వెంకన్న హుండీకి నోట్ల వెల్లువ
తిరుపతి: పెద్ద నోట్ల రద్దు వల్ల తోపుడు బండ్లు, చిల్లర దుకాణాలు మొదలు మాల్స్ వరకు వ్యాపారాలు పడిపోయాయి. థియేటర్లు మూతపడ్డాయి. బంగారం షాపులు కస్టమర్లు లేక వెలవెలబోతున్నాయి. అయితే పెద్ద నోట్ల రద్దు వల్ల ప్రజలు కరెన్సీ కష్టాలు పడుతున్నా.. వడ్డికాసులవాడు తిరుమల వేంకటేశ్వర స్వామి ఆలయంలోని హుండీపై ఏమాత్రం ప్రభావం పడలేదు. మునిపటి కంటే ఎక్కువగా శ్రీవారికి కానుకలు పోటెత్తుతున్నాయి.
'ఏడాదికి హుండీ ద్వారా మాత్రమే దాదాపు వెయ్యి కోట్ల నగదు వస్తుంది. పెద్ద నోట్లను రద్దు చేసినా ఏమాత్రం ప్రభావం పడలేదు. దేశవ్యాప్తంగా వస్తున్న భక్తులు శ్రీవారికి కానుకలు సమర్పిస్తున్నారు. బంగారు, వెండి కానుకలు గాక హుండీ ద్వారా రోజుకు సరాసరిన మూడు కోట్ల రూపాయల డబ్బు వస్తోంది. నవంబర్ 9 నుంచి పది రోజుల్లో హుండీ ద్వారా 30.36 కోట్ల రూపాయల నగదు కానుకగా వచ్చింది. గతేడాది ఇదే సమయంలో వచ్చిన డబ్బుతో పోలిస్తే ఈ మొత్తం 8 కోట్ల రూపాయలు ఎక్కువ' అని టీటీడీ అధికారులు చెప్పారు.