
ఐఎస్‌ఐ తీవ్రవాదులకంటే ప్రమాదకారులు
కాల్‌మనీ వ్యాపారులు ఐఎస్‌ఐ తీవ్రవాదుల కంటే ప్రమాదకారులని బీజేపీ శాసనసభ పక్ష నేత విష్ణుకుమార్‌రాజు ఆవేదన వ్యక్తం చేశారు.
కాల్‌మనీపై సభలో బీజేపీ నేత విష్ణుకుమార్‌రాజు
సాక్షి, హైదరాబాద్: కాల్‌మనీ వ్యాపారులు ఐఎస్‌ఐ తీవ్రవాదుల కంటే ప్రమాదకారులని బీజేపీ శాసనసభ పక్ష నేత విష్ణుకుమార్‌రాజు ఆవేదన వ్యక్తం చేశారు. జీరో అవర్‌లో సోమవారం ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు. అప్పులు ఇచ్చిన వారు.. బాధితుల ఆస్తుల డాక్యుమెంట్లు తీసుకుంటున్నారని, అప్పులు చెల్లించిన తర్వాతా వాటిని తిరిగి ఇవ్వడం లేదని వివరించారు. ఈ సమస్యను అరికట్టడానికి ప్రభుత్వమే ప్రామిసరీ నోట్లు ముద్రించి విక్రయించాలని సూచించారు. కాల్‌మనీ, చిట్‌ఫండ్ కంపెనీల నియంత్రణకూ చట్టం తీసుకురావాలని కోరారు.
మంత్రులు ఫోన్లు తీయడం లేదు... : ఎమ్మెల్యేలు ఫోన్ చేస్తే మంత్రులు సమాధానం ఇవ్వరని, అసలు ఫోన్లు తీయరని విష్ణుకుమార్‌రాజు ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రులు క్షేత్రస్థాయికి వచ్చినప్పుడు జనం సమస్యలు పట్టించుకోరని, ఫోటోలు తీయించుకోవడానికే పరిమితమవుతున్నారని విమర్శించారు. ఈ అంశాన్ని ప్రస్తావించినప్పుడు.. టీడీపీ ఎమ్మెల్యేలు బల్లలు చరిచారు. స్పీకర్ స్థానంలో ఉన్న డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ గట్టిగా నవ్వేశారు.