బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం: మేయర్
హైదరాబాద్: నగరంలోని నానక్ రాంగూడాలో నిర్మాణంలో ఉన్న భవనం కూలిపోవడం స్థానికంగా కలకలం రేపింది. ఈ ప్రమాదానికి కారణమైన బాధ్యులపై పూర్తిస్థాయిలో చర్యలు తీసుకుంటామని జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రాంమోహన్ అన్నారు. సమాచారం అందుకున్న వెంటనే సహాయక చర్యలను చేపట్టామని చెప్పారు. బాధ్యులు ఎవరైనా ఉపేక్షించేది లేదని, ఎన్ని కుటుంబాలు ఉన్నాయన్న దానిపై స్పష్టత లేదన్నారు. ఆ భవనం సత్తుసింగ్ అనే వ్యక్తికి చెందినదని అధికారులు భావిస్తున్నారు. వాచ్ మెన్ కుటుంబం, మరో నాలుగు కార్మికుల కుటుంబాలు ఇందులో నివసిస్తున్నాయి.
బాధితులకు ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రిలో ఎక్కడ ట్రీట్ మెంట్ తీసుకున్నా ఆర్థిక సాయం అందించడానికి సిద్ధంగా ఉన్నామని మేయర్ చెప్పారు. టౌన్ ప్లానింగ్ సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు ఘటనాస్థలానికి చేరుకుని జేసీబీలతో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. టౌన్ ప్లానింగ్ అధికారులు కొందరు పర్మిషన్ ఐదు అంతస్తులకు తీసుకుంటే.. కట్టేది మాత్రం అంతకంటే ఎక్కువ అంతస్తులని, అధికారుల కళ్లుగప్పి అక్కడక్కడా ఇలాంటి నిర్మాణాలు జరుగుతున్నాయని తెలిపారు. వీటిని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటాం.
ఫిల్మ్ నగర్ సొసైటీలో ఇటీవల ఓ భవనం కూలిన ఘటనపై చర్యలు తీసుకోనందున ఇదే తరహాలో నిర్మాణంలో ఉన్న భవనాలు కూలిపోతున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఫిల్మ్ నగర్ సొసైటీ క్లబ్ వారికి ఇప్పటివరకూ మళ్లీ నిర్మాణం చేపట్టేందుకు పర్మిషన్ ఇవ్వలేదని మేయర్ రాంమోమన్ మీడియాకు వివరించారు.