123 జీవో కొట్టివేతపై సంబరాలు | cancellation of GO.123.. cong celebrations | Sakshi
Sakshi News home page

123 జీవో కొట్టివేతపై సంబరాలు

Published Wed, Aug 3 2016 11:07 PM | Last Updated on Tue, Mar 19 2019 5:47 PM

స్వీట్లు పంచుకుంటున్న కాంగ్రెస్‌ నేతలు - Sakshi

స్వీట్లు పంచుకుంటున్న కాంగ్రెస్‌ నేతలు

  • మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు ముంపు గ్రామాల్లో విజయోత్సవ ర్యాలీలు
  • ‘నిమ్జ్‌’ భూ బాధితుల విజయోత్సాహం
  • తొగుట/కొండపాక/న్యాల్‌కల్‌: రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం 123 జీఓను కొట్టివేయడంపై అటు మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు ముంపు గ్రామాల్లో ఇటు జాతీయ ఉత్పాదక మండలి (నిమ్జ్‌) నిర్మించతలపెట్టిన జహీరాబాద్‌ ప్రాంతంలో బుధవారం సంబరాలు మిన్నంటాయి. కోర్టు తీర్పు వెలువడగానే ఆయా ప్రాంతాల్లోని ముంపు బాధితులు, భూనిర్వాసితులు వీధుల్లోకి వచ్చి మిఠాయిలు పంచుకున్నారు.

    బాణసంచా కాల్చి ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు. ముంపు గ్రామాలైన తొగుట మండలంలోని వేములఘాట్‌, పల్లెపహాడ్‌, ఏటిగడ్డ కిష్టాపూర్‌, లక్ష్మాపూర్‌, తుక్కాపూర్‌, బి.బంజేరుపల్లి, వడ్డెర కాలనీలలో, కొండపాక​మండలం ఎర్రవల్లి, సింగారం గ్రామాల్లో పండగ వాతవరణం నెలకొంది.

    గ్రామాల్లోని ప్రజలు, యువకులు, రైతులు విజయోత్సవ ర్యాలీలు నిర్వహించారు. కాగా, మల్లన్నసాగర్‌ను వ్యతిరేకిస్తూ వేములఘాట్‌ భూనిర్వాసితులు చేస్తున్న దీక్షలు బుధవారంతో 60వ రోజుకు చేరుకున్నాయి. రిజర్వాయర్‌ సామర్థ్యాన్ని తగ్గించే వరకు తమ దీక్షలు కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు.

    అటు.. ఇటు..
    ఒకపక్క మల్లన్నసాగర్‌ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఉవ్వెత్తున నిరసన వ్యక్తం కావడం.. ఇదే క్రమంలో కొద్ది రోజుల క్రితం ముంపు బాధితులపై పోలీసులు విరుచుకుపడటం.. నేతల పరామర్శలు.. అంతలోనే మరోపక్క ఉన్నట్టుండి ఒక్కో ముంపు గ్రామం భూసేకరణకు ముందుకు రావడం.. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగడం.. ఈ పరిణామాలు కొనసాగుతున్న తరుణంలోనే జీవోకు వ్యతిరేకంగా కోర్టు తీర్పు వెలువడటం విశేషం.

    2013 భూసేకరణ చట్టంతో రైతులకు నష్టం జరుగుతుందంటూ మంత్రి హరీశ్‌రావు తప్పుడు ప్రచారం చేశారని, నేడది కోర్టు తీర్పుతో పటాపంచలైందని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు గోపాలస్వామి అన్నారు. 123 జీవోతో మెరుగైన పరిహారం అందదనే విషయం కోర్టు తీర్పుతో వెల్లడైందన్నారు. కోర్టు తీర్పు దరిమిలా.. రైతుల నుంచి రిజిస్ట్రేషన్‌ చేసుకున్న భూముల్ని తిరిగి ఇచ్చివేయాలని జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సునీతాలక్ష్మారెడ్డి నర్సాపూర్‌లో విలేకరులతో మాట్లాడుతూ డిమాండ్‌ చేశారు.

    123 జీఓ కొట్టివేత రైతుల విజయంగా ఆయా ప్రజా సంఘాలు అభివర్ణించాయి. మరోపక్క ఎర్రవల్లిలో బుధవారం కూడా రైతుల నుంచి భూసేకరణకు అంగీకారంగా సమ్మతి పత్రాలపై సంతకాల సేకరణ జరిగింది. 3 గంటల్లోనే 30 మంది రైతులు 86 ఎకరాలను ఇచ్చేందుకు అంగీకరిస్తూ సంతకాలు చేశారని అధికారులు ప్రకటించారు.

    రైతు కూలీల విజయం
    ఇక, కోర్టు తీర్పు జహీరాబాద్‌ నియోజకవర్గంలోని న్యాల్‌కల్‌లో భూ బాధితులు, కూలీల్లో మరింత ఆనందాన్ని నింపింది. ఇక్కడ ఏర్పాటు చేయనున్న నిమ్జ్‌కు పెద్ద ఎత్తున భూమిని సేకరించాల్సి ఉంది. ప్రభుత్వం ఇక్కడ కూడా 123 జీవో ప్రకారం భూసేకరణకు దిగగా, రైతు కూలీ సంఘం నాయకులు మోహన్‌, రాజు, తుక్కమ్మ తదితరులు గత జూన్‌లో హైకోర్టును ఆశ్రయించారు.

    నిమ్జ్‌ భూ బాధితులకు 2013 చట్టం ప్రకారం పరిహారం అందించాలని తీర్పు వెలువరించడంతో రైతులు, కూలీలతోపాటు అఖిల పక్షం నాయకులు సంబరాలు జరుపుకున్నారు. న్యాల్‌కల్‌ మండలంలోని 14 గ్రామాలతోపాటు ఝరాసంగం మండలంలోని మూడు గ్రామాల పరిధిలో 12,635 ఎకరాలు నిమ్జ్‌ పేరుతో భూములను సేకరించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి.

    మొదటి విడతగా ఝరాసంగం మండలం బర్దీపూర్‌, ఎల్గోయి, చీలపల్లి, చీలపల్లి తండాతో పాటు న్యాల్‌కల్‌ మండలం ముంగి, ముంగి తండా, రుక్మాపూర్‌, రుక్మాపూర్ తండాలను ఎంపిక చేశారు. అధికారులు ఆయా గ్రామాల పరిధిలోని పట్టా, అసైన్డ్‌ భూముల వివరాలను సేకరించారు. పట్టా భూములకు ఎకరానికి రూ:5.80 లక్షలు, అసైన్డ్‌ భూమికి ఎకరాకు రూ.3 లక్షల పైచిలుకు చెల్లించారు.

    అయితే ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా భూములు సేకరిస్తుందని నిమ్జ్‌ భూపోరాట కమిటీ ఆధ్వర్యంలో బాధిత రైతులు ఆందోళనకు దిగారు. 123 జీఓను రద్దు చేసి 2013 చట్టాన్ని అమలు చేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన కోర్టు బుధవారం తీర్పును వెలువరించింది. తీర్పు రైతులకు, కూలీలకు అనుకూలంగా రావడంతో బాధిత రైతులు, కూలీలో సంతోషం వ్యక్తమైంది.కోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంప పెట్టులాంటిదని సీపీఎం నాయకులు సాయిలు, రాంచెందర్, కాంగ్రెస్ నాయకులు, రైతులు అన్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement