చెట్టును ఢీకొన్న ప్రైవేటు బస్సు
* ప్రమాదంలో మందికి గాయాలు
* బస్సులో 40 మంది ప్రయాణం
* మిగతా వారంతా సురక్షితం
వినుకొండ రూరల్: ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి ప్రమాదవశాత్తు బస్సు చెట్టు ఢీకొని 8 మందికి తీవ్ర గాయాలైన సంఘటన మండలంలోని చీకటీగలపాలెం గ్రామం సమీపంలో చోటు చేసుకుంది. బాధితుల కథనం మేరకు గుంటూరు వసంతరాయనిపురం, శ్రీనగర్‌కు చెందిన సుమారు 40 మంది బంధువులు విహారీ ట్రావెల్స్‌కు చెందిన ప్రై వేటు బస్సులో తన బంధువు కుమారుడైన పవన్ నిశ్చితార్థానికని ప్రొద్దుటూరు చేరుకున్నారు. శుభకార్యాన్ని ముగించుకొని తిరిగి వస్తున్న నేపథ్యంలో చీకటీగలపాలెం సమీపంలోకి రాగానే ఎదురుగా వస్తున్న లారీని తప్పించేందుకు బ్రేక్ వేయడంతో అదుపు తప్పి ప్రమాదవశాత్తు బస్సు చెట్టును ఢీకొంది. ప్రమాదంలో బాలమర్తి శ్రీహరి, రాయిసల సత్యవతమ్మ, రాయిసల సూరిబాబు, సీతలపాటి చలపతిరావు, కావ్య లక్ష్మి, బి. పద్మ, బాలమర్తి బాలకష్ణ, డ్రై వర్లు కొల్లూరి సుబ్బారావు గాయాలయ్యాయి. బాధితులు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని కేకలు వేయడంతో అటుగా వెళ్తున్న వాహనదారులు గమనించి రక్షణ చర్యలు చేపట్టారు. బస్సులో ఇరుక్కున్న వారిని స్థానికుల సహాయంతో 108 సిబ్బంది అద్దాలను పగుల గొట్టి బయటకు తీశారు. అనంతరం ఆగమేఘాలపై విడతలవారీగా ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన బాలమర్తి శ్రీహరి, సత్యవతమ్మ సూరిబాబు, చలపతిరావు, బాలమర్తి బాలకృష్ణను ప్రభుత్వ వైద్యశాలలో ప్రథమ చికిత్స అనంతరం గుంటూరు తీసుకెళ్లారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.