బైరెడ్డిని హౌస్ అరెస్ట్ చేసిన సీఐ శ్రీనాథ్‌రెడ్డి, ఎస్‌ఐ సుబ్రమణ్యం
- ప్రభుత్వ దౌర్జన్యానికి నిరసనగా దీక్ష
- బైరెడ్డికి సంఘీభావం తెలిపిన ప్రజలు
పగిడ్యాల: సీమ సమస్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిసి వినతిపత్రం సమర్పించేందుకు బయలుదేరిన రాయలసీమ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖరరెడ్డిని పోలీసులు అడ్డుకొన్నారు. ముచ్చుమర్రి గ్రామంలో ఆయనను హౌస్ అరెస్ట్ చేశారు. ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని జాతికి అంకితం చేసే కార్యక్రమంలో పాల్గొనేందుకు వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు భారీగా వచ్చరు. అయితే వీరు ముందుగా ముచ్చుమర్రిలోని బైరెడ్డిని చూసేందుకు క్యూ కట్టారు. ముఖ్యమంత్రి సభా వేదికను తలపించే విధంగా బైరెడ్డి ఇంటి మైదానం జనంతో కిక్కిరిసి పోయింది. ముచ్చుమర్రిలోని బైరెడ్డి ఇంటి పక్కనే రహదారిపై ట్రాఫిక్‌ను క్లియర్ చేసేందుకు పోలీసులకు తలనొప్పిగా మారింది. అయితే గ్రామ రైతులు, అభిమానులు, కార్యకర్తలతో కలిసి బైరెడ్డి.. సభా వేదికకు బయలుదేరడం గమనించిన నందికొట్కూరు సీఐ శ్రీనాథ్‌రెడ్డి పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అడ్డుకొని.. మధ్యాహ్నం 12 గంటల సమయంలో హౌస్ అరెస్ట్ చేశారు. ప్రభుత్వ నిరంకుశ వైఖరిని నిరసిస్తూ బైరెడ్డి ఇంటి ఆవరణంలోనే నాలుగు గంటల వరకు నిరసన దీక్ష చేపట్టారు. బైరెడ్డి నిరసనకుజెడ్పీటీసీ సభ్యురాలు రాధమ్మ, ఎంపీపీ పుల్యాల దివ్య, సర్పంచ్‌లు శ్రీనివాసులు, దాసు, ఎంపీటీసీ సభుయలు నాగభూషణం, గోవిందమ్మ, ఎంఆర్‌పీఎస్ రాష్ట్ర అ«ధ్యక్షుడు దండు వీరయ్యమాదిగ, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు నాగేశ్వరరావు సంఘీభావం తెలిపారు. అలాగే విద్యార్థి సంఘం నాయకులు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు మద్దతు తెలిపి జై రాలయసీమ అంటూ నినాదాలు చేశారు.
సీమలో బాబుకు రాజకీయ సమాధి తప్పదు
అధికార దర్పంతో దౌర్జన్యానికి పాల్పడుతున్న ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడికి రాయలసీమలో రాజకీయ సమాధి తప్పదని రాలయసీమ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖరరెడ్డి హెచ్చరించారు. హౌస్ అరెస్ట్‌ను నిరసిస్తూ సోమవారం బైరెడ్డి తన ఇంటి ఆవరణంలోనే 4 గంటల పాటు వందలాది మంది కార్యకర్తలతో దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ .. సీమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం ఇచ్చేందుకు బయలుదేరిన తనను పోలీసులు దౌర్జన్యంగా హౌస్ అరెస్ట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని జాతికి అంకితం చేస్తూ.. ముఖ్యమంత్రి రాయలసీమ సస్యశ్యామలంగా మారుతుందని అబద్ధాలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 69 జీవోను రద్దు చేయకుండాసీమ సస్యశ్యామలం అవుతుందంటే ఏవిధంగా నమ్మాలన్నారు. కృష్ణా నదికి వచ్చే వరద జలాలు కాకుండా నికర జలాలు ఇవ్వాలని డిమాండ్ చేయడం తప్పా...అని ప్రశ్నించారు. అన్నిటా రాయలసీమకు అన్యాయం చేస్తున్న బాబుకు రాబోయే కాలంలో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. పొదుపు మహిళలు సభకు..రాకపోతే పెట్టుబడి నిధి రూ. 3 వేలు రావని భయపెట్టి బస్సులు ఎక్కించి తీసుకొచ్చారని విమర్శించారు. సీఎంను ప్రశ్నించే వారు లేకుండా దౌర్జన్యంగా హౌస్ అరెస్ట్ చేయడాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఇక్కడి ప్రజల త్యాగాల ఫలితంగా శ్రీశైలం ప్రాజెక్ట్ , ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం నిర్మాణాలు జరిగాయని గుర్తు చేశారు. కృష్ణా పుష్కరాలను ముచ్చుమర్రిలో జరుగనీయకుండా అడ్డుకున్న వారికి.. ప్రాజెక్ట్‌ను ప్రారంభించే అర్హత లేదన్నారు.