BC krimileyar
-
గ్రూప్-2కు ఆధార్ లింకు
♦ మాల్‌ప్రాక్టీస్‌ను నిరోధించేందుకు టీఎస్పీఎస్సీ నిర్ణయం ♦ అభ్యర్థులంతా ఆధార్ నంబర్ ఇవ్వాల్సిందే ♦ ఓటీఆర్ వివరాల్లో సవరణలకు మార్చి 1 నుంచి 15 వరకు అవకాశం ♦ పరీక్ష రాసేవారి ఎడమచేతి వేలిముద్రల స్వీకరణ ♦ పరీక్షా కేంద్రాల్లో జామర్ల ఏర్పాటుకు యోచన ♦ కమిషన్ కార్యదర్శి పార్వతి సుబ్రమణ్యన్ వెల్లడి ♦ ఏప్రిల్ 24, 25 తేదీల్లో గ్రూప్-2 పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు సాక్షి, హైదరాబాద్: గ్రూప్-2 పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్‌ను నియంత్రించేందుకు అభ్యర్థులందరి నుంచీ ఆధార్ నంబర్‌ను తీసుకోవాలని రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ (టీఎస్పీఎస్సీ) నిర్ణయించింది. ఈ మేరకు వన్‌టైమ్ రిజిస్ట్రేషన్ (ఓటీఆర్) వివరాల్లో ఆధార్ నంబర్‌ను నమోదు చేయాలని సూచించింది. దీంతోపాటు అభ్యర్థులు ఓటీఆర్‌లోని తమ వివరాల్లో మార్పులు, చేర్పులు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. మొత్తంగా ఏప్రిల్ 24, 25 తేదీల్లో నిర్వహించే గ్రూప్-2 పరీక్షల ఏర్పాట్లపై చర్యలు వేగవంతం చేసింది. గ్రూప్-2కు దరఖాస్తు చేసుకున్న 5,64,431 మంది తమ ఆధార్ నంబర్‌ను ఇవ్వాలని పేర్కొంది. పరీక్ష కేంద్రాల్లో జామర్ల ఏర్పాటుకు కసరత్తు చేస్తోంది. మాల్ ప్రాక్టీస్‌ను నిరోధించేందుకు చేపడుతున్న చర్యల్లో భాగంగా ఆధార్ నంబర్ తీసుకుంటున్నామని టీఎస్పీఎస్సీ కార్యదర్శి పార్వతి సుబ్రహ్మణ్యన్ శుక్రవారం తెలిపారు. చాలా మంది అభ్యర్థులు దరఖాస్తుల సమయంలో తమ ఆధార్ నంబర్లను ఇచ్చారని... మిగతా వారి నుంచి కూడా స్వీకరించాలని కమిషన్ నిర్ణయించిందని చెప్పారు. వారంతా మార్చి 1 నుంచి 15లోగా ఓటీఆర్‌లో ఆధార్ నంబర్ నమోదు చేసుకోవాలన్నారు. నంబర్ లేనివారు సమీపంలోని ఆధార్ నమోదు కేంద్రంలోగానీ, uidai.gov.in/aapkaaadhar.htmlవెబ్సైట్లో గానీ నమోదు చేసుకోవాలని సూచించారు. ఎడమ చేతి వేలిముద్రల స్వీకరణ గ్రూప్-2 పరీక్షకు హాజరుకానున్న అభ్యర్థుల ఎడమ చేతి వేలిముద్రలను (బయోమెట్రిక్) తీసుకోవాలని కమిషన్ నిర్ణయించినట్లు పార్వతి సుబ్రహ్మణ్యన్ తెలిపారు. వాటిని అభ్యర్థుల ఓటీఆర్ డాటాబేస్‌తో అనుసంధానం చేస్తామని, తద్వారా అవి భవిష్యత్తులో పరిశీలనలకు ఉపయోగపడతాయని చెప్పారు. అలాగే ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాయడాన్ని దీనిద్వారా నిరోధించవచ్చని పేర్కొన్నారు. అలాగే పరీక్ష కేంద్రాల్లో జామర్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. మొబైల్ ద్వారా మాల్ ప్రాక్టీస్‌ను నిరోధించేందుకు కమిషన్ ఈ చర్యలు చేపడుతోందన్నారు. అభ్యర్థులు పరీక్ష కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లు తీసుకురావద్దని స్పష్టం చేశారు. ఓటీఆర్‌లో మార్పులకు అవకాశం గ్రూప్-2 కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులంతా వాటిల్లో మార్పులు, చేర్పులు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు పార్వతి సుబ్రమణ్యన్ వెల్లడించారు. టీఎస్పీఎస్సీ ఓటీఆర్‌లో అభ్యర్థులు తమ జెండర్, జోన్, కులం, బీసీ క్రీమీలేయర్, పుట్టినతేదీ, ఇతర వివరాల్లో మార్పులు చేసుకోవచ్చని.. కొత్తవి చేర్చవచ్చని తెలిపారు. మార్చి 15వ తే ఈ మార్పులు చేసుకోవాలని, వాటిని తుది వివరాలుగా పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. మార్చి 15 తరువాత అభ్యర్థుల ఓటీఆర్‌లో ఎలాంటి మార్పులు చేర్పులకు అవకాశం ఇవ్వబోమని స్పష్టం చేశారు. తమ దరఖాస్తులను, ఓటీఆర్ వివరాలను మరోసారి పరిశీలించుకుని ఈ అవ కాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని సూచించారు. -
క్రీమీలేయర్‌పై మంత్రివర్గ ఉపసంఘం
మంత్రి జోగు రామన్న చెప్పారు: ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య సాక్షి, హైదరాబాద్: వెనుకబడిన తరగతులకు వర్తింపజేసే సంపన్నశ్రేణి (క్రీమీలేయర్)పై అధ్యయనానికి త్వరలోనే మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి జోగు రామన్న చెప్పారని బీసీ సంక్షేమ సంఘం నేత, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య తెలిపారు. ఈ ఉప సంఘం నివేదిక వచ్చే వరకు రాష్ర్టంలో బీసీ క్రిమిలేయర్ జీవోను పెండింగ్‌లో పెడతామని హామీనిచ్చినట్లు ఆయన చెప్పారు. ఉద్యోగ నియామకాల్లో బీసీ క్రిమిలేయర్ అమలు చేయబోమని మంత్రి గతంలో ఇచ్చిన హామీని నిలుపుకోవాలని కోరామన్నారు. దీని అమలును నిలిపివేయాలని తాను, జాజుల శ్రీనివాస్‌గౌడ్, గుజ్జ కృష్ణ, ర్యాగ రమేశ్ తదితరులతో కూడిన ఒక ప్రతినిధి బృందం శుక్రవారం సచివాలయంలో మంత్రిని కలిసి ఆయా అంశాలను వివరించినట్లు కృష్ణయ్య విలేకరులకు తెలిపారు. బీసీలను విభజించు, పాలించు.. అనే కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. ఏ సామాజిక వర్గానికి లేని దానిని బీసీలకే ఎందుకు అమలు చేస్తున్నట్లు? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో 56 శాతం జనాభా ఉన్న బీసీలకు 26 శాతం మాత్రమే రిజర్వేషన్లు అమలవుతున్నాయన్నారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో బీసీ క్రీమీలేయర్‌ను అమలు చేయాలని ప్రయత్నించి, బీసీల నుంచి వెల్లువెత్తిన ఆగ్రహంతో ఆయా ప్రభుత్వాలు వెనక్కు తగ్గాయన్నారు. ఆ జీవోను పెండింగ్‌లో పెట్టాలని సీఎం కేసీఆర్‌కు లేఖ బీసీ క్రీమీలేయర్ జీవోను వెంటనే పెండింగ్‌లో పెట్టాలని, ఈ మేరకు అన్ని రిక్రూట్మెంట్ సంస్థలకు ఆదేశాలివ్వాలని సీఎం కేసీఆర్‌కు ఆర్.కృష్ణయ్య విజ్ఞప్తి చేశారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో మళ్లీ క్రీమీలేయర్‌ను అమలు చేయాలని జీవోను జారీ చేశారని సీఎంకు రాసిన లేఖలో ఆయన పేర్కొన్నారు. దీని ప్రకారం క్రీమీలేయర్‌ను అమలుచేస్తామని టీఎస్పీఎస్సీ, ట్రాన్స్‌కో, జెన్కో, పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు, ఆర్టీసీ, ఇతర రిక్రూట్మెంట్ సంస్థలు సన్నాహాలు చేస్తున్నాయన్నారు. గతంలో దీనిపై ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించినా, దాని నివేదిక కూడా రానందున ఈ అంశాన్ని పెండింగ్‌లో పెట్టాలని కోరారు. -
క్రీమీలేయర్ అమలు చేయాలా? వద్దా?
♦ ప్రభుత్వ స్పష్టత కోసం ఎదురుచూపులు ♦ డైలమాలో నియామక సంస్థలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉద్యోగ నియామకాల్లో బీసీ క్రీమీలేయర్ (సంపన్నవర్గాలు)ను అమలు చేయాలా? వద్దా? అన్న స్పష్టత లేకుండాపోయింది. బీసీ క్రీమీలేయర్ అమలును నిలిపివేస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న గతంలోనే ప్రకటించారు. అయితే ఇంతవరకు ఉత్తర్వులు మాత్రం జారీ కాలేదు. ఈక్రమంలో టీఎస్పీఎస్సీ ఏఈ, ఏఈఈ వంటి పోస్టుల భర్తీకి ఉద్యోగ పరీక్షలను నిర్వహించింది. అలాగే విద్యుత్ శాఖ కూడా పలు ఇంజనీర్ పోస్టులకు రాత పరీక్షలను నిర్వహించింది. కానీ ఫలితాలు ఇవ్వలేదు. ఈ పరిస్థితుల్లో అటు విద్యుత్ శాఖ, ఇటు టీఎస్పీఎస్సీ ఇంటర్వ్యూలు నిర్వహించడానికి ముందే క్రీమీలేయర్‌పై స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు నోటిఫికేషన్లో మాత్రం అభ్యర్థులు క్రీమీలేయర్ సర్టిఫికెట్లు తెచ్చుకోవాలని ప్రకటించించింది. ఇంటర్వ్యూల నిర్వహణ కంటే ముందే అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ సమయంలో క్రీమీలేయరా, నాన్ క్రీమీలేయరా అన్న సర్టిఫికెట్‌ను అందజేయాల్సి ఉంటుంది. వాటి ఆధారంగానే బీసీ రిజర్వేషన్ కోటాలో తీసుకురావాలా? ఓపెన్ కోటాలో పరిగణనలోకి తీసుకోవాలా? అన్న నిర్ణయం తీసుకుంటాయి. అభ్యర్థుల తల్లిదండ్రుల వార్షికాదాయం రూ. 6 లక్షల లోపు ఉంటే వారిని నాన్ క్రీమీలేయర్ అభ్యర్థులుగా రిజర్వేషన్ కోటా లో, అదే రూ. 6 లక్షలకు పైగా ఉన్న వారిని వెనుకబడిన వర్గాల్లో సంపన్న శ్రేణులుగా గుర్తించి, ఓపెన్ కేటగిరీలోనే పరిగణనలోకి తీసుకుంటాయి. ప్రభుత్వం క్రీమీలేయర్ అమలును నిలిపివే స్తామని మౌఖి కంగా పలుమార్లు పేర్కొన్న నేపథ్యంలో నియామక సంస్థలు ఆలోచనలో పడ్డాయి. సర్కారు నుంచి దీనిపై స్పష్టత కోసం ఎదురుచూస్తున్నాయి.