ్వరమ్మ తెలిపారు. యాప్ ద్వారా పంపిణీలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏడీఏలు రమణారెడ్డి, నర్సిరెడ్డి, సుధాకర్, రాజశేఖర్, సీడ్స్ ఏఓ శారద తదితరులు పాల్గొన్నారు
Advertisement
Advertisement