జైట్లీ, వెంకయ్య చెప్పినవన్నీ అబద్ధాలే
వైఎస్సార్‌సీపీ నేత బొత్స సత్యనారాయణ ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, ఎం.వెంకయ్యనాయుడు విజయవాడలో పచ్చి అబద్ధాలు చెప్పారని వైఎస్సార్‌సీపీ నేత బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. ఆయన శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. అమరావతిలో పరిపాలనా నగరం, రహదారుల నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమంలో ఇద్దరు కేంద్ర మంత్రులు ముఖ్యమంత్రి చంద్రబాబును పొగడడంతోనే సరిపెట్టారని మండిపడ్డారు. ఏపీకి చాలా సాయం చేశామని కేంద్ర మంత్రులు చెబితే ముఖ్యమంత్రిప్రశ్నించాల్సింది పోయి అన్నీ ఇచ్చేశారని అబద్ధాలు చెప్పి రాష్ట్ర ప్రజలను మభ్య పెట్టారని దుయ్యబట్టారు.
తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఒక రాష్ట్రానికి కేంద్రం ఇంత సహాయం ఇవ్వడాన్ని ఎప్పుడూ చూడలేదని వెంకయ్య చెప్పడం దుర్మార్గమని విమర్శించారు. కేంద్రం ఏపీకి ఇచ్చామంటున్న ఐఐటీ, ఐఐఎం వంటి సంస్థలు ఏ రాష్ట్రంలో లేవో చెప్పాలని ప్రశ్నించారు. కోటి జనాభా దాటిన ప్రతి రాష్ట్రంలో ఇలాంటి సంస్థలు ఉన్నాయన్నారు.
ఇవ్వని ప్యాకేజీని ఇచ్చినట్లుగా చెబుతారా?
‘‘ఏ చట్టంలో ఉందని గుజరాత్‌కు రైల్వే యూనివర్సిటీ ఇచ్చారు? ఏ చట్టం ప్రకారం హైదరాబాద్‌లో ఐఐసీటీ, సీసీఎంబీ, బీహెచ్‌ఈఎల్, హెచ్‌ఏఎల్, ఈసీఐఎల్, హెచ్‌ఎంటీ, మిధానీ, బీడీఎల్, డీఎంఆర్‌ఎల్, డీఆర్‌డీఎల్, డీఆర్‌డీఓ, ఎద్దుమైలారంలో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ కట్టారు? ఏపీకి ఇచ్చిన 25 సంస్థలకు ఈ మూడేళ్లుగా కేంద్రం చేసిన కేటాయింపులెన్ని? అసలు వాటికి అవసరమయ్యే నిధులు ఎంతో చెప్పగలరా? రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చి ఉంటే ఉపాధి అవకాశాలు వాటంతట అవే పెరిగేవని, అసలైన దాన్ని ఎగ్గొట్టి ఇవ్వని ప్యాకేజీని ఇచ్చినట్లుగా రోజూ అబద్ధాలు చెప్పడం సిగ్గుచేటు’’ అని బొత్స నిప్పులు చెరిగారు.