తప్పుబడుతున్న ఉపాధ్యాయ సంఘాలు
తప్పదంటున్న విద్యాశాఖ ఉన్నతాధికారులు
ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల హాజరుపై తీవ్ర విమర్శలున్న నేపథ్యంలో బయోమెట్రిక్ అటెండె¯Œ్స ప్రవేశపెట్టనున్నారు. బడిలో కనీస సదుపాయాలు కల్పించకుండా, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించకుండా ప్రభుత్వం బయోమెట్రిక్‌పై దృష్టి సారించడాన్ని ఉపాధ్యాయులతోపాటు ఉపాధ్యాయ సంఘాలు కూడా వ్యతిరేకిస్తున్నాయి.
కదిరి : సర్కారు బడి అనగానే ఉపాధ్యాయులు ఎప్పుడైనా వస్తారు.. ఎప్పుడైనా వెళ్తారనే అపవాదు జనంలో నాటుకుపోయింది. బడికి ఆలస్యంగా వెళ్లేవారు కొందరైతే, రాజకీయ పలుకుబడితో అసలే వెళ్లని వారూ కొందరున్నారని, వారంలో మూడు రోజులు ఒకరు వెళ్తే, మిగతా మూడురోజులు మరొకరు వెళ్తున్నారని చంద్రబాబు సర్కారు భావిస్తోంది. మరికొందరు ఉపాధ్యాయులు తమకు బదులుగా వారి స్థానంలో ఒక వలంటీర్‌ను ఏర్పాటు చేసి సదరు ఎంఈఓలకు సైతం అంతోఇంతో ముట్టజెబుతున్నారన్న సమాచారాన్ని కూడా విద్యాశాఖ పసిగట్టింది. ఈ క్రమంలో అయ్యవార్లను బడికి పరిగెత్తించేందుకు బయోమెట్రిక్ విధానాన్ని తీసుకొస్తోంది.
త్వరలోనే ఈ విధానాన్ని అమలు చేయనున్నట్లు విద్యాశాఖామంత్రి గంటా శ్రీనివాసరావుతోపాటు విద్యాశాఖ జిల్లా ఉన్నతాధికారులు కూడా ఇప్పటికే చెప్పకనే చెప్పేశారు. మండల విద్యాశాఖ అధికారులతో పాటు ఉపాధ్యాయులకు కూడా వీడియో కాన్ఫరె¯Œ్సల ద్వారా విషయం అర్థమయ్యేలా చెప్పారు. తొలుత ప్రాథమిక పాఠశాలలను మినహాయించి, మిగిలిన ప్రాథమికోన్నత, ఉన్నత, కేజీబీవీలతో పాటు ఆదర్శ పాఠశాలల్లో ఈ విధానాన్ని అమలు చేసి ఆ తర్వాత ప్రాథమిక పాఠశాలల్లో అమలు చేయాలని సర్కారు నిర్ణయించింది. 2017 జనవరి 2 నుంచి ప్రారంభించాలని భావించినప్పటికీ ఇంకా జిల్లాలో చాలా పాఠశాలల్లో విద్యార్థుల ఆధార్ ప్రక్రియ పూర్తి కాకపోవడం అడ్డంకిగా తయారైంది.
దీంతో సంక్రాంతిలోపు ఈ తంతు ముగించాలని జిల్లా ఉన్నతాధికారులు ఆయా మండల విద్యాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అంటే సంక్రాంతి సెలవుల అనంతరం బడిలో విద్యార్థులతోపాటు ఉపాధ్యాయులకు సైతం బయోమెట్రిక్ అమల్లోకి రానుంది. ఆ రోజుకు ఆధార్ వంద శాతం పూర్తయిన ప్రా«థమిక పాఠశాలలను అప్పటికప్పుడు పరిగణనలోకి తీసుకుని వాటిలోనూ బయోమెట్రిక్ అమలు చేయనున్నారు. ఇప్పటికే సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థుల హాజరుపై బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే.
ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు సమాచారం
జిల్లాలో 3,164 ప్రాథమిక పాఠశాలలు, 1,633 ప్రాథమికోన్నత, ఉన్నత, ఆదర్శ పాఠశాలలు ఉన్నాయి. ఇవి కాకుండా ప్రతి మండలంలోనూ ఒక కస్తూరిబా బాలికా విద్యాలయం ఉంది. వీటన్నింటిలో 14,402 మంది ఉపాధ్యాయులు పని చేస్తుండగా సుమారు 4.5 లక్షల మంది విద్యార్థులున్నారు. పాఠశాలలో ప్రార్థనా సమయానికి ఎంతమంది ఉపాధ్యాయులు హాజరయ్యారు? ఆలస్యంగా ఎందరొచ్చారు? అసలు బడికే రానివారు ఎందరు? సెలవులో ఉన్నదెవరు? అన్న విషయాలు ఎప్పటికప్పుడు బయోమెట్రిక్ విధానం ద్వారా ఉన్నతాధికారులకు ఇట్టే తెలిసిపోతుంది. ఉపాధ్యాయ సంఘాలు ఈ విధానాన్ని వ్యతిరేకిస్తున్నప్పటికీ ప్రభు త్వం మాత్రం బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేసి తీరాలని నిర్ణయించిందని, అమలు చేయక తప్పదని ఉన్నతాధికారులు చెబుతున్నారు.
చంద్రన్న సంక్రాంతి కానుక !
పాఠశాలల్లో కనీస సదుపాయాలపై దృష్టి సారించకుండా, ఉపాధ్యాయులకు న్యాయబద్దంగా చెల్లించాల్సిన 2 డీఏలు ఇవ్వకుండా బయోమెట్రిక్ ప్రవేశపెడుతున్నారు. దీనివల్ల సమయం వృథా తప్ప మరో ప్రయోజనం లేదు. ముందుగా 10 నెలల అరియర్స్, సర్వీస్ రూల్స్, హెల్త్ కార్డులకు కార్పొరేట్ ఆసుపత్రుల్లో నగదు రహిత వైద్యం లాంటివి అమలు చేయాలని వైఎస్సార్‌టీఎఫ్ తరపున మేం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.
– అశోక్‌కుమార్‌రెడ్డి,
వైఎస్సార్‌టీఎఫ్ జిల్లా అధ్యక్షుడు
మిషన్లనే నమ్ముతున్నాడు
చంద్రబాబునాయుడు ఉపాధ్యాయులను నమ్మడం లేదు. మిషన్లను నమ్ముతున్నాడు. ఎన్నో ఏళ్లుగా మహిళా టీచర్లతో పాటు అమ్మాయిలు మూత్రశాలలు, మరుగుదొడ్లు లేక ఇబ్బంది పడుతున్నారు. బయోమెట్రిక్‌పై ఉన్న శ్రద్ధ పాఠశాలల్లో మరుగుదొడ్లు నిర్మించడం లాంటి సమస్యలపై చూపితే సంతోషించేవాâýæ్లం. కేవలం విద్యాశాఖలో మాత్రమే బయోమెట్రిక్ విధానం అమలు చేయాలనుకోవడంలో ఆంతర్యమేమిటి?.
– ఎం.శ్రీనివాసప్రసాద్, ఎస్టీయూ రాష్ట్ర కార్యదర్శి
గ్రామాల్లో వసతులేవీ?
పనిచేసే చోటే నివాసముండటానికి ఎవ్వరికీ అభ్యంతరం లేదు. కానీ అద్దెకుండాలంటే ఇల్లు ఉండాలి కదా..? బయోమెట్రిక్ సాకుతో సర్కారు బడులను రద్దు చేసి, నారాయణ వంటి పాఠశాలలను అభివృద్ధి చేయడానికే కదా?. పాఠశాలలు, గ్రామాలకు మొదట కనీస మౌలిక సదుపాయాలు కల్పించండి. పాఠశాలలను పర్యవేక్షించేందుకు ఎంఈఓ పోస్టులను భర్తీ చేస్తే ఎలాంటి బయోమెట్రిక్‌లు అవసరం లేదు.
– శ్రీధర్‌రెడ్డి, పీఆర్‌టీయూ, జిల్లా ప్రధాన కార్యదర్శి