రాఘవులును పోలీసులు అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేయగా రక్షణగా నిలిచిన గ్రామస్తులు
రైతుల ఆమోదం లేకుండా భూసేకరణ నేరం
– సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు
ఓర్వకల్లు: ప్రై వేట్ పరిశ్రమలు, ప్రభుత్వ అవసరాలకు రైతుల ఆమోదం లేకుండా భూములు సేకరించడం చట్టరీత్యా నేరమని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బి.వి.రాఘవులు అన్నారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలంలోని శకునాల, గడివేముల, గని గ్రామాల పరిధిలో నెలకొల్పుతున్న అల్ట్రా మెగా సోలార్ పవర్ ప్లాంట్ భూ నిర్వాసితులకు మద్దతుగా సీపీఎం ఆధ్వర్యంలో బుధవారం శకునాల గ్రామంలో సంఘీభావ సభ ఏర్పాటు చేశారు. పార్టీ డివిజన్ కార్యదర్శి రామకృష్ణ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాఘవులుతో పాటు జిల్లా నాయకులు ప్రభాకర్‌రెడ్డి, నాగేశ్వరరావు పాల్గొన్నారు. రాఘవులు మాట్లాడుతూ భూములు కోల్పోయిన రైతులకు పరిహారం చెల్లింపులో జిల్లా కలెక్టర్ ఏడాదిగా నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో ఆయన నియంతృత్వ పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. రాజధాని నిర్మాణం పేరిట వేలాది ఎకరాల పంట భూములు తీసుకున్న ప్రభుత్వం ఈ ప్రాంత రైతులను సంక్షోభంలోకి నెట్టిందన్నారు. అధికారం చేతిలో ఉందని అధర్మ పాలన చేస్తే ముఖ్యమంత్రికి భవిష్యత్తులో రాజకీయ మనుగడ ఉండదన్నారు. పరిహారం కోసం న్యాయపోరాటం చేస్తే అక్రమ కేసులు బనాయిస్తూ రైతులను భయభ్రాంతులకు గురిచేయడం సరికాదన్నారు. పట్టాలు, పాసు పుస్తకాలు లేకపోయినా అనుభవంలో ఉన్న వారికే పరిహారం చెల్లించాలని న్యాయస్థానాలు చెబుతున్నా ప్రభుత్వం పెడచెవిన పెడుతోందన్నారు. ప్రయివేట్ కంపెనీలకు భూములను స్వాధీనం చేయకముందే పరిహారం చెల్లించాలన్నారు.
అడుగడుగునా అడ్డంకులు
రాఘవులు గ్రామానికి వెళ్లకుండా డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటయింది. కర్నూలు నుంచి శకునాల వరకు అంచెలంచెలుగా కాపు కాస్తుండటంతో పసిగట్టిన రాఘవులు కర్నూలు నుంచి హుసేనాపురం వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. అక్కడి నుంచి ద్విచక్ర వాహనంపై సభా ప్రాంతానికి చేరుకుని గంటసేపు ప్రసంగించారు. ఆ తర్వాత పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. అయితే రైతులు, మహిళలు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో సుమారు అరగంట పాటు తోపులాట చోటు చేసుకుంది. అక్కడి నుంచి రాఘవులుతో పాటు సీపీఎం నేతలను పోలీసులు అరెస్టు చేసి జీపులో ఓర్వకల్లు పోలీసుస్టేషన్‌కు తరలించారు. శాంతించని రైతులు ఓర్వకల్లు స్టేషన్ వద్ద బైఠాయించి ఆందోళన చేపట్టారు. పోలీసులు మొత్తం 60 మందిపై కేసు నమోదు చేసి సొంత పూచీకత్తుపై విడుదల చేశారు.