క్రేజ్ కల్చర్
ఈసారి ఏడు చెరువుల్లో నూతన విధానంలో చేపల పెంపకం
► ‘అలీసాగర్’ సత్ఫలితాలివ్వడంతో జిల్లాలో పెరిగిన యూనిట్లు
► ఇతర జిల్లాల నుంచి నిధుల మళ్లింపు
సాక్షి, నిజామాబాద్: కేజ్‌కల్చర్.. అధునాతన పద్ధతుల్లో చేపల పెంపకం చేపట్టడం. జిల్లాలో ప్రయోగాత్మకంగా చేపట్టిన ‘కేజ్‌కల్చర్’ సత్ఫలితాలు ఇవ్వడంతో.. ఈ విధానాన్ని మరిన్ని చెరువులకు విస్తరించా లని అధికారులు నిర్ణయించారు. ఇతర జిల్లాలకు కేటాయించిన నిధులను కూడా నిజామాబాద్ జిల్లాకు మళ్లించేందుకు సర్కారు అంగీకరించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. మత్స్య పరిశ్రమ అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం కేజ్ కల్చర్ విధానాన్ని ప్రోత్సహిస్తోం ది.
ఇందులో భాగంగా గతేడాది అలీ సాగర్‌లో కేజ్‌కల్చర్ విధానాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. ఇది సత్ఫలితాలు ఇవ్వడంతో ఈ విధానాన్ని జిల్లాలోని మరిన్ని చెరువులకు విస్తరించాలని అధికారులు నిర్ణయించారు. కేజ్ కల్చర్ యూనిట్ల కోసం వివిధ జిల్లాలకు కేటాయించిన నిధులు సకాలంలో వినియోగం కాకపోవడం, నిజామాబాద్ జిల్లాలో ప్రయోగాత్మకంగా చేపట్టిన కేజ్‌కల్చర్ విధానంలో చేపల పెంపకం సత్ఫలితాలు ఇవ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఖమ్మం, కరీంనగర్, రంగారెడ్డి జిల్లాలకు కేటాయించిన నిధులను మన జిల్లాకు మళ్లిస్తున్నారు. దీంతో గతేడాది ఒక్క అశోక్‌సాగర్‌కే పరిమితమైన కేజ్‌కల్చర్ యూనిట్‌ను ఈసారి మరిన్ని చోట్ల ఏర్పాటు చేయనున్నారు.
యూనిట్ల విస్తరణ..
నీలి విప్లవం పథకంలో భాగంగాప్రభుత్వం కేజ్‌కల్చర్‌ను సాగు చేసే మత్స్యకారులకు పెద్ద మొత్తంలో సబ్సిడీలు ఇచ్చి ప్రోత్సహిస్తోంది. యూనిట్ వ్యయంలో 80 శాతం సబ్సిడీ ఇస్తోంది. మిగిలిన 20 శాతం లబ్ధిదారులు చెల్లించాలి. ఆయా మత్స్య సహకార సంఘాలు ఈ 20 శాతం వాటాను చెల్లించాల్సి ఉంటుంది.
జాతీయ సహకార అభివృద్ధి సంస్థ (ఎసీడీసీ) కింద ఈ నిధులు మంజూరవుతున్నాయి. వంద ఎకరాల కంటే ఎక్కువ ఆయకట్టు ఉన్న పెద్ద చెరువుల్లో ఈ యూనిట్లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. గతేడాది ఒక్క అలీసాగర్‌లో మాత్రమే ఈ విధానంలో చేపల పెంపకం చేపట్టారు. ఈసారి అలీసాగర్‌తో పాటు గుత్ప, వెల్మల్, కుద్వాన్‌పూర్, రెంజల్, మెండోరా, రెంజర్ల చెరువుల్లో కేజ్ కల్చర్ యూనిట్లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.
అలీసాగర్‌లో సత్ఫలితాలు..
అలీసాగర్‌లో చెరువులో చేపట్టిన కేజ్ కల్చర్ చేపల పెంపకం విధానం మంచి ఫలితాలనిచ్చింది. పంగాసిస్, తిలాపియా అనే రెండు రకాల చేపలను పెంచారు. ఒక్కో కేజ్ (పంజరం) 96 క్యూబిక్ మీటర్ల సామర్థ్యంతో ఉన్నాయి. ఇలా మొత్తం పది కేజ్‌లలో చేపల పెంపకం చేపట్టారు. సుమారు 11 టన్నుల చేపల ఉత్పత్తి జరిగినట్లు మత్స్యశాఖ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. వీటిని కిలోకు రూ.వంద చొప్పున విక్రయించారు. అది కూడా ఎలాంటి రవాణా, ఇతర ఖర్చు లేకుండా చెరువు గట్టుపైనే విక్రయించడంతో 11 టన్నులకు సుమారు రూ.11 లక్షల వరకు ఆదాయం వచ్చిందని అంచనా వేశారు. మొత్తంగా కేజ్ కల్చర్ ప్రయోగం సత్ఫలితాలనివ్వడంతో మరో ఏడు చెరువులకు విస్తరించాలని నిర్ణయించారు.
ఈ నెలలో యూనిట్ల ఏర్పాటు
ఈ నెలలోనే కేజ్ కల్చర్‌కు సంబంధించిన యూనిట్లను ఏర్పాటు చేయనున్నాం. ఇందుకోసం రాష్ట్ర స్థాయిలో టెండర్లు పిలిచారు. ఈ పనులు దక్కిం చుకున్న సంస్థలే యూనిట్లను ఏర్పాటు చేసి, ఆయా మత్స్య సహకార సంఘాలకు అప్పగిస్తాయి. చేప పిల్లలను కూడా ఉచితంగా సరఫరా చేస్తాం. – మహిపాల్, అసిస్టెంట్ డైరెక్టర్, ఫిషరీస్