క్రీమీలేయర్‌పై మంత్రివర్గ ఉపసంఘం
మంత్రి జోగు రామన్న చెప్పారు: ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య
సాక్షి, హైదరాబాద్: వెనుకబడిన తరగతులకు వర్తింపజేసే సంపన్నశ్రేణి (క్రీమీలేయర్)పై అధ్యయనానికి త్వరలోనే మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి జోగు రామన్న చెప్పారని బీసీ సంక్షేమ సంఘం నేత, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య తెలిపారు. ఈ ఉప సంఘం నివేదిక వచ్చే వరకు రాష్ర్టంలో బీసీ క్రిమిలేయర్ జీవోను పెండింగ్‌లో పెడతామని హామీనిచ్చినట్లు ఆయన చెప్పారు. ఉద్యోగ నియామకాల్లో బీసీ క్రిమిలేయర్ అమలు చేయబోమని మంత్రి గతంలో ఇచ్చిన హామీని నిలుపుకోవాలని కోరామన్నారు. దీని అమలును నిలిపివేయాలని తాను, జాజుల శ్రీనివాస్‌గౌడ్, గుజ్జ కృష్ణ, ర్యాగ రమేశ్ తదితరులతో కూడిన ఒక ప్రతినిధి బృందం శుక్రవారం సచివాలయంలో మంత్రిని కలిసి ఆయా అంశాలను వివరించినట్లు కృష్ణయ్య విలేకరులకు తెలిపారు.
బీసీలను విభజించు, పాలించు.. అనే కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. ఏ సామాజిక వర్గానికి లేని దానిని బీసీలకే ఎందుకు అమలు చేస్తున్నట్లు? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో 56 శాతం జనాభా ఉన్న బీసీలకు 26 శాతం మాత్రమే రిజర్వేషన్లు అమలవుతున్నాయన్నారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో బీసీ క్రీమీలేయర్‌ను అమలు చేయాలని ప్రయత్నించి, బీసీల నుంచి వెల్లువెత్తిన ఆగ్రహంతో ఆయా ప్రభుత్వాలు వెనక్కు తగ్గాయన్నారు.
ఆ జీవోను పెండింగ్‌లో పెట్టాలని సీఎం కేసీఆర్‌కు లేఖ
బీసీ క్రీమీలేయర్ జీవోను వెంటనే పెండింగ్‌లో పెట్టాలని, ఈ మేరకు అన్ని రిక్రూట్‌మెంట్ సంస్థలకు ఆదేశాలివ్వాలని సీఎం కేసీఆర్‌కు ఆర్.కృష్ణయ్య విజ్ఞప్తి చేశారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో మళ్లీ క్రీమీలేయర్‌ను అమలు చేయాలని జీవోను జారీ చేశారని సీఎంకు రాసిన లేఖలో ఆయన పేర్కొన్నారు. దీని ప్రకారం క్రీమీలేయర్‌ను అమలుచేస్తామని టీఎస్‌పీఎస్‌సీ, ట్రాన్స్‌కో, జెన్‌కో, పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు, ఆర్టీసీ, ఇతర రిక్రూట్‌మెంట్ సంస్థలు సన్నాహాలు చేస్తున్నాయన్నారు. గతంలో దీనిపై ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించినా, దాని నివేదిక కూడా రానందున ఈ అంశాన్ని పెండింగ్‌లో పెట్టాలని కోరారు.