
నా మాటలను వక్రీకరించారు: చంద్రబాబు
దేవుడు, దేవాలయాలపై తాను చేసిన వ్యాఖ్యలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివరణ ఇచ్చుకున్నారు.
విజయవాడ: దేవుడు, దేవాలయాలపై తాను చేసిన వ్యాఖ్యలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివరణ ఇచ్చుకున్నారు. తన మాటలను వక్రీకరించారని, దేవుడు అంశాలపై తాను పాజిటివ్గానే మాట్లాడనని ఆయన అన్నారు. కాగా తప్పులు చేసేవారే ఎక్కువగా గుళ్లకు వెళుతున్నారని, ఎక్కువ తప్పులు చేసి హుండీలో ఎక్కువ డబ్బులు వేస్తున్నారని చంద్రబాబు నిన్న విజయవాడలో జరిగిన కలెక్టర్ల సదస్సులో వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
మరోవైపు రెండోరోజు కలెక్టర్ల సదస్సు కొనసాగుతోంది. పరిపాలనలో నూతనత్వం చాలా అవసరమని చంద్రబాబు ఈ సందర్భంగా అధికారులకు సూచించారు. ప్రజలకు వేధింపులు లేని, అవినీతి లేని పాలన అందించాలని ఆయన అన్నారు. కలెక్టర్లకు విశేషమైన అధికారాలు ఉన్నాయని, ప్రజారంజక పాలన అందించడంలో కలెక్టర్లదే బాధ్యత అని చంద్రబాబు పేర్కొన్నారు. గ్రామస్థాయి నుంచి అధికారుల్లో పోటీ తత్వం పెరిగేలా కలెక్టర్లు చొరవ తీసుకోవాలని ఆయన ఆదేశించారు.