'డబుల్ డెక్కర్'కు బ్రేక్
'డబుల్ డెక్కర్'కు బ్రేక్
Published Sun, Nov 20 2016 10:33 PM | Last Updated on Mon, Sep 4 2017 8:38 PM
- రైలును నిలిపేసిన దక్షిణ మధ్య రైల్వే
- రెండున్నరేళ్లు కాచిగూడ- తిరుపతి మధ్య కొనసాగిన సూపర్ ఫాస్టు సర్వీస్
- అసౌకర్యాల కారణంగా ప్రయాణికుల ఆదరణకు దూరం
- కొంత కాలంగా ఖాళీగా నడిచిన ట్రైన్
- రద్దు చేసి కోస్తావైపు నడుపుతున్న వైనం
కర్నూలు(రాజ్‌విహార్): రెండున్నరేళ్లుగా కాచిగూడ నుంచి కర్నూలు మీదుగా తిరుపతికి చక్కర్లు కొట్టిన సూపర్ ఫాస్ట్ సర్వీసు డబుల్ డెక్కర్ రైలుకు బ్రేక్ పడింది. ఈ రైలును నిలిపివేస్తూ దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఇటీవలే ఉత్తర్వులు జారీ చేశారు. గంటకు 160 కిలో మీటర్ల వేగంతో దూసుకెళ్లే సామర్థ్యం కల్గిన ఈ రైలులో బోగీలన్నీ ఏసీవే. అందమైన రంగులు, చూడగానే ఆకర్షించే అందం, స్పాంజీ కుషన్ సీట్లు, చక్కటి రూపం, కుదుపు, అలుపు లేని ప్రయాణ సౌలభ్యం.. ఇలా ఎన్నో ప్రత్యేకతలు ఉన్నప్పటికీ ప్రయాణికుల ఆదరణ పొందలేకపోయింది. కొన్ని అసౌకర్యాలు, అధిక చార్జీ కారణంగా కనీసం 20 మంది ప్రయాణికులు కూడా లేకుండా కొంత కాలంగా ఖాళీగా నడిచింది. దీంతో ఈరైలును నిలిపివేసి కోస్తా వైపు నడుతున్నారు.
- కర్నూలు చరిత్రలో తొలి ఏసీ రైలు..
కర్నూలు రైల్వే స్టేషన్ చరిత్రలో తొలి ఏసీ (పూర్తిగా) డబుల్ డెక్కర్ రైలు ఇదే. శతాబ్ధి, శాతవాహన, దురంతో లాంటి సూపర్ ఫాస్టు ఏసీ రైళ్లు మనకు లేవు. రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలున్నా కర్నూలులో హాల్టింగ్ (స్టాపింగ్) లేదు. కాచిగూడ స్టేషన్ (హైదరాబాదు) నుంచి తిరుపతి మధ్య నడిచిన ఈతొలి డబుల్ డెక్కర్ సూపర్ ఫాస్టు రైలు 2014 మే 14న ప్రారంభమైంది. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు కేవలం ఐదు మార్గాల్లో మాత్రమే డబుల్ డెక్కర్ రైళ్లు నడుస్తుండగా ఈ రెండు రైళ్ల రాకతో సంఖ్య 7కు చేరింది. ఇది కాచిగూడ- గుంటూరు, కాచిగూడ - తిరుపతి మధ్య వారానికి రెండు రోజుల చొప్పున నడిచింది. కాచిగూడ నుంచి (నంబర్ 22120) ప్రతి బుధ, శనివారాల్లో బయలుదేరి 11:00గంటలకు కర్నూలు వచ్చి 11:02కు బయలుదేరి వెళ్లేది. తిరుపతి నుంచి (నంబర్ 22119) గురు , ఆదివారాల్లో బయలుదేరి కర్నూలుకు మధ్యాహ్నం 13:02 గంటలకు వచ్చి 13:04 గంటలకు వెళ్లేది.
ఇవీ ప్రత్యేకతలు..
ఈ డబుల్ డెక్కర్ రైలంతా ఏసీతో కూడుకుంది. 10 బోగీల్లో 1200 సీట్లున్నాయి. ఒక్కోక్క బోగీలో పై అంతస్తులో 50, కింది అంతస్తులో 70 సీట్లు, ఏసీ చైర్ కారు ధరల చార్జీ, రెండు ప్రత్యేక బోగీల్లో ఏసీ పవర్ సిస్టమ్, గరిష్టంగా గంటకు 160 కిలో మీటర్ల వేగం కలిగి ఉన్నా జిల్లాలో ఉన్న పట్టాల వేగ సామర్థ్యం మేరకు గరిష్టంగా గంటలకు 100కిలో మీటర్ల వేగంతో నడిచేది. సాంకేతికతతో తయారు చేయడంతో ఇందులో పొగ వాసన రాగానే అలారం ఇందులో మోగుతుంది.
అసౌకర్యాలు..
- సీట్లన్నింటికీ రిజర్వేషన్ సౌకర్యం కల్పించడంతో జనరల్ కంపార్ట్‌మెంట్ టికెట్లుండవు. ముందుగా రిజర్వేషన్ చేయించుకున్న టికెట్ ఉంటేనే అనుమతి లభిస్తుంది. అప్పటికప్పుడు స్టేషన్‌కు చేరుకున్న ప్రయాణికుడు మరి కొద్దిసేపట్లో డబుల్ డెక్కర్ వస్తుంది.. డబ్బు ఎక్కువైనా అందులో వెళ్దామని ఆశించినా బుకింగ్ కౌంటర్‌లో టికెట్లు ఇవ్వరు.
- ఇందులో అమలవుతున్న చార్జీలు చూస్తే చుక్కలు కనపడతాయి. కర్నూలు నుంచి తిరుపతికి 350 కిలో మీటర్ల ప్రయాణానికి పెద్దలకు రూ.505, పిల్లలకు రూ.300, హైదరాబాదకు 213 కిలో మీటర్లుండగా పెద్దలకు రూ.375, పిల్లలకు రూ.295 చార్జీ ఉంటుంది.
- ముఖ్యంగా స్లీపర్ బెర్త్ (పడుకునే వీలు) సౌకర్యం లేకపోవడం ప్రధాన సమస్య. కర్నూలు నుంచి హైదరాబాదుకు 4గంటలు, తిరుపతికి 7:15 నిమిషాలు, హైదరాబాదు- తిరుపతి మధ్య 12గంటల సమయం పడుతుంది. ఇందులో అంతసేపు కేవలం కూర్చునే వెళ్లాలంటే వృద్ధులు, చిన్నపిల్లలు, స్త్రీలకు తీవ్ర అసౌకర్యం. ఇలాంటి కారణాలతో డబుల్ డెక్కర్ రైలు ప్రయాణికుల ఆదరణ పొందలేక రద్దు దిశగా ప్రయాణం కొనసాగించింది.
Advertisement
Advertisement