
'రంగా హత్య వెనుక చంద్రబాబు హస్తం ఉంది'
- టీడీపీ నేతలు అతిగా స్పందించడం హాస్యాస్పదం
- నేను డబ్బు సంపాదనకు ఆశ పడలేదు
- అప్పటి విషయాలు నేటి తరానికి తెలియజేయడానికే పుస్తక రచన
- చేగొండి హరిరామజోగయ్య స్పష్టీకరణ
పాలకొల్లు: కాపు నాయకుడు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహనరంగా హత్య వెనుక చంద్రబాబు నాయుడు హస్తం ఉందని మాజీ ఎంపీ చేగొండి హరిరామజోగయ్య పునరుద్ఘాటించారు. ఈ విషయాన్ని అప్పట్లో తనతోపాటు ప్రజలంతా నమ్మారని స్పష్టం చేశారు. ఆయన గురువారం పాలకొల్లులో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తాను రచించిన ‘60 వసంతాల నా రాజకీయ ప్రస్థానం’ పుస్తకంపై టీడీపీ నాయకులు అతిగా స్పందించడం హాస్యాస్పదమని పేర్కొన్నారు. రంగా హత్య వెనుక టీడీపీ ప్రమేయం ఉందని అన్ని వర్గాల ప్రజలు నమ్మడం వల్లే ఆ రోజుల్లో పెద్దఎత్తున ఆందోళనలు చేపట్టిన విషయం గుర్తించాలన్నారు.
కేవలం పుస్తకాలు అమ్ముకోవడానికే విస్తృత ప్రచారం కల్పిస్తున్నట్లు టీడీపీ ఏపీ అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు విమర్శించడం ఆయన అవివేకానికి నిదర్శనమని మండిపడ్డారు. తాను డబ్బు సంపాదన కోసం ఎప్పుడూ పాకులాడలేదని అన్నారు. తాను రాసిన పుస్తకంలోని అంశాలను అందరూ చదివి అర్థం చేసుకోవాలనే సదుద్దేశంతో కేవ లం రూ.20కే విక్రయిస్తున్నట్లు తెలిపారు. పుస్తకాలు విక్రయించగా వచ్చిన సొమ్మును పాలకొల్లులోని మానసిక వికలాంగుల పాఠశాలకు విరాళంగా ఇస్తున్నట్లు పుస్తకావిష్కరణ సభలోనే ప్రకటించానని గుర్తుచేశారు. 144 పేజీల పుస్తకంలో కేవలం 72వ పేజీలో రాసిన అంశంపైనే టీడీపీ స్పందించడం భావ్యం కాదని జోగయ్య అన్నారు.
తాను ఎలాంటి రాజకీయ లబ్ధి కోసం పుస్తక రచనకు పూనుకోలేదని, తన 60 ఏళ్ల రాజకీయ జీవితంలో ఉన్నది ఉన్నట్టు, విన్నది విన్నట్టు రాశానని పేర్కొన్నారు. ఇది కొందరు నాయకులకు మింగుడు పడకపోవడం దారుణమన్నారు. ఏ రాజకీయ పార్టీపైనో బురద చల్లడానికి, నాయకులను కించపర్చడానికి పుస్తకం ప్రచురించలేదని వెల్లడించారు. అప్పట్లో జరిగిన విషయాలు నేటితరానికి తెలియాలనే సంకల్పం ఒకటైతే.. తాను తరచూ పార్టీలు మారుతాననే అభిప్రాయం ప్రజల్లో ఉన్నందున.. పార్టీలు ఎందుకు మారాల్సి వచ్చిందో సవివరంగా తెలియజేయడమే పుస్తక రచన ధ్యేయమని జోగయ్య వివరించారు.