సబ్సిడీ పేరుతో దళితుల్ని మోసగిస్తున్న చంద్రబాబు
మాల మహానాడు సమన్వయకర్త రాజేష్
పాలకొల్లు అర్బన్ :
ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఇచ్చే రుణాలకు సంబంధించి లబ్ధిదారుల ఎంపికను జన్మభూమి కమిటీలకు అప్పగిస్తూ సీఎం చంద్రబాబునాయుడు దళితులను మోసం చేస్తున్నారని మాల మహానాడు రాష్ట్ర సమన్వయకర్త, వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు నల్లి రాజేష్ ధ్వజమెత్తారు. పాలకొల్లు మండలం చందపర్రులో శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సబ్సిడీ రుణాలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో వేలాదిమంది ఎస్సీ నిరుద్యోగులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారన్నారు. అయితే, జన్మభూమి కమిటీలు సిఫార్సు చేసిన వారికే రుణాలు అందుతున్నాయని విమర్శించారు. దీనివల్ల అర్హులైన ఎస్సీ నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దళితులను అవమానించడమే ధ్యేయంగా తెలుగుదేశం ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన దుయ్యబట్టారు. ఎస్సీ బ్యాక్‌లాగ్ ఉద్యోగాల భర్తీ విషయంలో చంద్రబాబు చొరవ చూపడం లేదన్నారు. మూడేళ్ల నుంచి ఏవిధమైన ఉద్యోగాలు భర్తీ చేయకపోవడంతో ఎస్సీ యువత నిరాశ, నిస్పృహలతో కొట్టుమిట్టాడుతోందన్నారు. సమావేశంలో మాల మహానాడు నాయకులుబొడ్డుపల్లి ప్రభుదాసు, కర్ణి జోగయ్య, విప్పర్తి ప్రభాకరరావు, ఏనుగుపల్లి చంద్రశేఖర్, పాలకొల్లు, ఆచంట కన్వీనర్లు పార్శి వెంకటరత్నం, నన్నేటి పుష్పరాజ్ పాల్గొన్నారు.