పిఠాపురం బాలికల వసతిగృహంలో బూజుకట్టిన కందిపప్పు
సాక్షి ప్రతినిధి కాకినాడ / పిఠాపురం: చంద్రన్న పండుగ కానుకలు.. ఇప్పుడు వసతి గృహాల్లోని విద్యార్థుల ఆరోగ్యానికి పరీక్ష పెడుతున్నాయి. వసతి గృహాల్లో విద్యార్థులకు సన్నబియ్యం అన్నం, బలవర్ధకమైన కూరలు, పప్పుదినుసులు వండి వడ్డిస్తున్నామని ప్రభుత్వం ఒకవైపు ప్రకటనలు గుప్పిస్తోంది. కానీ మాటలకు, చేతలకు చాలా వ్యత్యాసం కనిపిస్తోందనడానికి చంద్రన్న కానుకలే తార్కాణం.
గత క్రిస్మస్, సంక్రాంతి పండుగలకు తూర్పు గోదావరి జిల్లాలో 16.43 లక్షల మంది తెల్లరేషన్ కార్డుదారులకు కిలో గోధుమపిండి, అర కిలో చొప్పున బెల్లం, శనగపప్పు, కందిపప్పు, వంటనూనె, 100 గ్రాముల చొప్పున నెయ్యిలతో కూడిన కిట్లు సిద్ధం చేశారు. క్రిస్మస్‌కు 4.15 లక్షల మందికి సరుకులు అందాయి. మిగతా సరుకులు సంక్రాంతి పండుగ సమయానికి ముందు పంపిణీ చేయాలని అధికారులు భావించారు. సర్వరు పనిచేయకపోవడం, ఇ-పాస్ యంత్రాలు మొరాయించడం, లబ్ధిదారుల వేలిముద్రలు పడకపోవడం తదితర కారణాల వల్ల 1.30 లక్షల మందికి సరుకులు అందలేదు.
ఈ లెక్కన 1.30 లక్షల కిలోల గోధుమ పిండి, 65 వేల కిలోల చొప్పున బెల్లం, శనగపప్పు, కందిపప్పు మిగిలిపోయాయి. వంట నూనె, నెయ్యి ప్యాకెట్లు కూడా ఆ మేరకు పంపిణీ కాలేదు. వాటిని చౌకడిపోల డీలర్లు వెనక్కి పంపేశారు. దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో ప్రభుత్వం మిగిలిపోయిన కిట్లను ఎలాగైనా వినియోగించాలని అధికారులను ఆదేశించింది. దీంతో కానుకల కిట్లను జిల్లాలో సాంఘిక సంక్షేమశాఖ వసతి గృహాలకు ఈనెల 1న పంపిణీ చేశారు.
తాకడానికే భయం..
జనవరి 7, 8 తేదీల్లో జిల్లాలోని రేషన్ దుకాణాలకు న చంద్రన్న కానుక కిట్లలోని సరుకులు నాసిరకం కావడంతో అప్పటికే పాడైపోయాయి. అందుకే ఉచితంగా ఇచ్చేవే అయినా చాలామంది లబ్ధిదారులు తీసుకోవడానికి వెనుకాడారు. పంపిణీ నాటికే బెల్లం నీరుకారిపోయి ముద్దగా మారింది. పుచ్చిపోయిన కందిపప్పు ఇస్తున్నారనే విమర్శలు వచ్చాయి. అయినా అధికారులు మాత్రం మిగిలిపోయిన సరుకులు వసతి గృహాలకు పంపిణీ చేయడానికి వెనుకాడలేదు.
అలా వచ్చిన బెల్లంతో పిఠాపురంలోని బాలికల వసతిగృహంలో ఇటీవల పరమాన్నం వండించారు. ఇది తిన్న విద్యార్థినుల్లో కొంతమందికి వాంతులు కావడంతో అస్వస్థతకు గురయ్యారు. దీంతో చంద్రన్న కానుక సరుకులేవీ వాడకుండా స్టోర్‌రూమ్‌లో మూలన పడేశారు. ఇప్పుడవి దుర్వాసన వెదజల్లుతున్నాయి. వాటిని ఏంచేయాలో తెలియక హాస్టల్ వార్డెన్లు తలపట్టుకుంటున్నారు.