చేగొండి హరిరామ జోగయ్య కాస్తా పవన్ చెవిలో జోరీగలా మారారు. కాపు సంక్షేమ సేన వ్యవస్థాపకుడు అయిన ఈ మాజీ మంత్రి, మాజీ ఎంపీ.. పవన్ కళ్యాణ్ పాలిట విలన్ మాదిరి తయారయ్యారు. పవన్ కళ్యాణ్ ఇమేజిని.. ప్రతిష్టను.. కాపుల్లో ఉన్న విలువ గౌరవాన్ని తగ్గించడమే పనిగా పెట్టుకుని ర్యాగింగ్ చేస్తున్నారు. పెద్దాయన రామా.. కృష్ణా.. అని మూల కూర్చోకుండా పవన్‌ను పరుగెత్తిస్తున్నారు. ప్రశ్నించడానికే పార్టీ పెట్టాను అని ప్రకటించుకున్న పవన్ కల్యాణ్ను గత కొద్దిరోజులుగా ఈ వెటరన్ ఎదురుప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. కాపులకు ప్రాధాన్యం దక్కాలని కోరుకునే ఈ సీనియర్ మొన్నామధ్య జనసేనకు కనీసం 60 ఎమ్మెల్యే సీట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఒక లేఖ రాసారు.
ఆశలు పవన్కు ఎన్ని సీట్లు ఇస్తారో తెలియని పరిస్థితి ఉంది. పొత్తులో భాగంగా ఓ పాతిక ఇరవై సీట్లు చంద్రబాబు ఇస్తాడేమో అని జనసైనికులు భావిస్తున్న తరుణంలో మాకు ప్రాధాన్యం ఇవ్వాలంటూ మొన్న జోగయ్య రాసిన లేఖ చర్చనీయాంశమయింది. కాపులు దాదాపు 50 నియోజకవర్గాల్లో బలంగా ఉన్నారని, వారికి ప్రాధాన్యం ఇవ్వనప్పుడు చంద్రబాబు వెంట ఎందుకు వెళ్లాలని, ఆయనకు ఎందుకు ఊడిగం చేయాలనీ ప్రశ్నిస్తూ జోగయ్య లేఖ రాసారు. అది అలా ఉండగానే ఇప్పుడు మరో బాణం సంధించారు. నిన్ను ఎక్కడికో తీసుకుపోదామని మేము అనుకుంటున్నాం.. కానీ మీరు అక్కడికి రారు.. ఇక్కడే ఉంటాను అంటారు. ఇలా ఐతే ఎలా అని ప్రశ్నించారు. అసలు ఆ కూటమికి చంద్రబాబే నాయకుడు, ఆయనే ముఖ్యమంత్రి అంటూ మొన్న లోకేష్ సైతం ప్రకటించారు. అలా అయన ప్రకటించాక కూడా మీరు చంద్రబాబు వెంట వెళ్తారా ? అంటూ జోగయ్య ప్రశ్నించారు.
చదవండి: ఇంకా యాచించే స్థితేనా?.. బహిరంగ లేఖలో పవన్‌కు హరిరామజోగయ్య ప్రశ్న
అంటే మీరు చంద్రబాబుకు తాబేదారుగా ఉంటారా? మీరు బానిసత్వాన్నే కోరుకుంటున్నారా ? మీకు అస్తిత్వం లేదా.. కాపుల ఆత్మగౌరవం కాపాడే బాధ్యత లేదా అంటూ జోగయ్య వేసిన ప్రశ్నలు పవన్ను గుక్కతిప్పుకోనివ్వడం లేదు. ఈ లేఖలు కాపు సామాజిక వర్గంలో ఒక ఆలోచనను రేకెత్తించాయి. అసలు మన ఓట్లతో చంద్రబాబు గద్దెనెక్కడం ఏమిటి? మనం ఆయన కోసం త్యాగాలు చేసి కూలీ చేయడం ఏమిటనే ఆలోచన మొదలైంది. నిన్ను మా నాయకుడిగా చూడాలని ఆశిస్తుంటే మీరు కాస్తా చంద్రబాబు పల్లకీ మోయడానికి సిద్ధపడితే ఎలా? అంటూ అయన ప్రశ్నించారు.
--- సిమ్మాదిరప్పన్న
Comments
Please login to add a commentAdd a comment