బ్రోకర్‌ అవతారంలో డాక్టర్‌ | Broker incarnation of the Doctor | Sakshi
Sakshi News home page

బ్రోకర్‌ అవతారంలో డాక్టర్‌

Published Mon, Jan 2 2017 1:46 AM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM

బ్రోకర్‌ అవతారంలో డాక్టర్‌ - Sakshi

బ్రోకర్‌ అవతారంలో డాక్టర్‌

పాత నోట్లమార్పిడికినల్లకుబేరులతో ఒప్పందం
రూ. 47 లక్షల కొత్త నోట్లతో చిక్కిన డాక్టర్‌ శిరీష్‌
నగరంలో నర్సింగ్‌ హోం నిర్వహణ
తల్లిదండ్రులు కూడా డాక్టర్లే..


గౌరవప్రదమైన వైద్య వృత్తిలో ఉన్నాడు.. తల్లిదండ్రులూ డాక్టర్లే కావడంతో జీవితంలో బాగానే స్థిరపడ్డాడు. సిటీలో కీలక ప్రాంతంలో కుటుంబంతో నర్సింగ్‌ హోం నిర్వహిస్తున్నాడు. డబ్బు బాగానే వెనకేశాడు. కానీ ఏం లాభం? అక్రమంగా వచ్చే డబ్బు కోసం ఆలోచనలు పెడదారి పట్టి అత్యాశకు పోయి పోలీసుల చేత చిక్కాడు. నగరంలోని శంకరమఠం రోడ్డు చేరువలో నివసిస్తున్న అన్నె శిరీష్‌ కథ ఇది. పెద్ద నోట్ల రద్దు తర్వాత సిటీలో చోటు చేసుకుంటున్న దిగ్భ్రాంతికర పరిణామాలకు మచ్చు తునకలాటి ఉదాహరణ ఇది. నోట్ల రద్దు తర్వాత తమ దగ్గర భారీ ఎత్తున పేరుకుపోయిన నల్లధనాన్ని కొందరు బ్రోకర్ల ద్వారా కమీషన్‌ చెల్లించి తెల్ల ధనంగా మార్చుకున్న శిరీష్‌ మాస్టర్‌ ప్లాన్‌ వేశాడు. తానే బ్రోకర్‌ అవతారమెత్తాడు. కొందరు నల్ల కుబేరులతో అవగాహన కుదుర్చుకున్నాడు. రూ. 5 కోట్లు మార్చేందుకు ఒప్పందం పెట్టుకుని వాళ్లకు ముందస్తుగా ఇవ్వడానికి అపార్ట్‌మెంట్‌లో రూ. 47 లక్షలు పెట్టుకుని రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. అతని అనుచరులు కూడా పట్టుబడ్డారు. ఈ సంఘటనపై సీబీఐ, ఐటీ అధికారులు దృష్టి సారించారు.  

విశాఖపట్నం: నోట్ల రద్దు తర్వాత నల్లధనాన్ని తెల్లధనంగా బడా బాబులు ఎలా మార్చుకుంటున్నారో నగరంలో వెలుగు చూస్తున్న ఉదంతాలు బయటపెడుతున్నాయి. తాజాగా ఓ డాక్టర్‌ నల్లధనం మార్పిడిలో కీలకంగా వ్యవహరించి టాస్క్‌ఫోర్స్‌కు చిక్కడం సంచలనమైంది. నాలుగో పట్టణ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని శంకర మఠం రోడ్డు సమీపంలోని రామలింగేశ్వర స్వామి ఆలయం దగ్గర శ్రీపవన్‌ ఎస్టేట్‌లోని ప్లాట్‌ నెంబర్‌ 401లో డాక్టర్‌ అన్నె శీరిష్‌ నివసిస్తున్నారు. ఆయన కదలికలపై అనుమానం రావడంతో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు కొంత కాలంగా నిఘా ఉంచారు. ఈ క్రమంలో రూ.47 లక్షల కొత్త, పాత నోట్లు తన ప్లాట్‌లో ఉంచాడని పోలీసులకు సమాచారం అందింది. వెంటనే టాస్క్‌ఫోర్స్‌ ఏసీపీ చిట్టిబాబు నేతృత్వంలో ఎస్‌ఐలు సతీష్, మూర్తి, సిబ్బంది దాడి చేసి డాక్టర్‌ శిరీష్‌తో పాటు, మరో ఇద్దరు బ్రోకర్లు మజ్జి సూర్యప్రసాద్‌రెడ్డి, బొడ్డేపల్లి శ్రీనివాస్‌లను అదుపులోకి తీసుకున్నారు. శిరీష్‌ ఉంటున్న అపార్ట్‌మెంట్‌ యజమాని సూర్యప్రసాద్‌రెడ్డి. వారి వద్ద నుంచి రూ.46 లక్షలు రెండు వేల నోట్లు, రూ.లక్ష వంద నోట్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని, నాలుగో పట్టణ పోలీసులకు అప్పగించారు.  

మార్పిడి అలా మొదలైంది  
అన్నె శీరిష్‌తో పాటు ఆయన తండ్రి శివాజీ, తల్లి కూడా వైద్యులే. వీరంతా కలిసి ద్వారకానగర్‌ మూడో లైన్‌లో అన్నపూర్ణ ఆస్పత్రి నడుపుతున్నారు. ఈ నేపథ్యంలో వారి వద్ద ఉన్న నల్లధనాన్ని పెద్ద నోట్లు రద్దు చేయడంతో ఏం చేయాలనే సమస్య ఎదురైంది. అదే సమయంలో నగరంలో నోట్ల మార్పిడి మూఠాల విషయం తెలుసుకుని వారిని శిరీష్‌ కలుసుకున్నాడు. తన వద్ద ఉన్న దాదాపు రూ.60 లక్షల నల్ల ధనాన్ని వారి సాయంతో తెల్లధనంగా మార్చుకున్నారు. దీనికోసం 30శాతం కమిషన్‌ను నోట్ల మార్పిడి ముఠాకు ఇచ్చారు. అయితే శిరీష్‌ అక్కడితో అగలేదు. ఈ పనేదో బాగుందని అపార్ట్‌మెంట్‌ యజమానితో కలిసి తానే బ్రోకర్‌గా మారాడు. అప్పటి నుంచి నగరంలో నల్లధనం మార్చడం ప్రారంభించారు.

రూ.15 కోట్లు మార్చాలని  
శిరీష్‌ ముఠా నోట్ల మార్పిడిని భారీ ఎత్తున చేయడం మొదలుపెట్టింది. తమకున్న పరిచయాలను ఉపయోగించుకుని నల్ల కుబేరులను సంప్రదించి వారి పాత నోట్లు మార్చుతుండేవారు. ఈ నేపథ్యంలో ఐదుగురు నల్లకుబేరుల నుంచి రూ.15 కోట్లు మార్చేందుకు చర్చలు జరిపారు. తొలుత రూ.5 కోట్ల నోట్లు మార్చేందుకు డీల్‌ కుదుర్చుకున్నారు. అయితే దీనికోసం రూ.50 లక్షలు ముందుగా (షోయింగ్‌ అమౌంట్‌) ఇచ్చిపుచ్చుకుంటారు. తమ ముఠాపై నమ్మకం కలిగించేందుకు ఇలా చేస్తుంటారు. ఆ సొమ్ము ఆదివారం తీసుకువచ్చారు. ఆ క్రమంలో పోలీసులకు చిక్కారు. శిరీష్‌కు చెందిన నాలుగు ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంకు ఖాతాల్లో రూ.36 లక్షలు సొమ్ము ఉంది. వాటి లెక్కలు తేలాల్సి ఉంది. అయితే నవంబర్‌ ఎనిమిది తర్వాత తమకు రోగుల నుంచి రావాల్సిన సొమ్ము వచ్చిందని శిరీష్‌ దొంగలెక్కలు చూపించి కొంత సొమ్మును బ్యాంకుల్లో డిపాజిట్‌ చేశాడని టాస్క్‌ఫోర్స్‌ ఏసీబీ చిట్టిబాబు ’సాక్షి’కి వెల్లడించారు.

కొత్త నోట్లు వచ్చిందిలా
పాత నోట్లను కొత్త నోట్లుగా మార్చేందుకు నగరంలో చాలా ముఠాలు పుట్టుకొచ్చాయి. ఎవరికీ అసలు బాస్‌ ఎవరో తెలియదు. ఎవరికి వారు తమ పాత్ర వరకూ పూర్తి చేస్తుంటారు. అయితే వారికి బ్యాంకులు, పోస్టాఫీసుల్లో పనిచేసే సిబ్బంది సహకారం ఎక్కువగా ఉంటుంది. ఎవరికి ఇవ్వాల్సిన కమిషన్‌ వారికి వెళ్లిపోతుంది. నగరంలోని చిన్నా చితకా వ్యాపారాలు, రోడ్డు పక్కన బళ్లు నడుపుకునే వారే వీరి టార్గెట్‌. వారికి కమీషన్‌ ఆశచూపి వారి కరెంట్‌ అకౌంట్‌లో డబ్బులు వేశారు. కరెంట్‌ అకౌంట్‌లో రోజుకి రూ.50వేలు డ్రా చేసుకునే వెసులుబాటు ఉంది. అందుకే వీరు ప్రతి డీల్‌కు వారం నుంచి పది రోజుల గడువు తీసుకునేవారు. బ్యాంకుల్లో డిపాజిట్‌ చేసి తర్వాత విత్‌డ్రా చేసుకుని తెల్లధనంగా మార్చుకున్నారు.  

ఇంతవరకూ 5 కేసులు
నల్లధనం మార్పిడి విషయంలో నగరంలో ఇప్పటి వరకూ ఐదు కేసులు వెలుగు చూశాయి. వాటిలో 22 మందిని అరెస్ట్‌ చేసి రూ.1.46 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో తాజా కేసు పెద్దది కావడంతో సీబీఐ, ఐటీ అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ కేసు తదుపరి విచారణను ఈ రెండు విభాగాలు జరపనున్నాయి. వీరికి కొత్త నోట్లు ఎలా వచ్చాయి. పోస్టాఫీసు, బ్యాంకుల పాత్రపై వారు లోతుగా ఆరా తీయనున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement