ఐదుకు చేరిన మృతుల సంఖ్య
హైదరాబాద్: నగరంలోని నానక్‌రామ్‌గూడలో భవనం కుప్పకూలిన ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య ఐదుకు పెరిగింది. సహాయ సిబ్బంది మరో మహిళ మృతదేహాన్ని వెలికితీశారు. అంతకుముందు బయటకు తీసిన నలుగురి మృతదేహాలు శివ, నారాయణమ్మ, పైడమ్మ, గౌరీశ్వరివిగా గుర్తించారు. శిథిలాల కింద ఇంకా పలువురు చిక్కుకున్నట్టు సమాచారం. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
ఘటనా స్థలాన్ని వైఎస్సార్ సీపీ నాయకులు బొత్స సత్యనారాయణ, గట్టు శ్రీకాంత్ రెడ్డి పరిశీలించారు. అధికారులను అడిగి ప్రమాద కారణాలను తెలుసుకున్నారు. మరోవైపు తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఉదయం నుంచి సహాయక కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు.
వైఎస్ జగన్ సంతాపం
భవనం కుప్పకూలిన ఘటనలో మృతి చెందిన వారికి ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.