కూలిన బతుకులు | building collapsed in nanakramguda | Sakshi
Sakshi News home page

కూలిన బతుకులు

Published Fri, Dec 9 2016 2:01 AM | Last Updated on Wed, Aug 15 2018 9:37 PM

కూలిన బతుకులు - Sakshi

కూలిన బతుకులు

  • నగరంలో కుప్పకూలిన ఏడంతస్తుల భవనం..
  • 16 మంది మృతి చెందినట్లుగా అనుమానం
  • నిర్మాణంలో ఉండగానే భారీ ప్రమాదం
  • భవనంలోనే 14 కుటుంబాలకు చెందిన 30 మంది కూలీలు!
  • వేగంగా కొనసాగుతున్న సహాయక చర్యలు
  • కేవలం 260 గజాల్లోనే ఏడంతస్తుల భవనం
  • లోపభూయిష్టంగా, ఎలాంటి అనుమతులూ లేకుండానే నిర్మాణం
  • భవన యజమాని సత్తూ సింగ్‌ పెద్ద గుడుంబా డాన్‌! 
  • సాక్షి, హైదరాబాద్‌
    నిర్మాణంలో ఉన్న ఓ ఏడంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది.. ఆ నిర్మాణంలోనే పనిచేస్తున్న పలువురు కూలీల కుటుంబాలను బలితీసుకుంది. హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడలో గురువారం  రాత్రి 9.10 గంటల సమయంలో జరిగిన ఈ దుర్ఘటనలో 16 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. మరింత మంది శిథిలాల కింద చిక్కుకుపోయినట్లు భావిస్తున్నారు.  భవన శిథిలాల కింద ఓ మహిళ, ఓ చిన్నారి ఆర్తనాదాలు వినిపిస్తున్నాయని సహాయక సిబ్బంది చెబుతున్నారు. వారిని శిథిలాల నుంచి బయటకు తీసేందుకు రెస్క్యూ టీమ్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

    టోలిచౌకి ప్రాంతానికి చెందిన తుల్జాపూర్‌ సత్యనారాయణ సింగ్‌ ఈ భవనం యజమాని. ఆయన కేవలం 260 గజాల స్థలంలో ఏకంగా జీప్లస్‌ 6 (ఏడు అంతస్తులు)తో పాటు పైన పెంట్‌హౌస్‌ కూడా నిర్మిస్తున్నారు. 2015 సెప్టెంబర్‌ నుంచి ఈ భవన నిర్మాణం కొనసాగుతోందని, నిర్మాణంలోని  ఆ భవనంలోనే జిల్లాల నుంచి వచ్చిన 14 కుటుంబాలకు చెందిన 30 మంది కూలీలు నివసిస్తున్నారని తెలుస్తోంది. ప్రమాద సమయంలో వారంతా భవనంలోనే ఉన్నారని, కొన్ని కుటుంబాలకు చెందిన చిన్న పిల్లలు కూడా ఉన్నారని స్థానికులు చెబుతున్నారు. శిథిలాల కింద చిక్కుకున్న వారు చేస్తున్న ఆర్తనాదాలు అక్కడున్న అందరినీ కలచి వేస్తున్నాయి.  

                           
    ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

    ప్రమాద విషయం తెలిసిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. శిథిలాల కింద ఉన్నవారిని రక్షించేందుకు జేసీబీలు, క్రేన్‌లతో ప్రయత్నిస్తు న్నారు. భవనం వద్దకు వెళ్లేదారి ఇరుకుగా ఉండడంతో సహాయక చర్యలకు ఇబ్బంది ఎదురవుతోందని పోలీసులు చెబుతున్నారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ, మంత్రులు నాయిని, పద్మారావు, ఎమ్మెల్యే అరికె పూడి గాంధీ, రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ సందీప్‌ శాండిల్య, డిప్యూటి మేయర్‌ బాబా ఫసియుద్దీన్‌ తదితరులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. క్షతగాత్రులకు తక్షణ వైద్యం అందిం చేందుకు సమీప ఆసుపత్రుల నుంచి అంబులెన్స్‌లను రప్పించారు.

    ఎందుకు కూలిపోయింది?
    లోపభూయిష్టంగా నిర్మాణం చేపట్టడం వల్లే భవనం కూలిపోయిందని కొందరు స్థానికులు చెబుతుండగా... ఆ భవనానికి వెనుక మరో భవన నిర్మాణం కోసం బాంబులతో పేల్చి సెల్లార్‌ గుంత  తీస్తుండడమే  ప్రమాదానికి కారణమని మరికొందరు చెబుతున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా, కనీస జాగ్రత్తలు తీసుకోకుండా భవనాన్ని నిర్మిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. కాగా సత్యనారాయణసింగ్‌ భవనం కుప్పకూలిపోవడంతో.. ఆ ధాటికి పక్కనే ఉన్న తుల్జాపూర్‌ వీరేంద్రసింగ్‌కు చెందిన రెండస్తుల భవనం బీటలు వారి, కొంత మేర దెబ్బతిన్నది. వీరేంద్రసింగ్‌ కుమార్తెలకు స్వల్ప గాయాలయ్యాయి.

    విచారం వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్‌
    నానక్‌రామ్‌గూడలో భారీ భవంతి కుప్పకూలడంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్, జీహెచ్‌ఎంసీ  కమిషనర్లతో ఫోన్‌లో మాట్లాడారు. వేగంగా సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అవసరమైతే ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలను వినియోగించుకోవాలని సూచించారు.

    కారకులపై చర్యలు తీసుకుంటాం
    ‘‘అనుమతుల్లేని, అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం. అయినా కొత్త బిల్డర్లు వచ్చి ఇష్టారాజ్యంగా కొత్త భవనాలు నిర్మిస్తున్నారు. ప్రమాదానికి కారకులైన వారిని వదిలిపెట్టం. అనుమతుల్లేని నిర్మాణా లను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు..’’
    –బొంతు రామ్మోహన్, జీహెచ్‌ఎంసీ మేయర్‌

    తక్షణ వైద్యసాయానికి చర్యలు
    ‘‘కూలిన భవనంలో చిక్కుకున్న క్షతగాత్రులకు తక్షణ వైద్యసాయం అందించేందుకు చర్యలు చేపట్టాం. సమీపంలోని ఆసుపత్రులను అప్రమత్తం చేసి అంబులెన్సులు రప్పించాం. వీలైనంతవ రకు ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకుంటాం..’’
     జనార్దన్‌రెడ్డి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌

    యజమాని గుడుంబా డాన్‌!
    నానక్‌రామ్‌గూడలో కుప్పకూలిన భవనం యాజమాని తుల్జారాం సత్యనారాయణసింగ్‌ అలియాస్‌ సత్తూ సింగ్‌ ఆ ప్రాంతంలో గుడుంబా డాన్‌ అని తెలిసింది. కూలిన భవనానికి ఎదురుగా సత్తు సింగ్‌కు ఆరు అంతస్తుల  మరో భవనం ఉంది. అతను రెండు దశాబ్దాలుగా ఆ ప్రాంతంలో గుడుంబా అక్రమ వ్యాపారం చేస్తున్నాడని తెలిసింది. ఇక కూలిపోయిన భవనానికి జీహెచ్‌ఎంసీ నుంచి ఎలాంటి నిర్మాణ అనుమతులూ లేవు. గుడుంబా అ క్రమ వ్యాపారం నిర్వహిస్తుండగా కేసులు నమోదు చేసిన పోలీస్‌ అధికారులపై సత్తూ సింగ్‌ ఎన్నోసార్లు మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించాడు. సత్తూసింగ్‌ కుమారుడు అనిల్‌సింగ్‌ జీహెచ్‌ఎంసీ ఎ న్నికల్లో గచ్చిబౌలి కార్పొరేటర్‌ స్థానానికి స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement