♦ టీడీపీకి ఆ పార్టీ నేతల హెచ్చరిక
♦ ఎర్రచందనం, ఇసుక దోచుకుంటున్నారని విమర్శ
కడప రూరల్: రాష్ట్రంలో బీజేపీని అణగదొక్కాలని చూస్తే సహించేది లేదని ఆ పార్టీ నేతలు టీడీపీని హెచ్చరించారు. బుధవారం కడప ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో ఆ పార్టీ నేతలు విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో పార్టీలకు అతీతంగా పాలన సాగాలని, ఏకపక్ష పాలన ఎంతమాత్రం తగదని ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. మిత్రపక్ష సిద్ధాంతాల ప్రకారం కలిసికట్టుగా ప్రజా సంక్షేమం కోసం పాటుపడాలని ఆయన సూచించారు. రాష్ట్ర విభజన జరిగాక రాష్ట్రంలోని 13 జిల్లాలపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. అయితే కొన్ని ప్రాజెక్టులకు భూములు కేటాయించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. అలాగే జన్మభూమి కమిటీలతో అర్హులకు తీవ్ర అన్యాయం జరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు.
మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. రాష్ర్టంలో బీజేపీని బలోపేతం చేసేందుకు కోర్ కమిటీని ఏర్పాటు చేశామన్నారు. తాము ఎక్కడికి వెళ్లినా జన్మభూమి కమిటీల వల్ల అర్హులకు అన్యాయం జరుగుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పార్టీలకు అతీతంగా పేదల సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగించాలన్నారు. మిత్రపక్షమైనంత మాత్రాన టీడీపీ తప్పులు చేస్తే చూస్తూ ఊరుకోబోమని, ప్రజల పక్షాన నిలదీస్తామన్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గసభ్యురాలు శాంతారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో అధికార పార్టీ నేతలు ఎర్రచందనాన్ని, ఇసుకను దోచుకుంటున్నారని ఆరోపించారు.
బీజేపీని అణగదొక్కితే..సహించం
Published Thu, Nov 5 2015 3:47 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
Advertisement
Advertisement