
హైస్కూల్ బాత్‌రూమ్ వద్ద సీసీ కెమెరా!
విశాఖపట్నం జిల్లా గొలుగొండ మండలం చోద్యం జిల్లా పరిషత్ హైస్కూల్లో బాత్‌రూమ్‌ల వద్ద కొంత మంది ఆకతాయిలు సీసీ కెమెరా ఏర్పాటు చేయడం కలకలంరేపింది.
గొలుగొండ (నర్సీపట్నం): విశాఖపట్నం జిల్లా గొలుగొండ మండలం చోద్యం జిల్లా పరిషత్ హైస్కూల్లో బాత్‌రూమ్‌ల వద్ద కొంత మంది ఆకతాయిలు సీసీ కెమెరా ఏర్పాటు చేయడం కలకలంరేపింది. దీనిపై విద్యార్థినులు ఆందోళన వ్యక్తం చేశారు. బాత్‌రూమ్‌లకు పైకప్పు లేకపోవడంతో పైన ఉన్న చెట్టు కొమ్మకు ఆకతాయిలు సీసీ కెమెరాను అమర్చారు. చిన్న కర్ర సాయంతో సీసీ కెమెరా కనిపించకుండా చెట్టు కొమ్మలో ఆకులు చుట్టి బాత్‌రూమ్‌లపై దీన్ని ఏర్పాటు చేశారు.
ఆకుల చాటు నుంచి రెడ్‌సిగ్నల్ రావడాన్ని గురువారం ఉదయం కొందరు విద్యార్థులు గమనించి మొదట బాంబు అని కేకలు వేశారు. ఉపాధ్యాయులు ఆ చెట్టు కొమ్మను పరిశీలించి సీసీ కెమెరాగా గుర్తించారు. అనంతరం దీనిపై కేడీపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ హరికృష్ట ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించి అందులో మెమొరీ కార్డు లేదని, ఎలాంటి దృశ్యాలు నమోదు కాలేదని నిర్ధారించారు. కొయ్యూరు సీఐ ఉదయ్‌కుమార్ కూడా గురువారం రాత్రి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. దీనిపై దర్యాప్తు చేసి బాధ్యులను శిక్షిస్తామని, విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆందోళన చెందనక్కర్లేదని పేర్కొన్నారు.