
తీవ్ర రక్తస్రావమై బాలింత మృతి
తీవ్ర రక్తస్రావమై ఓ బాలింత మృతి చెందింది. అయితే తమ బిడ్డ మృతి చెందడానికి డాక్టర్లే కారణమని బంధువులు ఆరోపించారు. తమ నిర్లక్ష్యం లేదని, తమ వంతు కృషి చేశామని డాక్టర్లు తెలిపారు.
జమ్మలమడుగు: తీవ్ర రక్తస్రావమై ఓ బాలింత మృతి చెందింది. అయితే తమ బిడ్డ మృతి చెందడానికి డాక్టర్లే కారణమని బంధువులు ఆరోపించారు. తమ నిర్లక్ష్యం లేదని, తమ వంతు కృషి చేశామని డాక్టర్లు తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. వెంకటేశ్వర కాలనీకి చెందిన గర్భిణి కమటం లక్ష్మిదేవి పురిటి నొప్పులతో గురువారం స్థానిక ప్రభుత్వాసుపత్రికి వెళ్లింది. అక్కడ బిడ్డ అడ్డం తిరిగింది.. గైనకాలజిస్టు లేరు, ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లాలని ఆసుపత్రి సిబ్బంది సూచించారు. దీంతో పట్టణంలోని ఓ ప్రైవేట్ నర్సింగ్ హోంలో చేర్పించారు. అక్కడ వైద్యురాలు చిన్న సర్జరీ చేసి బిడ్డను బయటకు తీశారు. సర్జరీ తర్వాత బాలింతకు ఎక్కువ రక్తస్రావమైంది. దీంతో స్థానికుల నుంచి బ్లడ్ సేకరించి ఎక్కించారు. అయినా రక్తస్రావం ఆగలేదు. దీంతో హుటాహుటిన ప్రత్యేక వాహనంలో ప్రొద్దుటూరులోని జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడ డాక్టర్లు ఈ పరిస్థితుల్లో తాము ఏం చేయలేమని, తిరుపతికి తీసుకెళ్లాలని సూచించారు. దీంతో రాత్రి 11గంటల సమీపంలో తిరుపతికి బయలుదేరి వెళ్లారు. తిరుపతికి సమీపంలోకి వెళ్లగానే పరిస్థితి విషమించి లక్ష్మిదేవి (30) మృతి చెందింది. బిడ్డ క్షేమంగా ఉంది. కాగా శుక్రవారం మృతురాలి బంధువులు జమ్మలమడుగులోని ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లి డాక్టర్లతో వాదనకు దిగారు. తమ బిడ్డ మృతికి డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమని గొడవకు దిగారు.