
చలో గజ్వేల్ భగ్నం
- ఎక్కడికక్కడా కాంగ్రెస్ నేతల అరెస్టు
- పోలీసుల అదుపులో సునీతారెడ్డి, షెట్కార్, శశిధర్, జగ్గారెడ్డి
- జిల్లా వ్యాప్తంగా అప్రమత్తమైన పోలీసులు
సాక్షి, సంగారెడ్డి: ప్రధాని నరేంద్ర మోదీ జిల్లా పర్యటన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ‘చలో గజ్వేల్’ భగ్నమైంది. కోమటిబండలో ఆదివారంప్రధానిని కలిసి నిరసన తెలిపేందుకు కాంగ్రెస్ నాయకులు ఛలో గజ్వేల్‌కు పిలుపునిచ్చారు. అయితే జిల్లా వ్యాప్తంగా పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించారు. పర్యటనకు ఆటంకం కలగకుండా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను ఎక్కడికక్కడా అడ్డుకుని అరెస్టులు చేశారు.
అరెస్టు అయిన కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వ చర్యలను తీవ్రంగా ఖండించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారెడ్డిని పోలీసులు నర్సాపూర్‌లో అరెస్టు చేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి గజ్వేల్‌కు ర్యాలీగా బయలుదేరిన సునీతారెడ్డి, పార్టీ నాయకులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. ఇదిలాఉండగా కొల్చారం మండలానికి చెందిన రాష్ట్ర టెప్కో డైరెక్టర్ రమేష్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్‌రెడ్డిని సంగారెడ్డి పోలీసులు పటాన్‌చెరులో ముందస్తుగా అరెస్టు చేశారు. పటాన్‌చెరు నుంచి సంగారెడ్డి మండలంలోని ఇంద్రకరణ్ పోలీస్టేషన్‌కు జయప్రకాశ్‌రెడ్డిని తీసుకువచ్చారు. సంగారెడ్డి నుంచి గజ్వేల్‌లకు బయలుదేరిన గ్రంథాలయ సంస్థ చైర్మన్ తోపాజీ అనంతకిషన్, సదాశివపేట మాజీ మున్సిపల్ చైర్మన్ సత్యనారాయణ మరో 50 మంది పార్టీ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు.
సిద్దిపేట, రాజగోపాల్‌పేట పోలీసులు పలువురిని ముందస్తూగా అదుపులోకి తీసుకున్నారు. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ప్రభాకర్‌వర్మ, నాయకులు బోమ్మల యాదగిరి, దరిపల్లి చంద్రం, రేవంత్‌కుమార్‌లను అదుపులోకి తీసుకోని వన్‌టౌన్ స్టేషన్‌కు తరలించి సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. అదే విధంగా ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు యాదగిరిని రాజగోపాల్‌పేట పోలీసులు ముందస్తూగా అదుపులోకి తీసుకున్నారు. నారాయణఖేడ్ నుంచి ప్రధాని సభకు వెళ్లేందుకు యత్నించిన కాంగ్రెస్ మాజీ ఎంపీ సురేష్ షెట్కార్, ఎంపీపీ సంజీవరెడ్డిల పోలీసులు అరెస్టు చేశారు.
నారాయణఖేడ్‌లో మొత్తం 126 మందిని అరెస్టుచేసి అనంతరం విడుదల చేశారు. ప్రభుత్వ తీరుపట్ల సురేశ్ షెట్కార్, సంజీవరెడ్డిలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మెదక్ మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డిని పాపన్నపేట మండలం యూసుఫ్‌పేటలోని ఆయన నివాస గృహంలో ఆదివారం అరెస్ట్‌చేసి మెదక్ రూరల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అలాగే మెదక్ మండలంలోని ఆయా గ్రామాల కాంగ్రెస్ నాయకులను అరెస్ట్‌చేసి రూరల్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అరెస్ట్ అయిన వారిలో హవేళి ఘణాపూర్ ఎంపీటీసీ శ్రీకాంత్, డీసీసీ ఉపాధ్యక్షుడు నర్సింలుగౌడ్ తదితరులు ఉన్నారు. జగదేవ్‌పూర్‌లో కాంగ్రెస్ యువజన నాయకుడు భానుప్రకాశ్‌ను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు.