రాష్ట్ర విభజనకు కారకులు చంద్రబాబే
- వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి
నందికొట్కూరు: రాష్ట్ర విభజనకు కారకులు సీఎం చంద్రబాబేనని వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి ఆరోపించారు. బుధవారం పట్టణంలోని ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర విభజన జరిగే సమయంలో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు లేఖతోనే కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియాగాంధీ తెలుగు రాష్ట్రాన్ని ముక్కలు చేసిన విషయం ఏపీ ప్రజలందరికీ తెలిసిందేనని చెప్పారు. వైఎస్‌ఆర్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డిపై జిల్లా ఇన్‌చార్జీ మంత్రి అచ్చెన్నాయుడు నిందారోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నేరవేర్చలేక ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై విమర్శలు చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కై జననేతను అన్యాయంగా జైలుకు పంపిన విషయం ప్రజలకు తెలుసన్నారు. అచ్చెన్నాయుడు నోరును అదుపులో ఉంచుకొని మాట్లాడితే మంచిదని హితవు పలికారు. మాయమాటలతో ప్రజలను మభ్యపెట్టే టీడీపీ నేతలకు తమ పార్టీ అధినేతను విమర్శించే అర్హత లేదన్నారు. విలేకరుల సమావేశంలో వైఎస్‌ఆర్‌సీపీ కౌన్సిలరు శ్రీనివాసరెడ్డి, జిల్లా నాయకులు కోకిల రమణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.