బీసీ హాస్టళ్లలో రేపటి నుంచి బయోమెట్రిక్
కోవెలకుంట్ల: బీసీ సంక్షేమ వసతి గృహాల్లో డిసెంబర్ 1వ తేదీ నుంచి బయోమెట్రిక్ విధానం అమలు కానుంది. జిల్లాలో బీసీ వసతిగృహాలు 54 ఉన్నాయి. ఈ హాస్టళ్లలో ఉంటూ 3 నుంచి 7వ తరగతి చదువుతున్న విద్యార్థులకు నెలకు రూ. 750, అలాగే 8 నుంచి పదో తరగతి విద్యార్థులకు రూ. 850, ఒక్కో విద్యార్థికి రోజుకు 400 గ్రాముల బియ్యం అందజేస్తోంది. వీటితో విద్యార్థులకు ఉదయం, రాత్రివేâ¶ళలు(పాఠశాలలు సెలవుదినాల్లో మధ్యాహ్నాం) భోజన సౌకర్యం కల్పిస్తున్నారు. కొన్ని హాస్టళ్లలో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ కొందరు వార్డెన్లు.. బోగస్ హాజరు శాతంతో డైట్ చార్జీలు, బియ్యాన్ని స్వాహా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. బోగస్ హాజరు శాతానికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం హాస్టల్ అధికారులు, సిబ్బంది, విద్యార్థులకు బయెమెట్రిక్ విధానం అమలు చేయనుంది. డిసెంబర్ 1వ తేదీ నుంచి విద్యార్థులు ప్రతిరోజు బయోమెట్రిక్ విధానంలో వేలిముద్రలు వేయాల్సి ఉంది. విద్యార్థుల వేలిముద్రలు ఆధారంగా డైట్‌చార్జీలు, బియ్యం కేటాయించి భోజన సౌకర్యం కల్పించాల్సి ఉంది. అలాగే హాస్టల్‌లో పనిచేసే సిబ్బంది సైతం రోజుకు రెండుసార్లు బయోమెట్రిక్ విధానంలో వేలిముద్రలు వేసేలా చర్యలు తీసుకుంటున్నారు. దీంతో విధులకు డుమ్మాకొట్టే సిబ్బందికి చెక్‌పడనుంది. ఈ విధానంపై అవగాహన కల్పించేందుకు బుధవారం జిల్లా కేంద్రంలో శిక్షణ తరగతులు ఏర్పాటు చేశారు.