చండ్ర పుల్లారెడ్డికి నివాళులర్పిస్తున్న నాయకులు
సుందరయ్య విజ్ఞానకేంద్రం: భారత విప్లవోద్యమ నిర్మాత చంద్ర పుల్లారెడ్డి జీవితం అందరికీ ఆదర్శమని పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ లక్ష్మణ్ అన్నారు. సీపీఐ(ఎంఎల్) తెలంగాణ, ఆంధ్ర రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో సోమవారం సుందరయ్య విజ్ఞానకేంద్రంలో చండ్ర పుల్లారెడ్డి 32వ వర్ధంతి సభ నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ లక్ష్మణ్ మాట్లాడుతూ భారతదేశ చరిత్రలో పుల్లారెడ్డి ఒక చుక్కానికిగా నిలిచారని కొనియాడారు.
ప్రజల సమస్యలను అధ్యయనం చేసి పరిష్కారానికి రాజీలేని పోరాటం చేశారన్నారు. తాను నమ్మిన సిద్ధాంతాల కోసం అలుపెరగని పోరాటం చేశారన్నారు. సభకు అధ్యక్షత వహించిన సీపీఐ(ఎంఎల్) రాష్ట్ర నాయకులు ఎన్.వెంకటేష్ మాట్లాడుతూ భూమి, భుక్తి, పీడిత ప్రజల విముక్తి లక్ష్యంగా సాగిన మహత్తర తెలంగాణ సాయుధ పోరాటానికి ద్రోహం తలపెట్టిన రివిజనిజం నాయకత్వాన్ని కూకటివేళ్లతో పెకిలించిన గొప్ప పోరాట యోధుడు పుల్లారెడ్డి అని కొనియాడారు.
ఆయన ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎంఎల్) అధికార ప్రతినిధి సత్యనారాయణ, మానవ హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు జీవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.