‘ప్రసవ’ వేదన | carts scare in metarnity ward | Sakshi
Sakshi News home page

‘ప్రసవ’ వేదన

Published Wed, Jul 19 2017 10:48 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

‘ప్రసవ’ వేదన - Sakshi

‘ప్రసవ’ వేదన

ఆంటినేటల్‌ వార్డులో పడకల కొరత
- ఒకే మంచంపై ఇద్దరికి చికిత్స
- రాత్రిళ్లు గర్భిణిల అవస్థలు వర్ణనాతీతం
- చెట్ల కింద రోజుల తరబడి నిరీక్షణ
- కటిక నేలపైనే నిరీక్షణ


- ముదిగుబ్బ మండలం నడిచెర్లపల్లికి చెందిన చంద్రకళ రెండో కాన్పు కోసం సర్వజనాస్పత్రిని ఆశ్రయించింది. ఆంటినేటల్‌ వార్డులో పడకలు లేకపోవడంతో ఆరుబయట చెట్ల కింద నిరీక్షిస్తోంది.
- ఆత్మకూరు మండలం బి.యాలేరుకు చెందిన శివమ్మ ప్రసవం కోసం సర్వజనాస్పత్రికి వచ్చి ఐదు రోజులవుతోంది. పగలూ, రాత్రీ తేడా లేదు. చెట్ల కింద బిక్కుబిక్కుమంటూ గడుపుతోంది.
- వీరిద్దరే కాదు.. సర్వజనాసుపత్రికి ప్రసవం కోసం వచ్చే గర్భిణీలందరి పరిస్థితి ఇదే.

అనంతపురం మెడికల్‌: ప్రయివేట్‌ ఆసుపత్రుల మెట్లెక్కే స్థోమత లేక పెద్దాసుపత్రిని ఆశ్రయించే నిరుపేదలను అసౌకర్యాలు వెక్కిరిస్తున్నాయి. ఇక్కడ నిత్యం 30 నుంచి 40 ప్రసవాలు నిర్వహిస్తుండగా.. 10 నుంచి 15 సిజేరియన్లు ఉంటున్నాయి. ప్రసవ సమయం సమీపించగానే ఆసుపత్రి వచ్చే గర్భిణిలను ఆంటినేటల్‌ వార్డులో ఉంచుతారు. అయితే ఈ వార్డులో సరిపడా పడకలు లేకపోవడం ‘ప్రసవ వేదన’కు కారణమవుతోంది. మొత్తం 30 పడకలు ఉండగా.. నిత్యం 45 మంది వరకు అడ్మిషన్‌లో ఉంటున్నారు. ఈ కారణంగా ఒక్కో పడకపై ఇద్దరు గర్భిణిలకు చోటు కల్పిస్తున్నారు.

కనీసం కదిలేందుకు కూడా వీలులేని స్థితిలో వీరు చుక్కలు చూస్తున్నారు. ఉదయం పూట సర్దుకుంటున్నా.. రాత్రిళ్లు పరిస్థితి మరీ దారుణంగా ఉంటోంది. వార్డు బయట ఉన్న ఆవరణలోనే చాలా మంది గర్భిణిలు సేదతీరుతుండటం ఇక్కడి దయనీయ పరిస్థితికి అద్దం పడుతోంది. వార్డు లోపల పెచ్చులూడుతున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. వైద్య సిబ్బంది సేవలు కూడా అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. వార్డులో అడ్మిషన్‌కు రాగానే ‘డెలివరీకి టైం ఉంది కదా.. మళ్లీ రండి. ఇక్కడెక్కడుంటారు’ అంటూ ఉచిత సలహాలిస్తున్నారు. కొందరు ఇంటికి వెళ్లిపోతుంటే.. మరికొందరు ఎప్పుడు నొప్పులు వస్తాయోననే భయంతో ఆసుపత్రి ఆవరణలోనే నిరీక్షిస్తున్నారు.

ఏదయినా జరిగితే..
ఆసుపత్రిలో విష పురుగుల బెడద కూడా ఉంది. ఇటీవల ఏకంగా మెయిన్‌ ఆపరేషన్‌ థియేటర్‌ వద్ద ఓ పామును చంపడం ఇక్కడి పరిస్థితికి అద్దం పడుతోంది. పైగా ఆంటినేటల్‌ వార్డు సమీపంలోనే బయోమెడికల్‌ వేస్ట్‌ వేస్తుంటారు. పరిసరాలు కూడా అధ్వానంగా ఉంటాయి. దీంతో పాములు, తేళ్లు ఇతర కీటకాలు వచ్చే అవకాశం లేకపోలేదు. పైగా కొన్ని రోజుల క్రితం ఆంటినేటల్‌ వార్డు ఆవరణలోనే ఓ చెట్టు కొమ్మ విరిగిపడింది. అదృష్టవశాత్తూ అప్పట్లో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. గర్భిణిలు రాత్రి వేళ చెట్ల కింద నిద్రిస్తున్న సమయంలో కొమ్మలు విరిగిపడితే పరిస్థితి ఏమిటన్నది అధికారులకే తెలియాలి. వార్డులో దోమలు సైతం అధికమే. కనీసం కిటికీలకు మెష్‌లు సైతం ఏర్పాటు చేయని దౌర్భాగ్యం ఇక్కడుంది. ఇక ప్రవసం చేసే గదిలోనూ సమస్యలు రాజ్యమేలుతున్నాయి. గర్భిణికి ప్రసవం చేయడంలో మెటర్నిటీ అసిస్టెంట్ల పాత్ర కీలకం. ఇక్కడ పది మంది ఉండాల్సి ఉండగా.. కేవలం ముగ్గురితోనే నెట్టుకొస్తున్నారు.

మంత్రులకు పట్టని ‘పెద్దాస్పత్రి’
ప్రభుత్వాస్పత్రుల్లో కార్పొరేట్‌ వైద్యం అందిస్తామని గొప్పలు చెబుతున్న పాలకులకు ఇక్కడి సమస్యలు పట్టడం లేదు. కొన్నాళ్ల క్రితం వరకు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ కామినేని శ్రీనివాస్‌ జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా కూడా ఉన్నారు. పల్లె రఘునాథరెడ్డి మంత్రిగా కొనసాగారు. ఇప్పుడు పరిటాల సునీత, కాలవ శ్రీనివాసులు మంత్రులుగా కొనగుతున్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న సునీత కూడా పెద్దాస్పత్రిపై దృష్టి సారించకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఆస్పత్రి యాజమాన్యం కూడా సమస్యను ఉన్నతాధికారులకు నివేదించడం మినహా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండటం గమనార్హం.

డీఎంఈ దృష్టికి తీసుకెళ్లాం
గర్భిణిల అవస్థలను డీఎంఈ సుబ్బారావు దృష్టికి తీసుకెళ్లాం. జీఓ 124 ప్రకారం పోస్టులు భర్తీ చేస్తే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. కాట్స్, బెడ్స్‌ను ఏపీఎంఎస్‌ఐడీసీ ద్వారా కొనుగోలు చేయాలని నిర్ణయించాం. పీడియాట్రిక్‌ వార్డును పైఅంతస్తుకు మార్చి ఆ వార్డును గర్భిణిల కోసం వాడుతాం. మెటర్నిటీ అసిస్టెంట్ల విషయాన్ని డీఎంహెచ్‌తో మాట్లాడాను. పీహెచ్‌సీల్లో ఉన్న రెండో ఏఎన్‌ఎంలను ఇక్కడికి పంపాలని కోరాం. త్వరలోనే సమస్యలు పరిష్కరిస్తాం.
– డాక్టర్‌ జగన్నాథ్, సర్వజనాస్పత్రి సూపరింటెండెంట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement