శిక్షణపై పట్టింపేదీ..?
ఆదిలాబాద్ టౌన్ : చిన్నారులు, విద్యార్థులకు నూలిపురుగుల నివారణ కోసం ఈనెల 10న పాఠశాలల్లో, అంగన్‌వాడీ కేంద్రాల్లో మాత్రలు వేయనున్నారు. దీనిపై వైద్యాధికారులకు, మండల విద్యాధికారులకు, ఐసీడీఎస్ సిబ్బందికి, వైద్య సిబ్బందికి జిల్లా కేంద్రంలోని డీఎంహెచ్‌వో సమావేశ మందిరంలో శిక్షణను శనివారం ఏర్పాటు చేయగా ఎవరూ అసక్తి కనబర్చనట్లు కనిపించింది. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఉదయం 10 గంటలకు శిక్షణ కార్యక్రమం ప్రారంభం కావాల్సి ఉండగా.. కేవలం ఆరుగురు మాత్రమే శిక్షణకు హాజరయ్యారు. మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా సమావేశం ప్రారంభం కాలేదు. ఉదయమే వచ్చిన వారు మిగితవారి కోసం వేచి చూడాల్సిన పరిస్థితి ఎదురైంది. మధ్యాహ్నం ప్రారంభమైనప్పటికి పూర్తి స్థాయిలో అధికారులు, సిబ్బంది హాజరు కాలేదు. శిక్షణ నామమాత్రమైంది. ఇంకా నూలిపురుగుల కార్యక్రమం ఏలా సాగుతుందో వేచి చూడల్సిందే!