AN-32 flight
-
కూలిన ఏఎన్- 32.. 13 మృతదేహాలు వెలికితీత
ఈటానగర్ : అరుణాచల్‌ప్రదేశ్‌లో కూలిపోయిన ఏఎన్-32 విమాన ప్రమాద స్థలం నుంచి 13 మృతదేహాలను వెలికితీశారు. అలాగే కూలిపోయిన విమానం బ్లాక్‌బాక్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. అరుణాచల్‌ప్రదేశ్‌లోని లిపోకి 16 కిలోమీటర్ల దూరంలో భారత వైమానిక దళానికి చెందిన ఏఎన్-32 విమానం కూలిపోయిన విషయాన్ని ఇప్పటికే గుర్తించిన సంగతి తెలిసిందే. ఈ విమానం శకలాలను ఎంఐ-17 విమానాలు చేపట్టిన గాలింపు చర్యల్లో గుర్తించిన సంగతి తెలిసిందే. ప్రమాద స్థలంలో మృతదేహాలను గుర్తించి మృతుల కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. హెలికాప్టర్ల ద్వారా మృతదేహాలను స్వస్థలాలకు తరలించనున్నారు. జూన్ 3న 13 మందితో బయలుదేరిన ఏఎన్32 విమానం గాలిలోకి ఎగిరిన 33 నిమాషాల అనంతరం గల్లంతైన సంగతి తెలిసిందే. అస్సాంలోని జొర్హాత్ నుంచి మధ్యాహ్నం 12.27 గంటలకు బయలుదేరిన ఈ విమానం అరుణాచల్‌ప్రదేశ్‌లోని మెంచుకాకు (చైనా సరిహద్దుకు దగ్గర్లో) చేరాల్సి ఉండగా, మార్గమధ్యంలోనే కనిపించకుండాపోయింది. విమానం గల్లంతైన మరుక్షణం నుంచే అధికారులు దాని ఆచూకీ కోసం ముమ్మర గాలింపు చేపట్టారు. విమానం ఆచూకీ కనుగోవడానికి అత్యంత సామర్థ్యం కలిగిన హెలికాఫ్టర్లను కూడా వాయుసేన రంగంలోకి దించింది. అయితే కొండ ప్రాంతాలు కావడంతో ప్రతికూల పరిస్థితుల వల్ల అన్వేషణ ఇబ్బందికరంగా మారింది. ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన రెండు ఎంఐ–17 విమానాలు, అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్లు గల్లంతైన విమానం కోసం అటవీ ప్రాంతంల్లో జల్లెడపట్టాయి. గల్లంతైన ఏఎన్32 రకం విమానం ఆచూకీ తెలిపిన వారికి భారత వాయుసేన 5 లక్షల రూపాయల రివార్డు కూడా ప్రకటించింది. -
చివరి ప్రయత్నం..
సాక్షి, చెన్నై : బంగాళాఖాతంపై అదృశ్యమైన ఏఎన్-32 విమానం కోసం చివరి ప్రయత్నంగా మళ్లీ గాలింపునకు శ్రీకారం చుట్టారు. మానవ రహిత అత్యాధునిక పరికరాలతో చెన్నైకు 160 నాటికన్ మైళ్ల దూరంలో ఈ గాలింపు జరుగుతోంది. పన్నెండు చోట్ల సముద్రంలో మూడున్నర కి.మీ. దూరం మేరకు సాగర్ నిధి సాయం తో ఈ చివరి పరిశోధన సాగించే పనిలో నిపుణులు నిమగ్నమయ్యారు. చెన్నై తాంబరం ఎయిర్ బేస్ నుంచి అండమాన్ బయలు దేరిన భారత వైమానిక దళానికి చెందిన ఏఎన్-32 విమానం జూలై 22న బంగాళాఖాతంపై అదృశ్యమైన విషయం తెలిసిందే. ఈ విమానం సముద్రంలో గల్లంతైనా, అందుకు తగ్గ ఆధారాలు, సమాచారాలు ఇంతవరకు లభించ లేదు. ఈ విమానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారితో పాటుగా 29 మంది ఆచూకీ కోసం తీవ్ర ప్రయత్నాల్లో మునిగారు. నెలన్నర రోజులుగా చెన్నైకు 150 నాటికన్ మైళ్ల దూరంలో 20 నౌకలు, 18 విమానాలు, హెలికాప్టర్ల ద్వారా తీవ్రగాలింపు సాగినా, చిన్న పాటి ఆధారం చిక్క లేదు. ఆపరేషన్ తలాష్ పేరుతో సాగిన ఈ గాలింపులో జాతీయ సముద్ర తీర పరిశోధనా విభాగానికి చెందిన సాగర్ నిధి, భారత భౌగోళిక పరిశోధనా సంస్థకు చెందిన సముద్ర రత్నాకర్ నౌకలను రంగంలోకి దించినా ఫలితం శూన్యం. ఈ పరిస్థితుల్లో ఇరవై రోజుల క్రితం ఈ ఆపరేషన్‌ను పక్కన పెట్టిన అధికారులు చెన్నైలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ(ఎన్ఐవోటీ)లో తదుపరి ప్రయత్నాలపై సమాలోచనలో పడ్డారు. భారత నౌకాదళం, వైమానిక దళంలతో పాటు ఎన్ఐవోటీ, తదితర విభాగాల అధికారులు ఈ సమావేశంలో పాల్గొని తమకు చిక్కిన యాభై రకాల వస్తువులపై పరిశోధనలు సాగించడంతో పాటు తుది ప్రయత్నం చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. అదే సమయంలో ఆ విమానంలో ఉన్న 29 మంది ఇక బతికి ఉండే అవకాశం లేదని రక్షణ శాఖ ప్రకటించింది. ఈ నేపథ్యంలో చివరి ప్రయత్నంగా విమాన శకలాల కోసం గాలింపునకు సర్వం సిద్ధం చేశారు. అయితే, ఒక్క సాగర్ నిధిని మాత్రం రంగంలోకి దించారు. ఆదివారం ఈ నౌక చెన్నైకు 160 నాటికన్ మైళ్ల వద్ద చివరి ప్రయత్నంగా పరిశోధనల్లో మునిగింది. తమకు లభించిన వస్తువుల ఆధారంగా, పన్నెండు చోట్ల సముద్ర గర్భంలో గాలింపు చర్యలు చేపట్టారు. మానవ రహిత అత్యాధునిక పరికరాల్ని సముద్రగర్భంలో మూడున్నర కి.మీ దూరం పంపించి పరిశోధనల్ని ముమ్మరం చేసే పనిలో నిపుణులు ఉన్నారు. ఎంపిక చేసిన పన్నెండు చోట్ల గాలింపు ఇదే చివరి ప్రయత్నం అని, ఈ ప్రయత్నం ఫలించని పక్షంలో ఇక ఆపరేషన్ తలాష్కు శుభం కార్డు పడ్డట్టే అన్న సంకేతాలు వెలువడుతున్నాయి. కాగా ఈ గాలింపు గురించి ఓ అధికారి పేర్కొంటూ మానవ రహిత పరిశోధనా పరికరాల్ని సముద్రం గర్భంలోకి పంపించడం ద్వారా ఏదేని ఫలితాలు లభించేందుకు ఆస్కారం ఉందని, ఆ దిశగా చివరి ప్రయత్నం ఫలించాలన్నదే తమ ఆకాంక్షగా పేర్కొన్నారు. రెండు, మూడు రోజుల క్రితమే ఈ గాలింపునకు శ్రీకారం చుట్టి ఉండాల్సి ఉందని, అయితే, వాతావరణం అధ్వానంగా ఉండడంతో వెనక్కు తగ్గామని వ్యాఖ్యానించారు. -
మంత్రి పరికర్ను కలిసిన వైఎస్ఆర్సీపీ ఎంపీలు
ఢిల్లీ: రక్షణ శాఖ మంత్రి మనోహర్ పరికర్ను మంగళవారం న్యూఢిల్లీలో వైఎస్ఆర్సీపీ ఎంపీలు కలిశారు. ఏఎన్-32 విమాన ప్రమాద ఘటనపై కుటుంబ సభ్యుల ఆందోళనను కేంద్ర మంత్రి పరికర్కు వైఎస్ఆర్సీపీ ఎంపీలు వివరించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ఏఎన్-32 విమానంపై నిబంధనల ప్రకారం 30 రోజుల తర్వాత.. అధికారిక ప్రకటన చేస్తామని పరికర్ చెప్పారని వైఎస్ఆర్సీపీ ఎంపీలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. విమానం ఆచూకీ తెలిసే అవకాశాలు తక్కువగా ఉన్నాయని పరికర్ అన్నారని చెప్పారు. విమానంలోని పౌరులకు కూడా అధికారులలాగే పరిహారం ఇస్తామన్నారని వారు పేర్కొన్నారు. కాగా, గత నెల 22న చెన్నైలోని తాంబరం వైమానిక స్థావరం నుంచి పోర్ట్ బ్లెయిర్ బయలుదేరిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏఎన్-32 విమానం గాల్లోకి ఎగిరిన కాపేటికే గల్లంతయిన సంగతి తెలిసిందే. ఈ విమానంలో మొత్తం 29మంది ఉండగా, వీరిలో 9 మంది విశాఖపట్నం వాసులు ఉన్నట్టు అధికారులు వెల్లడించిన సంగతి విధితమే. -
భూపేంద్రసింగ్ కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ
-
విమానాలను నడుపుతున్న తీరు బాధాకరం
విశాఖపట్నం: దేశంలో విమానాలను నడుపుతున్న తీరు బాధాకరమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏఎన్-32 విమానం అదృశ్యంకావడం విచారకరమని అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ విమానంలో ప్రయాణిస్తూ గల్లంతయిన ఆరుగురి కుటుంబ సభ్యులను పరామర్శించారు. సోమవారం మాధవధార కళింగనగర్‌లో వరప్రసాద్ కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించారు. అంతకుముందు భూపేంద్రసింగ్ కుటుంబసభ్యుల్ని పరామర్శించారు. విశాఖ మర్రిపాలెంలోని 104 ఏరియాలోని ఆయన నివాసానికి విచ్చేసిన వైఎస్ జగన్ ...ఘటనపై కుటుంబసభ్యుల్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. భూపేంద్రసింగ్ కుమారుడితో వైఎస్ జగన్ మాట్లాడి, ధైర్యం చెప్పారు. విమానం కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని, అధైర్యపడవద్దని సూచించారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఆచూకీ మిస్ అయినప్పుడు తాము కూడా చాలా టెన్షన్ పడ్డామని, ఆరోజు ఎంతో కష్టం అనుభవించామని, ఆ కష్టం తనకు తెలుసని వారితో చెప్పారు. ఇప్పుడు గల్లంతైన భారత వాయుసేన విమానం ఆచూకీని గుర్తించేందుకు గాలింపు చర్యలను ముమ్మరం చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతామన్నారు. కాగా అదృశ్యమైన ఏఎన్-32 విమానంలో భూపేంద్రసింగ్ ఎగ్జామినర్ కూడా ఉన్నారు. ఆయనకు భార్య సంగీత, ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరి స్వస్థలం ఉత్తరప్రదేశ్. భూపేంద్ర సింగ్ ఆర్మీలో కూడా పనిచేశారు. ప్రమాదం జరిగి నాలుగు రోజులు అయినా తమవారి జాడ తెలీకపోవడంతో కుటుంబసభ్యులు తల్లడిల్లుతున్నారు. కాగా ఎన్ఏడీ నుంచి ఈ నెల 20వ తేదీన ఎనిమిది మంది ఉద్యోగులు బయలుదేరి వెళ్లారు. 21వ తేదీ ఉదయం 8 గంటలకు చెన్నై చేరుకున్నారు. ఇండియన్ నేవల్ షిప్ (ఐఎన్ఎస్) బట్టిమాల్వ్లో సీఆర్ఎన్-91 అనే ఆయుధంలో తలెత్తిన సమస్యను పరిష్కరించడానికి తమిళనాడు రాజధాని చెన్నైలోని తాంబరం నుంచి అండమాన్ రాజధాని పోర్టుబ్లెయిర్‌కు ఐఏఎఫ్ విమానం ఏఎన్ 32 ఈ నెల 22వ తేదీ ఉదయం 8.30కి బయలుదేరింది. 8.46 గంట లకు ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయి. అనంతరం విమానం అదృశ్యమైనట్లు వైమానిక దళ అధికారులు ప్రకటించారు. విమానంలో 29 మంది ఉండగా వారిలో విశాఖపట్నంలోని నేవల్ ఆర్మమెంట్ డిపో (ఎన్ఏడీ)కి చెందిన ఎనిమిది మంది సిబ్బంది ఉన్నారని అధికారులు నిర్ధారించి వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. -
ఇంకా దొరకని విమానం ఆచూకీ
-
ఇంకా దొరకని విమానం ఆచూకీ
చెన్నై: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏఎన్-32 విమానం అదృశ్యమై మూడు రోజులు కావస్తున్నా ఇంకా ఆచూకీ దొరకలేదు. బంగాళాఖాతంలో విమాన ప్రమాదం జరిగిందని భావిస్తున్న ప్రాంతంలో లోతు ఎక్కువగా ఉందని నేవీ అధికారులు చెప్పారు. మూడున్నర కిలో మీటర్ల మేర సముద్రంలోతు ఉండటంతో గాలించడానికి కష్టమవుతోందని తెలిపారు. మూడో రోజు ఆదివారం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. 18 నౌకలు, 8 విమానాలు, ఒక సబ్‌మెరైన్ సాయంతో గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఉపగ్రహాల సాయంతో శోధిస్తున్నారు. సముద్రంలో ప్రతికూల వాతావరణం ఉండటం గాలింపు చర్యలకు అంతరాయం ఏర్పడుతోంది. ఈ నెల 22న చెన్నైలోని తాంబరం వైమానిక స్థావరం నుంచి పోర్ట్ బ్లెయిర్ బయలుదేరిన ఈ విమానం గాల్లోకి ఎగిరిన కాపేటికే గల్లంతయిన సంగతి తెలిసిందే. ఈ విమానంలో మొత్తం 29మంది ఉండగా, వీరిలో 9 మంది విశాఖపట్నం వాసులు ఉన్నారు. -
రేపు విశాఖ పర్యటనకు వైఎస్ జగన్
విశాఖపట్నం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం విశాఖపట్నంలో పర్యటించనున్నారు. రేపు మధ్యాహ్నం 12:30 గంటలకు ఇక్కడికి చేరుకోనున్నారు. అదృశ్యమైన ఐఏఎఫ్ ఏఎన్-32 విమానం బాధిత కుటుంబాలను వైఎస్ జగన్ పరామర్శించనున్నారు. ఈ నెల 22న చెన్నైలోని తాంబరం వైమానిక స్థావరం నుంచి పోర్ట్ బ్లెయిర్ బయలుదేరిన ఈ విమానం గాల్లోకి ఎగిరిన కాపేటికే గల్లంతయిన సంగతి తెలిసిందే. ఈ విమానంలో మొత్తం 29మంది ఉండగా, 9 మంది విశాఖపట్నం వాసులు ఉన్నారు. గల్లంతయిన వారిలో 8 మంది ఎన్ఏడీ సివిల్ ఉద్యోగులు, ఒక ఛార్జ్మన్ ఉన్నారు. -
చిన్నారావు కుటుంబానికి చంద్రబాబు పరామర్శ
విశాఖ: ఎయిర్‌ఫోర్స్ విమానంలో గల్లంతైన వారి కుటుంబాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం పరామర్శించారు. విశాఖపట్నం వచ్చిన ఆయన బాజీ జంక్షన్, బుచ్చిరాజుపాలెంలో బాధిత కుటుంబాలను కలుసుకున్నారు. ఎన్డీయే ఉద్యోగి నమ్మి చిన్నారావు కుటుంబ సభ్యులను చంద్రబాబు పరామర్శించారు. నేవీ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారని ఆయన ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు తెలిపారు. కాగా గల్లంతు అయిన విమాన జాడ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. గంటలు గడుస్తున్నా విమానం జాడ తెలియటం లేదు. ఇప్పటి వరకు ఎలాంటి శిథిలాలు లభ్యం కాలేదని అధికారులు చెబుతున్నారు. 16 నౌకలు, ఏడు విమానాలు, ఒక సబ్ మెరైన్‌తో గాలింపు సాగుతోంది. చెన్నైకు 300 కిలో మీటర్ల దూరంలో గాలింపు నిర్వహిస్తున్నారు. శుక్రవారం విమానం టేకాఫ్ తీసుకున్న 15-20 నిమిషాల్లో సిగ్నల్ కట్ అయింది. చెన్నైకు 151 నాటికల్ మైళ్లదూరంలో విమానంతో సంబంధాలు తెగిపోయాయి. ఏఎన్ 32 రకం విమానం అత్యవసర సమయంలో కూడా ఎగరగలదని అధికారులు అంటున్నారు. ఎమర్జెన్సీ సమయంలో అత్యవసర సందేశం పంపే అవకాశం కూడా ఈ విమానంలో ఉంది. సాధారణ విమానాల్లా ఏఎన్-32 కూలిపోయే ఛాన్స్ లేదని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఈ విమానం నిరంతరం రాడార్ పర్యవేక్షణలో ఉంటుందని.. అనుకోని ఘటన జరిగి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. తుపాను లాంటి ప్రతికూల వాతావరణం ఎదురై ఉండవచ్చని విశ్లేషిస్తున్నారు. రెండు ఇంజిన్ల ఫెయిల్యూర్, అగ్నిప్రమాదం, ఇంధనం లీకేజ్, ఫ్లైట్ కంట్రోల్స్ స్తంభించడం లాంటి అవకాశాలపై విచారణ సాగిస్తున్నారు. -
ఆ విమానంలో 9మంది విశాఖవాసులు
-
ఏఎన్-32 కోసంగా విస్తృతంగా గాలింపు
-
ఆ విమానంలో 9మంది విశాఖవాసులు
విశాఖపట్నం: అదృశ్యమైన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏఎన్-32 విమానంలో 9 మంది విశాఖపట్నం వాసులు ఉన్నారు. గల్లంతయిన వారిలో 8 మంది ఎన్ఏడీ సివిల్ ఉద్యోగులు, ఒక ఛార్జ్మన్ ఉన్నారు. ఫిట్టర్లు ప్రసాద్ బాబు, నాగేంద్రరావు, చిన్నారావు, శ్రీనివాసరావు, సేనాపతి, మహారాణా, చిట్టిబాబు, ఛార్జ్మన్ సాంబమూర్తి గల్లంతయ్యారు. బాధిత కుటుంబాలకు అధికారులు సమాచారం అందించారు. గంటలు గడుస్తున్నా విమానం ఆచూకీ తెలియకపోవడంతో గల్లంతయిన ఉద్యోగుల కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. శుక్రవారం ఉదయం తమిళనాడులోని తాంబరం నుంచి పోర్ట్ బ్లెయిర్ వెళుతున్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానం గల్లంతయింది. విమానంలో మొత్తం 29 మంది ఉన్నట్టు సమాచారం. ఈ రోజు సాయంత్రం వరకు విమానం ఆచూకీ తెలియరాలేదు. ఏఎన్-32 విమానం ఆచూకీ కనుగొనేందుకు గాలింపు చర్యలను ముమ్మురం చేశారు. బంగాళాఖాతంలో భారత వాయుసేన, నౌకాదళం సిబ్బంది విస్తృతంగా గాలిస్తున్నారు. -
ఏఎన్-32 కోసంగా విస్తృతంగా గాలింపు
అదృశ్యమైన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏఎన్-32 విమానం ఆచూకీ కనుగొనేందుకు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. బంగాళాఖాతంలో విస్తృతంగా గాలిస్తున్నారు. భారత వాయుసేన, నౌకాదళం సిబ్బంది రంగంలోకి దిగారు. ఐదు హెలికాప్టర్లు, రెండు విమానాల ద్వారా వెతుకుతున్నారు. నాలుగు యుద్ధ నౌకలతో పాటు సబ్ మెరైన్ను రంగంలోకి దించారు. కోస్ట్ గార్డ్ బృందాలు కూడా గాలింపు జరుపుతున్నాయి. చెన్నైకు తూర్పు దిశగా 200 నాటికల్ మైళ్ల దూరంలో గాలింపు చర్యలు చేపడుతున్నారు. విమానం జాఢ తెలుసుకునేందుకు సాయం చేయాల్సిందిగా భారత ప్రభుత్వం శ్రీలంక, సింగపూర్, మలేసియాలను కోరింది. శుక్రవారం ఉదయం తమిళనాడులోని తాంబరం నుంచి పోర్ట్ బ్లెయిర్ వెళుతున్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానం గల్లంతయింది. విమానంలో ఆరుగురు క్రూ సిబ్బందితో సహా 29 మంది ఉన్నట్టు సమాచారం. ఈ విమానాన్ని రష్యా నుంచి కొనుగోలు చేశారు. గతంలో ఇదే తరహా విమానం ఒకటి అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతంలో కూలిపోయింది. అప్పట్లో దానికి కారణం సాంకేతిక సమస్య అని చెప్పారు. -
ఎయిర్ ఫోర్స్ విమానం అదృశ్యం
-
ఎయిర్ ఫోర్స్ విమానం అదృశ్యం
చెన్నె: తమిళనాడులోని తాంబరం నుంచి పోర్ట్ బ్లెయిర్ వెళుతున్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానం గల్లంతయింది. విమానంలో ఆరుగురు క్రూ సిబ్బందితో సహా 29 మంది ఉన్నట్టు సమాచారం. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన ఏఎన్-32 విమానం శుక్రవారం గగనతలంలో అదృశ్యమైంది. ఉదయం 8.30 గంటలకు గాల్లోకి ఎగిరిన 16 నిమిషాల తర్వాత విమానం.. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో సంబంధాలు కోల్పోయింది. ఎయిర్‌పోర్టు వర్గాలు వెంటనే ఈ విషయాన్ని వాయుసేన అధికారులకు తెలిపారు. విమానంలో సాంకేతిక లోపం తలెత్తి ఉండొచ్చని భావిస్తున్నారు. కనబడకుండా పోయిన విమానం ఆచూకీ కనిపెట్టేందుకు ఎయిర్ ఫోర్స్, నావికా దళం సేనలు రంగంలోకి దిగాయి. విమానం అదృశ్యమై ఇప్పటికి ఆరు గంటలు దాటడంతో అధికారులు విచారణ ప్రారంభించారు. కోస్ట్ గార్డ్ బృందాలు కూడా దీనికోసం గాలింపు జరుపుతున్నాయి. బంగాళా ఖాతంలోని పలు ప్రాంతాల్లో గాలిస్తున్నారు. ఈ విమానాన్ని రష్యా నుంచి కొనుగోలు చేశారు. గతంలో ఇదే తరహా విమానం ఒకటి అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతంలో కూలిపోయింది. అప్పట్లో దానికి కారణం సాంకేతిక సమస్య అని చెప్పారు. ఇప్పుడు ఈ విమానం అదృశ్యం కావడం వెనుక సాంకేతిక కారణాలే ఉన్నాయా, మరేదైనా సమస్య ఉందా అని విచారణ జరపాల్సి ఉంది. మరికొద్ది సేపట్లో దీనికి సంబంధించిన వివరాలు తెలిసే అవకాశం ఉంది.