చివరి ప్రయత్నం..
సాక్షి, చెన్నై : బంగాళాఖాతంపై అదృశ్యమైన ఏఎన్-32 విమానం కోసం చివరి ప్రయత్నంగా మళ్లీ గాలింపునకు శ్రీకారం చుట్టారు. మానవ రహిత అత్యాధునిక పరికరాలతో చెన్నైకు 160 నాటికన్ మైళ్ల దూరంలో ఈ గాలింపు జరుగుతోంది. పన్నెండు చోట్ల సముద్రంలో మూడున్నర కి.మీ. దూరం మేరకు సాగర్ నిధి సాయం తో ఈ చివరి పరిశోధన సాగించే పనిలో
నిపుణులు నిమగ్నమయ్యారు. చెన్నై తాంబరం ఎయిర్ బేస్ నుంచి అండమాన్ బయలు దేరిన భారత వైమానిక దళానికి చెందిన ఏఎన్-32 విమానం జూలై 22న బంగాళాఖాతంపై అదృశ్యమైన విషయం తెలిసిందే. ఈ విమానం సముద్రంలో గల్లంతైనా, అందుకు తగ్గ ఆధారాలు, సమాచారాలు ఇంతవరకు లభించ లేదు. ఈ విమానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారితో పాటుగా 29 మంది ఆచూకీ కోసం తీవ్ర ప్రయత్నాల్లో మునిగారు. నెలన్నర రోజులుగా చెన్నైకు 150 నాటికన్ మైళ్ల దూరంలో 20 నౌకలు, 18 విమానాలు, హెలికాప్టర్ల ద్వారా తీవ్రగాలింపు సాగినా, చిన్న పాటి ఆధారం చిక్క లేదు. ఆపరేషన్ తలాష్ పేరుతో సాగిన ఈ గాలింపులో జాతీయ సముద్ర తీర పరిశోధనా విభాగానికి చెందిన సాగర్ నిధి, భారత భౌగోళిక పరిశోధనా సంస్థకు చెందిన సముద్ర రత్నాకర్ నౌకలను రంగంలోకి దించినా ఫలితం శూన్యం.
ఈ పరిస్థితుల్లో ఇరవై రోజుల క్రితం ఈ ఆపరేషన్‌ను పక్కన పెట్టిన అధికారులు చెన్నైలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ(ఎన్‌ఐవోటీ)లో తదుపరి ప్రయత్నాలపై సమాలోచనలో పడ్డారు. భారత నౌకాదళం, వైమానిక దళంలతో పాటు ఎన్‌ఐవోటీ, తదితర విభాగాల అధికారులు ఈ సమావేశంలో పాల్గొని తమకు చిక్కిన యాభై రకాల వస్తువులపై పరిశోధనలు సాగించడంతో పాటు తుది ప్రయత్నం చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. అదే సమయంలో ఆ విమానంలో ఉన్న 29 మంది ఇక బతికి ఉండే అవకాశం లేదని రక్షణ శాఖ ప్రకటించింది. ఈ నేపథ్యంలో చివరి ప్రయత్నంగా విమాన శకలాల కోసం గాలింపునకు సర్వం సిద్ధం చేశారు. అయితే, ఒక్క సాగర్ నిధిని మాత్రం రంగంలోకి దించారు. ఆదివారం ఈ నౌక చెన్నైకు 160 నాటికన్ మైళ్ల వద్ద చివరి ప్రయత్నంగా పరిశోధనల్లో మునిగింది.
తమకు లభించిన వస్తువుల ఆధారంగా, పన్నెండు చోట్ల సముద్ర గర్భంలో గాలింపు చర్యలు చేపట్టారు. మానవ రహిత అత్యాధునిక పరికరాల్ని సముద్రగర్భంలో మూడున్నర కి.మీ దూరం పంపించి పరిశోధనల్ని ముమ్మరం చేసే పనిలో నిపుణులు ఉన్నారు. ఎంపిక చేసిన పన్నెండు చోట్ల గాలింపు ఇదే చివరి ప్రయత్నం అని, ఈ ప్రయత్నం ఫలించని పక్షంలో ఇక ఆపరేషన్ తలాష్‌కు శుభం కార్డు పడ్డట్టే అన్న సంకేతాలు వెలువడుతున్నాయి. కాగా ఈ గాలింపు గురించి ఓ అధికారి పేర్కొంటూ మానవ రహిత పరిశోధనా పరికరాల్ని సముద్రం గర్భంలోకి పంపించడం ద్వారా ఏదేని ఫలితాలు లభించేందుకు ఆస్కారం ఉందని, ఆ దిశగా చివరి ప్రయత్నం ఫలించాలన్నదే తమ ఆకాంక్షగా పేర్కొన్నారు. రెండు, మూడు రోజుల క్రితమే ఈ గాలింపునకు శ్రీకారం చుట్టి ఉండాల్సి ఉందని, అయితే, వాతావరణం అధ్వానంగా ఉండడంతో వెనక్కు తగ్గామని వ్యాఖ్యానించారు.