విశాఖ: ఎయిర్‌ఫోర్స్ విమానంలో గల్లంతైన వారి కుటుంబాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం పరామర్శించారు. విశాఖపట్నం వచ్చిన ఆయన బాజీ జంక్షన్, బుచ్చిరాజుపాలెంలో బాధిత కుటుంబాలను కలుసుకున్నారు. ఎన్డీయే ఉద్యోగి నమ్మి చిన్నారావు కుటుంబ సభ్యులను చంద్రబాబు పరామర్శించారు. నేవీ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారని ఆయన ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు తెలిపారు. కాగా గల్లంతు అయిన విమాన జాడ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. గంటలు గడుస్తున్నా విమానం జాడ తెలియటం లేదు. ఇప్పటి వరకు ఎలాంటి శిథిలాలు లభ్యం కాలేదని అధికారులు చెబుతున్నారు. 16 నౌకలు, ఏడు విమానాలు, ఒక సబ్ మెరైన్‌తో గాలింపు సాగుతోంది.
చెన్నైకు 300 కిలో మీటర్ల దూరంలో గాలింపు నిర్వహిస్తున్నారు. శుక్రవారం విమానం టేకాఫ్ తీసుకున్న 15-20 నిమిషాల్లో సిగ్నల్ కట్ అయింది. చెన్నైకు 151 నాటికల్ మైళ్లదూరంలో విమానంతో సంబంధాలు తెగిపోయాయి. ఏఎన్ 32 రకం విమానం అత్యవసర సమయంలో కూడా ఎగరగలదని అధికారులు అంటున్నారు. ఎమర్జెన్సీ సమయంలో అత్యవసర సందేశం పంపే అవకాశం కూడా ఈ విమానంలో ఉంది. సాధారణ విమానాల్లా ఏఎన్-32 కూలిపోయే ఛాన్స్ లేదని నిపుణులు చెబుతున్నారు.
అంతేకాకుండా ఈ విమానం నిరంతరం రాడార్ పర్యవేక్షణలో ఉంటుందని.. అనుకోని ఘటన జరిగి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. తుపాను లాంటి ప్రతికూల వాతావరణం ఎదురై ఉండవచ్చని విశ్లేషిస్తున్నారు. రెండు ఇంజిన్ల ఫెయిల్యూర్, అగ్నిప్రమాదం, ఇంధనం లీకేజ్, ఫ్లైట్ కంట్రోల్స్ స్తంభించడం లాంటి అవకాశాలపై విచారణ సాగిస్తున్నారు.