హైటెక్కే ముద్దు...ఎన్నాళ్లీ హద్దు | cashless rally stopped by people | Sakshi
Sakshi News home page

హైటెక్కే ముద్దు...ఎన్నాళ్లీ హద్దు

Published Thu, Dec 1 2016 12:31 AM | Last Updated on Tue, Aug 14 2018 2:50 PM

హైటెక్కే ముద్దు...ఎన్నాళ్లీ హద్దు - Sakshi

హైటెక్కే ముద్దు...ఎన్నాళ్లీ హద్దు

నగదు రహితమే ముద్దంటూ అవగాహన ర్యాలీలు ఓ వైపు జిల్లాలో జరుగుతుంటే ఇంకో వైపు బ్యాంకులు, ఏటీఎంల వద్ద బారులుదీరిన జనం మాత్రం ఎన్నాళ్లీ హద్దులు..కష్ట, నష్టాలంటూ పెదవి విరుస్తున్నారు. కనీస ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా సామాన్య, మధ్య తరగతి ప్రజలను రోడ్డెక్కించారని వాపోయారు. ఈ క్యూలు పక్క నుంచే పోలీసుల రక్షణతో అవగాహన ర్యాలీలు జరుగుతుండడంతో అక్కడక్కడా జనం నిలదీసిన ఘటనలు చోటుచేసుకున్నాయి. రాజమహేంద్రవరంలోని దేవీచౌక్‌ వద్ద విద్యార్థులు, ఇతరులు మానవహారం చేసి అవసరాల కోసం హైటెక్‌ టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని పిలుపునివ్వగా బ్యాంకుల్లో నగదు పెట్టకుండా ఏమీటీ ప్రవచనాలంటూ బాధితులు విమర్శించారు. రాజానగరంలో కూడా ర్యాలీని నగదు బాధితులు అడ్డుకున్నారు. 20 రోజులుగా అన్ని పనులు
ఆగిపోయాయని రైతులు, వ్యాపారులు, గృహిణులు ధ్వజమెత్తారు. 
రాజానగరం : నగదు రహిత లావాదేవీలపై ప్రజలను చైతన్యపరుస్తూ రాజానగరంలో పోలీసులు, బ్యాంకు అధికారులు కలిసి ఇంజినీరింగ్‌ విద్యార్థినుల సాయంతో బుధవారం రాజానగరంలో నిర్వహించిన అవగాహన ర్యాలీలో జనం తిరగబడ్డారు. తూర్పు మండల డీఎస్పీ రమేష్‌బాబు, సీఐ శంకర్‌నాయక్‌ల ఆధ్వర్యంలో గ్రామంలోని షిరిడీ సాయిబాబా సెంటర్‌ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ గాంధీ బొమ్మ సెంటర్‌కు చేరుకున్న సమయంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. రైతులు, వ్యాపారులు అక్కడకు చేరుకుని ర్యాలీలో ఉన్న బ్యాంకు అధికారులు తమకు సమాధానం చెప్పాలంటూ పట్టుపట్టారు. ప్రస్తుతం ఖరీఫ్‌ వరి కోతలు ఒకవైపు, రబీ సాగు మరోవైపు జరుగుతున్న నేప«థ్యంలో పొలాల్లో పనులు చేస్తున్న కూలీలకు సొమ్ములు ఇవ్వలేకపోతున్నామని వైఎస్సార్‌సీపీకి చెందిన దూలం పెద్ద, ప్రగడ చక్రితోపాటు మరికొందరు రైతులు తమ ఆవేదనను తెలిపారు. తమ ఖాతాలో ఉన్న సొమ్ములు ఇమ్మంటే రూ.రెండు వేలు ఇస్తున్నారు, ఆ డబ్బులు తీసుకువెళ్లి ఎంతమందికి కూలీ ఇవ్వాలన్నారు. ఇలాగైతే ఎలా వ్యవసాయం చేసేందంటూ నిలదీశారు. వ్యాపారులు కూడా చిల్లర సమస్యతో సతమతమవుతున్నామని, బ్యాంకులో రూ.రెండు వేల నోట్లు తప్ప చిల్లర నోట్లు ఇవ్వడం లేదన్నారు. మా ఖాతాలో ఉన్న కరెన్సీనుంచి మేము అడిగినంత ఇవ్వాలని, మేనేజర్‌ సమాధానం చెప్పాలని పట్టుపడ్డారు. ఈ సమయంలో డీఎస్పీ, సీఐలు అడ్డుకుంటూ బ్యాంకుకు వెళ్లి మాట్లాడండి.. ఇక్కడ కాదు అని సర్థిచెప్పేందుకు ప్రయత్నించినా వారు వినలేదు. బ్యాంకుకు వెళ్తుంటే తమను పురుగుల్లా చూస్తున్నారని, ఇక్కడే సమాధానం చెప్పాలన్నారు. దీంతో అక్కడే ఉన్న ఎస్‌బీఐ బ్రాంచ్‌ మేనేజర్‌ మాధవ కలుగజేసుకుని తాము పై అధికారులు చెప్పిన విధంగా చేస్తున్నామని, మీ ఇబ్బందులను వారి దృష్టిలో పెట్టి, సమస్య పరిష్కారానికి కృషి చేస్తాననడంతో వివాదం సద్దుమణిగి, ర్యాలీ ముందుకు సాగింది.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement