చెన్నమనేని కన్నుమూత
అస్వస్థతతో తుదిశ్వాస విడిచిన తెలంగాణ సాయుధ పోరాట యోధుడు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్/సిరిసిల్ల/వేములవాడ: తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, కమ్యూనిస్టు దిగ్గజం, పేదల పక్షపాతి చెన్నమనేని రాజేశ్వర్‌రావు(93) ఇక లేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం తెల్లవారుజామున హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. మంగళవారం మధ్యాహ్నం హైదరాబాద్‌లో అధికారిక లాంఛనాలతో రాజేశ్వర్‌రావు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. చెన్నమనేనికి భార్య, కొడుకు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ప్రస్తుతం వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్... రాజేశ్వర్‌రావు కుమారుడే.
భూస్వామ్య కుటుంబంలో పుట్టిన చెన్నమనేని పేదలకు భూములు పంచాలనే ఆశయంతో విద్యార్థి దశ నుంచే పోరాట పంథా ఎంచుకున్నారు. విప్లవకారుడిగా, కార్మిక నేతగా, సీపీఐ సీనియర్ నాయకుడిగా పేదల పక్షాన నిలిచారు. తెల్లదొరల బానిసత్వానికి, నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేసిన చెన్నమనేని.. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలుకు వెళ్లారు. 1948 నుంచి 1951 వరకు జరిగిన విలీనం, తెలంగాణ రైతు ఉద్యమాల్లో పాల్గొని రైతు కూలీలకు అండగా నిలిచారు. పీడీఎఫ్ తరఫున ఒకసారి, సీపీఐ తరపున నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, ప్రతిపక్ష నేతగా సేవలందించిన రాజేశ్వర్‌రావు... 1999 ఎన్నికలకు ముందు సీపీఐకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. నాటి ఎన్నికల్లో తనయుడు చెన్నమనేని రమేశ్‌బాబుకు టీడీపీ టికెట్ ఖరారైనప్పటికీ పౌరసత్వం వివాదం నెలకొనడంతో రాజేశ్వర్‌రావు పోటీ చేయూల్సి వచ్చింది. ఆ ఎన్నికల్లో ఓటమి పాలైన రాజేశ్వర్‌రావు 2004లో మళ్లీ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. 2009 నుంచి క్రియూశీల రాజకీయాలకు పూర్తిగా దూరమయ్యూరు.
విద్యాభ్యాసం.. అజ్ఞాతవాసం!
చెన్నమనేని శ్రీనివాస్‌రావు-చంద్రమ్మ దంపతులకు 1923 ఆగస్టు 31న (కృష్ణాష్టమి రోజున) కరీంనగర్ జిల్లా బోయిన్‌పల్లి మండలం మాన్వాడలోని అమ్మమ్మ ఇంట్లో రాజేశ్వర్‌రావు జన్మించారు. శ్రీనివాస్‌రావు-చంద్రమ్మలకు రాజేశ్వర్‌రావు మొదటి సంతానం. మిగిలిన ముగ్గురు సోదరులు సీహెచ్ హన్మంతరావు, వెంకటేశ్వర్‌రావు, విద్యాసాగర్‌రావులు. వీరిలో చెన్నమనేని విద్యాసాగర్‌రావు ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్‌గా కొనసాగుతున్నారు. మరో సోదరుడు డాక్టర్ హన్మంతరావు గతంలో ప్రణాళికా సంఘం సభ్యుడిగా పనిచేశారు. రాజేశ్వర్‌రావు అమ్మమ్మ-తాత ఊరిలోనే ప్రాథమిక విద్యనభ్యసించారు.
కరీంనగర్‌లోని హైస్కూల్‌లో 3వ తరగతి నుంచి 10 తరగతి వరకు చదువుకున్నారు. పదహారేళ్ల వయసులో లలితమ్మతో వివాహం జరిగింది. 1943లో ఓయూలో అడుగుపెట్టడం రాజేశ్వర్‌రావు జీవితంలో కీలక మలుపు. ఇదే సమయంలో కమ్యూనిస్టు ఉద్యమ భావజాలం వైపు చెన్నమనేని మొగ్గు చూపారు. వామపక్ష ఉద్యమాల్లో పాలుపంచుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటూ భార్యతో సహా సాయుధ పోరాటం వైపు అడుగులు వేశారు. ముంబైలో రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్‌ను కలిసే అరుదైన అవకాశం రాజేశ్వర్‌రావుకు దక్కింది. 1947లో లా కాలేజీలో అడ్మిషన్ పొందిన చెన్నమనేని.. అదే సంవత్సరంలో తండ్రి అయ్యారు. మొదటి సంతానంగా పుట్టిన అమ్మాయికి అరుణ అని నామకరణం చేశారు. 1948లో విద్యార్థి ఉద్యమాన్ని లేవనెత్తుతూ అందరినీ చైతన్య పరచడంలో భాగంగా చెన్నమనేని అజ్ఞాత జీవనం ప్రారంభించారు.
సాయుధ పోరాట యోధుడిగా..
దున్నేవాడికే భూమి అనే నినాదంతో తెలంగాణలో రైతాంగ పోరాటం ప్రారంభమైంది. ఆ సమయంలో ప్రజాసంఘాల ఏర్పాటులో సీహెచ్ రాజేశ్వర్‌రావు పాలుపంచుకున్నారు. రైతు సంఘాలు, రైతు కూలీ సంఘాలను సంఘటితం చేస్తూ ఉద్యమాలను ముందుకు తీసుకెళ్లారు. బోయిన్‌పల్లి ప్రాంతంలో, వేములవాడ మండలం సంకెపల్లి గ్రామంలో, ఎల్లారెడ్డిపేట ఎగ్లాస్‌పూర్‌లో భూ పోరాటం నిర్వహించి వందల ఎకరాల భూమిని పేదలకు పంచారు. 1942లో భారత కమ్యూనిస్టు పార్టీలో చేరిన రాజేశ్వర్‌రావు వివిధ పదవుల్లో కొనసాగారు. నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు బావుటా ఎగురవేసి తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. ఈ క్రమంలో ఐదేళ్లు రహస్య జీవితం గడిపి, అనంతరం జైలు పాలయ్యూరు.
రైతు ప్రతినిధిగా విదేశీ పర్యటన
రైతుల కోసం చేసిన పోరాటంతో రైతు ప్రతినిధిగా రాజేశ్వర్‌రావుకు జర్మనీ వెళ్లే అవకాశం లభించింది. అంతర్జాతీయ యువజన మహాసభలో పాల్గొని మనదేశం తరపున సందేశం ఇచ్చారు. అలాగే మార్క్సిజం- లెనినిజంపై మాస్కో పర్యటనకు 30 మంది సభ్యులతో కూడిన బృందంతో సోవియట్ రష్యాకు వెళ్లొచ్చారు. వేములవాడలో సంగీత నిలయం పేరుతో ఇంటి నిర్మాణం చేపట్టారు. అందులోనే సేవ్స్ స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసి సిరిసిల్ల డివిజన్‌లో తాగునీరు, విద్య, వైద్యం వ్యాప్తి కోసం ప్రభుత్వ సహకారంతో అనేక పనులు చేపట్టారు. నా జీవితం తెరచిన పుస్తకం లాంటిదంటూ తాను స్వయంగా రాసుకున్న సత్యశోధన పుస్తకంలో రాజేశ్వర్‌రావు ప్రస్తావించారు. తన పుట్టుక నుంచి కుటుంబ నేపథ్యం, విద్యార్థి దశ, పోరాటాలు, విప్లవాలు, ఉద్యమం, రాజకీయ ప్రవేశంలాంటి అనేక ఘట్టాలను అందులో పొందుపరిచారు.
రెండేళ్లుగా అస్వస్థత
గత రెండేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న రాజేశ్వర్‌రావు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరుమాసాల కిందట ఇంట్లో జారి పడటంతో తుంటి ఎముక విరిగింది. అప్పట్నుంచి ఆరోగ్యం మరింత క్షీణించింది. ఈ క్రమంలో సోమవారం వేకువజామున 3 గంటలకు ఆయన మరణించినట్లు కుటుంబ సభ్యులు ప్రకటించారు. జర్మనీ వెళ్లిన రమేశ్‌బాబు మంగళవారం వేకువజామున హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. రాజేశ్వర్‌రావు అంత్యక్రియలు హైదరాబాద్‌లోని ఫిలింనగర్ సమీపంలోని మహాప్రస్థానంలో జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా, ఆయన అంత్యక్రియలను పోలీస్ లాంఛనాలతో అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సీఎం కె.చంద్రశేఖర్‌రావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మను ఆదేశించారు.
రాష్ట్ర రాజకీయాలపై తనదైన ముద్ర
ఐదున్నర దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో రాజేశ్వర్‌రావు మచ్చలేని నేతగా పేరు సంపాదించారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన చెన్నమనేని ప్రతిసారి ప్రతిపక్షంలో ఉండడం విశేషం. ఒకసారి గెలుస్తూ.. మరోసారి ఓడుతూ.. రాజకీయాల్లో ఆటుపోట్లను అనుభవించిన ఆయన రాష్ర్ట రాజకీయాలపై చెరగని ముద్రవేశారు. 1957లో చొప్పదండి నుంచి పీడీఎఫ్ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా గెలుపొందిన రాజేశ్వర్‌రావు.. 1967, 1978, 1985, 1994లో సిరిసిల్ల నుంచి సీపీఐ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. 2004లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యూరు. 1998లో తెలంగాణ స్వాతంత్య్ర సమరయోధుల స్క్రీనింగ్ కమిటీకి చైర్మన్‌గా కొనసాగారు. 1985 నుంచి 1989 వరకు శాసనసభలో సీపీఐ పక్షనేతగా సేవలందించారు. అదే సమయంలో ఆయన సోదరుడు సీహెచ్.విద్యాసాగర్‌రావు బీజేపీ పక్షనేతగా కొనసాగడం విశేషం.
వైఎస్సార్‌తో అనుబంధం
మేఘం వర్షించింది.. వనం గర్జించింది.. ప్రకృతి శాసించింది.. ఓ నేత కథ ముగిసింది.. ఇదిగో అభిమానం కన్నీరైంది.. అదిగో ప్రజాహృదయం తల్లడిల్లింది.. అయ్యో జీవన గమనం అస్తవ్యస్తమైంది.. ఓ నాయకుడా నీ చరిత్ర చిరస్మరణీయం.. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణంపై తన ఆత్మకథలో చెన్నమనేని రాజేశ్వర్‌రావు ఆవేదన ఇదీ! వైఎస్‌తో సైద్ధాంతిక పరంగా విభేదాలున్నా.. సమర్థవంతమైన నాయకుడిగా రాజశేఖరరెడ్డికి మంచి పేరు ఉందని రాజేశ్వర్‌రావు ఆ పుస్తకంలో పేర్కొన్నారు. వైఎస్సార్ ప్రవేశపెట్టిన రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని అభినందిస్తూ పేద ప్రజలకు కార్పొరేట్ సేవలను దరిచేర్చిందన్నారు. ప్రభుత్వమే పేదల జబ్బులకు డబ్బులు చెల్లించే విధానం భేష్ అంటూ కీర్తించారు. 108, 104 సేవలను అభినందించారు. అప్పటి సిరిసిల్ల నియోజకవర్గంలోని చందుర్తి మండలం మల్యాలకు వైఎస్ వచ్చినప్పుడు సిరిసిల్ల ప్రాంత అభివృద్ధికి రాజేశ్వర్‌రావు ప్రతిపాదనలు అందించారు.
- సిరిసిల్ల
సీఎం కేసీఆర్ సంతాపం
చెన్నమనేని రాజేశ్వర్‌రావు మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతా పం తెలిపారు. బంజారాహిల్స్‌లోని చెన్నమనేని ఇంటికి వెళ్లి ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఎంపీ వినోద్‌కుమార్ (చెన్నమనేని మేనల్లుడు) ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.
రైతుల కోసం ఎంతో కృషి చేశారు: చంద్రబాబు
చెన్నమనేని రాజేశ్వర్‌రావు జాతీయ స్థాయిలో రైతు సమస్యల పరిష్కారానికి ఎంతగానో కృషి చేశారని ఏపీ సీఎం చంద్రబాబు, ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు వేర్వేరు ప్రకటనల్లో పేర్కొన్నారు. ఆయన మృతికి సంతాపం తెలిపారు.
చెన్నమనేని మృతికి జగన్ సంతాపం
సీనియర్ రాజకీయ వేత్త చెన్నమనేని రాజేశ్వర్‌రావు మృతిపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. రాజేశ్వర్‌రావు అత్యున్నత నైతిక విలువలకు కట్టుబడి, తుది శ్వాస వరకూ విశిష్టమైన వ్యక్తిగా నిలిచారని జగన్ కొనియాడారు. రాజేశ్వర్‌రావు కుటుంబ సభ్యులకు జగన్ సోమవారం తన ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేశారు.
ప్రముఖుల సంతాపం
టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ప్రతిపక్ష నాయకుడు కె.జానారెడ్డి, సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, సీపీఐ ఎమ్మెల్యే రవీంద్రకుమార్, సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, ఎంపీసీఐ (యూ) జాతీయ ప్రధాన కార్యదర్శి ఎండీ గౌస్, కేంద్ర కమిటీ సభ్యుడు మద్దికాయల అశోక్, లోక్‌సత్తా నేత జయప్రకాష్‌నారాయణ, సమరయోధుల సంఘం నేతలు ఏటుకూరి కృష్ణమూర్తి, కె.ప్రతాపరెడ్డి, ఏపీ సీపీఐ కార్యదర్శి కె.రామకృష్ణ, ఏపీ సీపీఎం కార్యదర్శి పి.మధు తదితరులు చెన్నమనేని మృతి పట్ల సంతాపం తెలిపారు.