వారిది రాజకీయ భేటీనే! | Political meeting theirs! | Sakshi
Sakshi News home page

వారిది రాజకీయ భేటీనే!

Published Fri, Nov 13 2015 1:18 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

వారిది రాజకీయ భేటీనే! - Sakshi

వారిది రాజకీయ భేటీనే!

♦ ప్రత్యేక హోదా సాధించలేని ముఖ్యమంత్రి
♦ రంగా హత్యపై జోగయ్య వ్యాఖ్యలతో సంచలనం
♦ దూరమవుతున్న కాపు సామాజిక వర్గం
♦ విమర్శలు గుప్పిస్తున్న బీజేపీ నేతలు వీర్రాజు, కన్నా
♦ పవన్ ద్వారా కాషాయ లీడర్లకు కళ్లెం వేసే యత్నం
♦ మంత్రి కామినేని ద్వారా పవన్ నివాసంలో మంతనాలు
♦ ప్రత్యేక విమానం ఏర్పాటు.. సీఎం ప్రత్యేక ఆహ్వానం
♦ బాబు రాజీ ఫార్ములాకు అంగీకరించిన పవన్!
 
 సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు ఎంతో కీలకమైన ప్రత్యేక హోదా సాధించలేక ఒకవైపు, వంగవీటి మోహనరంగా హత్యోదంతంపై మాజీ ఎంపీ హరిరామజోగయ్య తన పుస్తకంలో వెల్లడించిన సంచలన అంశాలు మరోవైపు వెంటాడుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సినీనటుడు, జనసేన నాయకుడు పవన్ కల్యాణ్‌తో రాయబారం నెరిపారా? అంటే రాజకీయ వర్గాల్లో అవుననే సమాధానం వినిపిస్తోంది. గత కొంతకాలంగా రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న పరిణామాలతో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఆందోళన కొట్టుమిట్టాడుతున్నారు. వంగవీటి మోహనరంగా హత్యపై జోగయ్య వెల్లడించిన సంచలనాంశాలతో పాటు కొంతకాలంగా రాష్ట్రంలోని కాపు, బలిజ, తూర్పు కాపు, తెలగ, ఒంటరి సామాజిక వర్గాల్లో టీడీపీ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం కావడం, ఇదే సమయంలో కాపు రిజర్వేషన్ల కోసం త్వరలో ఉద్యమం ప్రారంభిస్తామని ముద్రగడ పద్మనాభం ప్రకటించడంతో చంద్రబాబు ఉక్కిరిబిక్కిరవుతున్నారని ఆయన సొంత పార్టీ నేతలే చెబుతున్నారు.

దీనికి తోడన్నట్టు మిత్రపక్షమైన బీజేపీలోని కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకులు సోము వీర్రాజు, కన్నా లక్ష్మినారాయణ లాంటి వారు టీడీపీ ప్రభుత్వ పనితీరుపై విమర్శలు గుప్పించడం చంద్రబాబును మరింత ఇరకాటంలో పడేసింది. ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని గట్టిగా అడగకుండా రాజీమార్గంలో వెళుతున్నప్పటికీ బీజేపీ నేతల నుంచి విమర్శలు పెరగడంతో చంద్రబాబు జీర్ణించుకోలేకపోయారని టీడీపీ నేతలు అంటున్నారు. పరిస్థితులు ఎటు తిరిగి ఎలా మారుతాయోనని ఆందోళన చెందుతున్న సమయంలో బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో కొంత ధైర్యం చేసిన చంద్రబాబు తన మంత్రివర్గంలోని, తన సామాజిక వర్గానికి చెందిన బీజేపీ నేత కామినేని శ్రీనివాస్ ద్వారా పవన్ కల్యాణ్‌తో భేటీకి తెరవెనుక వ్యవహారం నడిపించారని తెలుస్తోంది.

గత రెండు రోజులుగా పవన్ నివాసంలోనే ఈ భేటీపై సమాలోచనలు జరిగినట్టు పార్టీ వర్గాలు చెప్పాయి. పవన్‌ను అంగీకరింపజేయడంతో ఆయనను రప్పించడానికి చంద్రబాబు ఏకంగా ప్రత్యేక విమానాన్ని సమకూర్చారు. రాజధాని శంకుస్థాపన ఆహ్వానపత్రాన్ని స్వయంగా అందించలేదన్న అసంతృప్తితో ఉన్న పవన్ కల్యాణ్‌ను సంతృప్తి పరచడంకోసం తాజా తతంగం నడిపించినట్టు పైకి కనబడుతున్నప్పటికీ... పార్టీకి పలు సామాజిక వర్గాలు దూరం కావడం, బీజేపీ నేతల నోళ్లు మూయించడం అన్న ఎత్తుగడతోనే ఈ భేటీని చంద్రబాబు ఉపయోగించుకున్నట్టు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.

ఈ భేటీలో సోము వీర్రాజు, కన్నా లక్ష్మినారాయణల విషయాన్ని ప్రస్తావించిన చంద్రబాబు వారి నోళ్లకు కళ్లెం వేయించే పనిని పవన్ కల్యాణ్‌కు అప్పగించినట్టు విశ్వసనీయ సమాచారం. వాస్తవానికి పవన్ కల్యాణ్‌ను బీజేపీ అగ్రనాయకత్వానికి, మరీ ముఖ్యంగా నరేంద్ర మోదీకి తొలి పరిచయం చేసిన వ్యక్తి సోము వీర్రాజే. పవన్ కల్యాణ్ చెబితే సోము వీర్రాజు వింటారన్న అభిప్రాయంతో వారి నోరు మూయించాలని కోరినట్టు తెలిసింది.
 
 ప్రశ్నించకుండానే...
 టీడీపీ ఎంపీలు సొంత వ్యాపార అవసరాలే తప్ప ఆంధ్రప్రదేశ్‌కు రావలసిన ప్రత్యేక హోదా విషయాన్ని పట్టించుకోవడం లేదని కొద్ది నెలల కిందట స్పందించిన పవన్ కల్యాణ్ ఆ తర్వాత దానిపై పెదవి విప్పలేదు. ప్రత్యేక హోదా విషయంలో పార్లమెంట్ సభ్యులు ఏం చేస్తున్నారని ప్రశ్నించిన పవన్ కల్యాణ్ ఇప్పుడు ఆ విషయం ప్రస్తావనకు రాగానే తన స్థాయి కాదని దాటవేశారు. రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ప్రధానమంత్రి ప్రత్యేక హోదాపై ప్రకటన చేయకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమైనా పట్టించుకోలేదు. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ల తాజా భేటీలో ప్రత్యేకహోదా అంశంపై కాకుండా రాజకీయ అవసరాలపైనే ప్రధానంగా సాగినట్టు తెలుస్తోంది. బాక్సైట్ తవ్వకాలు, రైతుల నుంచి బలవంతంగా భూములను సేకరించడం వంటి అనేక విషయాల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానని చెప్పిన పవన్ కల్యాణ్ ఈ సమావేశం తర్వాత వాటన్నింటిపైనా బాబు రాజీ ఫార్ములాకు అంగీకరించినట్టు రాజకీయవర్గాల్లో బలంగా వినిపిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement