హోదాపై మాట్లాడే స్థాయి లేదు
♦ సినీ నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్
♦ హోదా ఇవ్వకపోతే బీజేపీ దెబ్బతినే అవకాశం
♦ బాక్సైట్ కోసం గిరిజనులను తరలించవద్దని సీఎంను కోరా
♦ రెండుగంటలపాటు పలు అంశాలపై సీఎంతో చర్చ
సాక్షి, విజయవాడ బ్యూరో: రాష్ట్రానికి ప్రత్యేక హోదా గురించి ఢిల్లీ వెళ్లి కేంద్రంతో మాట్లాడే స్థాయి తనకు లేదని సినీ నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ చెప్పారు. విభజన చట్టంలోని అన్ని అంశాలను తూచా తప్పకుండా అమలు చేస్తానని ప్రధాని మోదీ చెప్పారని.. ఏమిస్తారో, ఏం చేస్తారో చూసి ఆ తర్వాత స్పందిస్తానని తెలిపారు. ఆయన గురువారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబుతో సమావేశమై పలు అంశాలపై రెండు గంటలకుపైగా చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ విభజన చట్టం చేస్తున్నప్పుడు పార్లమెంటులో ప్రత్యేక హోదా హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ఆ మేరకు కేంద్రం కచ్చితంగా రాష్ట్రానికి హోదా ఇవ్వాల్సిన అవసరం ఉందని, ఇచ్చిన హామీపై వెనక్కుపోతే బీజేపీ దెబ్బతినే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు.
రాష్ట్రాన్ని ఆర్థికంగా ఎలా ఆదుకుంటారో చూసిన తర్వాత దానిపై స్పందిస్తానన్నారు. తనది ఎమ్మెల్యేకంటె ఎక్కువ స్థాయి కాదని, హోదా గురించి కేంద్రంతో మాట్లాడే స్థాయి తనకు లేదని చెప్పారు. ఢిల్లీ వెళ్లి కేంద్రాన్ని అడగాలంటే అంత సులభం కాదన్నారు. తనకు స్థాయి ఉందనుకుంటే రోడ్లపైకి వచ్చి పోరాడాలని, అది చేస్తే ప్రజల జీవితాలకే ఇబ్బంది కలుగుతుందని చెప్పారు. బంద్‌లు, రోడ్ల మీద ఆందోళనల వల్ల కేంద్రం పట్టించుకోదని అయినా ప్రజలకు మేలు జరుగుతుందంటే తాను చేయడానికి సిద్ధమేనని తెలిపారు. ఏదైనా కేంద్రం ప్రకటన వెలువడిన తర్వాతే దీనిపై స్పందిస్తానని ఆయన చెప్పారు.
బాక్సైట్‌పై బలవంతం చేయొద్దని కోరా...
అందరితో చర్చలు జరిపిన తర్వాత బాక్సైట్ తవ్వకాలపై నిర్ణయం తీసుకోవాలని, బలవంతం చేయొద్దని ముఖ్యమంత్రిని కోరానని పవన్ తెలిపారు. ముఖ్యమంత్రి కూడా అదే ఉద్దేశంతో ఉన్నారని, గిరిజనులను వేరే ప్రాంతానికి తరలించకుండా ఎలా చేయాలో ఆలోచిస్తున్నారని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ గిరిజనుల తరలింపు జరగదని తనకు చెప్పారని తెలిపారు. ఈ వ్యవహారం కొత్తగా వచ్చింది కాదని రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి ఉందని చెప్పారు. రాజధానిలో బలవంతంగా భూసేకరణ చేయకుండా ఉన్నందుకు కృతజ్ఞతలు చెప్పినట్లు తెలిపారు. ప్రభుత్వ దృష్టంతా రాజధానిపైనే ఉందని, దీనివల్ల వేరే ప్రాంతాల వారిలో రకరకాల అనుమానాలు, అపోహలున్న విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. ఈ క్షణం వరకూ ముఖ్యమంత్రితో జరిగిన చర్చలు ఆశాజనకంగానే ఉన్నాయని, ఏదైనాసరే ఎవరికీ ఏవిధమైన ఇబ్బంది లేకుండా చేస్తానని చెప్పారని తెలిపారు.
పార్టీని నడిపే స్థోమత లేదు...
పార్టీని విస్తరించాలంటే ఆర్థికంగా చాలా వనరులు కావాలని తనకు అంత స్థోమత లేదని పవన్ చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోటీ చేసే విషయం గురించి విలేకరులు ప్రశ్నించగా ఆయన పైవిధంగా స్పందించారు. జనాభిమానం ఉంటే సరిపోదని, పార్టీని పూర్తిస్థాయిలో నడపడంపై అందరితో చర్చిస్తానని తెలిపారు. ప్రస్తుతం తాను పూర్తిగా రాజకీయాల్లో ఉన్నట్లేనని, కానీ దానిపై ఎంత సమయం కేటాయించాలనే దానిపై చర్చిస్తానని చెప్పారు. 2019 నాటికి మాత్రం కచ్చితంగా పూర్తిస్థాయిలో ముందుకు వస్తానని స్పష్టం చేశారు. రాజధాని శంకుస్థాపనకు రాలేకపోయినందువల్ల ఇప్పుడు ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలిపినట్లు చెప్పారు. బీహార్ ఎన్నికలపై ఫలితాలపై మాట్లాడేందుకు ఆయన నిరాకరించారు.
పవన్‌ను వెంటబెట్టుకొచ్చిన కామినేని
వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ హైదరాబాద్ నుంచి పవన్ కల్యాణ్‌ను వెంటబెట్టుకుని తీసుకొచ్చారు. హైదరాబాద్‌లో బయలుదేరే ముందే కామినేని పవన్‌తో కొద్దిసేపు సమావేశమయ్యారు. అనంతరం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి తీసుకుకొచ్చారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఉదయం 11.30 గంటలకు సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. పవన్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు సాదరంగా స్వాగతం పలికి లోనికి తీసుకెళ్లారు. పవన్ చెప్పిన విషయాలపైనే కాకుండా రాజధాని నిర్మాణం, ప్రణాళిక గురించి చంద్రబాబు ఆయనకు వివరించినట్లు తెలిసింది. రాయలసీమలో రాజుకుంటున్న ప్రత్యేక ఉద్యమం, కాపులను ఓబీసీల్లో చేర్చే అంశంపైనా ఇరువురి మధ్యా చర్చ జరిగినట్లు సమాచారం. మధ్యాహ్నం 2 గంటలకు పవన్ క్యాంపు కార్యాలయం నుంచి తిరిగి వెళ్లారు.